అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
రూ.5 కోట్ల వరకు ఆదాయం అంచనా
తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై చెక్ పోస్టుల వద్ద తెలంగాణ వాహనాల నుంచి ప్రవేశ పన్ను వసూలు చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలపై ప్రవేశ పన్ను విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై చెక్‌పోస్టుల వద్ద తెలంగాణ వాహనాల నుంచి ప్రవేశ పన్ను వసూలు చేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఎంట్రీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేసింది. తెలంగాణలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను విధించింది. ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడం, ఉపసంహరణకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించక పోవడంతో.. అప్పట్లోనే ఏపీ ప్రభుత్వం కూడా ప్రవేశ పన్నును అమలు చేద్దామని భావించింది. రవాణా శాఖ అధికారులకు.. ఆ మేరకు లెక్కలు తీయాలని, ఏ మేరకు ఆదాయం లభిస్తుందో పరిశీలించాలని ఆదేశాలిచ్చింది. తెలంగాణ కంటే ఏపీకి తక్కువ ఆదాయం వస్తుందని తేలడంతో వెనక్కు తగ్గింది. పన్ను ఉపసంహరణపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు, చర్చలు అంటూ హడావుడి చేసినా ఫలితం లేకపోవడంతో రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు కేంద్ర రవాణా మంత్రి గడ్కారీకి ఫిర్యాదు చేశారు. ఇందులో తాము జోక్యం చేసుకోబోమని గడ్కారీతో పాటు మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌లు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ ప్రైవేట్ బస్ ఆపరేటర్ల సంఘం, లారీ యజమానుల అసోసియేషన్‌లు కోర్టులను ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు కనీసం పిటిషన్‌ను స్వీకరించడానికి కూడా నిరాకరించింది.
ఈ నేపథ్యంలోనే.. తెలంగాణకు చెందిన వాణిజ్య వాహనాలు, లారీలు, స్టేజి క్యారియర్లుగా తిరిగే బస్సులు రాష్ట్రంలో ప్రవేశిస్తే పన్ను విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన కారణంగా నిర్ణయం అమలు కొంతకాలం వాయిదా పడినా.. శుక్రవారం ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు గ్రానైట్ లారీలు తిరుగుతుండటం, తిరుమల, శ్రీశైలం క్షేత్రాలకు ఆ రాష్ట్రం నుంచి భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉన్నందున.. ఎంట్రీ ట్యాక్స్ ద్వారా నెలకు నాలుగైదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
టీ వాహనాలపై ప్రవేశ పన్ను
Published Sat, Apr 25 2015 12:58 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement