
పెద్దేరులో రైతు గల్లంతు
లభ్యం కానీ ఆచూకీ
చోడవరం : పెద్దేరులో ప్రమాదవశాత్తూ పడి భోగాపురంనకు చెందిన రైతు రాపేట గణేష్(33) గల్లంతయ్యారు. తన పొలం సమీపంలో ఉన్న పెద్దేరులో స్నానం చేసేందుకు బుధవారం దిగిన కొద్ది సేపటికే ఆయన కనిపించకపోవడంతో భోగాపురంలో తీవ్ర విషాదం అలముకుంది. చోడవరం మండలం భోగాపురంనకు చెందిన రైతుల పొలాలన్నీ శారదా నది అవతల, పెద్దేరు నదికి ఆనుకొని ఉన్నాయి. మూడు నదులు ఇదే గ్రామం వద్ద శారదాలో కలుస్తాయి. ఇక్కడే ఉన్న తన పొలంలో రోజూ లాగే బుధవారం ఉదయం గణేష్ వెళ్లారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని స్నానానికి నదిలోకి దిగగా.. అప్పటికే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు.
ఇది గమనించిన తోటి రైతులు వెంటనే వెతికే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి.. పొద్దుపోయే వరకు ఇటు పెద్దేరు, అటు దిగువన ఉన్న శారదా నదుల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యంకాలేదు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రామునాయుడు, ఎస్‌ఐ రమణయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గణేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకొని భార్య,పిల్లలు, బంధువులు బోరున విలపించారు. గ్రామమంతా శోకసంద్రమైంది.
గుర్తు తెలియని బాలిక గల్లంతు
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాది వద్ద పెద్దేరులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన ఎనిమిదేళ్ల గుర్తు తెలియని బాలిక నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. చెత్తకాగితాలు ఎరుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె కుటుంబ సభ్యులు ఇటీవల వడ్డాది వచ్చారు. పగలు ఇక్కడ కాగితాలు ఎరుకుంటూ.. రాత్రి సంతబయల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులకు సమాచారం అందలేదు.