‘రైతు సాధికారిక సంస్థ’ ఏర్పాటు | 'Farmer empowering the company to set up | Sakshi
Sakshi News home page

‘రైతు సాధికారిక సంస్థ’ ఏర్పాటు

Published Sun, Oct 5 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

‘రైతు సాధికారిక సంస్థ’ ఏర్పాటు

‘రైతు సాధికారిక సంస్థ’ ఏర్పాటు

ఈ సంస్థే రైతు రుణ విముక్తి పథకాలకు ప్రధాన ఏజెన్సీ
విజయవాడ కేంద్రంగా విధులు.. 22 కల్లా కార్యకలాపాలు ప్రారంభం
రూ. కోటి మూలధనంతో కంపెనీల చట్టం కింద సంస్థ ఏర్పాటు
రూ.5వేల కోట్లను సంస్థకు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశం

 
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు సాధికారిక సంస్థ’ను ఏర్పాటు చేసింది. రూ.కోటి  మూలధనంతో కంపెనీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు వ్యవసాయ, పశు సంవర్థక, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు వ్యవస్థాపక డెరైక్టర్లుగా వ్యవహరిస్తారు. వ్యవసాయ శాఖ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. ఈ నెల 22కల్లా సంస్థ పూర్తిస్థాయి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. రైతుల రుణ విముక్తికి బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.5 వేల కోట్లను రైతు సాధికారిక సంస్థకు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంస్థ సమర్థంగా పనిచేసేందుకు, లక్ష్యాలను సాధించేందుకు జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు, అధికారులు, రైతు ప్రతినిధులు, తదితరులకు దీన్లో స్థానం కల్పిస్తారు. మున్ముందు వ్యవసాయ, సహకార శాఖ అధీనంలో పనిచేసే కార్పొరేషన్లు, సొసైటీలను దీన్లో విలీనం చేస్తారు. ఈ సంస్థ సమర్థంగా పనిచేసేందుకు తగు విధానాలను రూపొందించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.

వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలతో సంస్థాగత, నిర్వహణపరంగా సంస్థను అనుసంధానం చేయాలని కూడా ఆదేశించింది. రైతులు రుణ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు, అప్పులు తీసుకునేందుకు ఈ సంస్థకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలో రైతు రుణ విముక్తి పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికిది ప్రధాన ఏజెన్సీగా ఉంటుంది. ఈ సంస్థ రిజిస్ట్రేషన్‌కు, 22వ తేదీకల్లా కార్యకలాపాలను ప్రారంభించేందుకు  చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అంతేకాక లబ్ధిదారులు, వ్యవసాయ శాఖ, ఇతర బ్యాంకులు, కీలక సంస్థలను సంప్రదించి రైతు రుణ విముక్తికి అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.

సంస్థ ప్రధాన లక్ష్యాలు..

► రాష్ట్రంలో వ్యవసాయ రంగం విలువ పెం చడం, అత్యధిక ఉత్పాదకత సాధించే దిశగా రైతుల్ని ప్రోత్సహించటం..  అవసరమైన ప్రణాళికలు, అమలు, సంక్షేమ సమీక్ష, అభివృద్ధి, సామర్థ్యం పెంపు, ఇతర కార్యకలాపాలకు ఏకీకృత సాధికార సంస్థను ఏర్పాటు చేయడం.

► రైతులకు సాధికారికత కల్పించేలా ఆర్థిక మద్దతు, సాంకేతిక సాయం, సాంకేతిక అంశాల బదిలీ, వ్యసాయ రుణ విముక్తి తదితర చర్యలు  చేపట్టడం. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ, పశు, మత్స్య, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత రంగాల విలువను పెంచి, అత్యధిక ఉత్పాదకత కార్యక్రమాలు చేపట్టడం.

► వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన మద్దతు, సాయం, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించడం. అలాగే రైతుల బృందాలు, సంఘాలు, సొసైటీలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, ఇతర రకాల సాయం అందించడం.

► వ్యవసాయ వృద్ధిని వేగవంతం చేసేందుకు, రైతుల సాధికారత కోసం సమర్థవంతమైన విధానాలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడం, సలహాలు ఇవ్వడం.

► ఈ లక్ష్యాలన్నింటినీ సాధించేందుకు గ్రాంట్లు, సబ్సిడీ, సెస్, లెవీల రూపంలో ప్రభుత్వ, ఇతర సంస్థల ద్వారా నిధులు స్వీకరించడం.

► బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఫండ్స్, ప్రజల, ప్రభుత్వాల నుంచి రుణాలు, బాండ్లు, డిబెంచర్లు, మానిటరీ వాల్యూ సర్టిఫికెట్లు తదితరమైన వాటి ద్వారా నిధులు సేకరించడం.
 
రూ.5వేల కోట్లు ఏ మూలకు?
 
రుణ మాఫీ కోసం సాధికారిక సంస్థను ఏర్పాటు చేయటం వరకూ బాగానే ఉన్నా... రుణ మాఫీపై మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వకుండానే రోజులు నెట్టుకొచ్చేస్తోంది. ఎందుకంటే సాధికారిక సంస్థకోసం సర్కారు కేటాయించింది రూ.5వేల కోట్లు. కానీ మాఫీ చేయాల్సిన మొత్తం మాత్రం వ్యవసాయ రుణాలు రూ.87వేల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.14వేల కోట్లు కలిపి మొత్తం రూ.1.01 లక్షల కోట్ల మేర ఉంది. దీనిపై గడిచిన ఏడాదికి గాను ప్రస్తుతం వడ్డీయే రూ.14 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. మరి ప్రభుత్వం జీవో ద్వారా కేటాయించిన రూ.5వేల కోట్లు వడ్డీ చెల్లించడానికి కూడా సరిపోవు. ఈ లెక్కన రుణాలెలా మాఫీ అవుతాయి? ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఏమాత్రం స్పష్టతనివ్వకపోవటంతో ఆంధ్రప్రదేశ్ రైతులు ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల నుంచి పైసా కూడా రుణ రూపేణా తీసుకోలేకపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement