సాక్షి, అమరావతి : అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్లుగా కుచ్చుటోపీ పెడుతున్నారు. ఎన్నికల ముందు కూడా ఆయన ఇదే వైఖరి అవలంబిస్తుండటంపట్ల రైతులు మండిపడుతున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రైతులకు రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎగవేసింది. ఇది చాలాదన్నట్లు 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. తర్వాత దానిని రూ.692.67 కోట్లకు కుదించి రైతులకు రూ.375 కోట్ల మేర కోత వేసింది. వెరసి విపత్తు బాధిత రైతులకు బాబు సర్కారు ఎగవేసిన పెట్టుబడి రాయితీ మొత్తం రూ.2,725 కోట్లకు పెరిగింది. దీంతో చంద్రబాబు ‘ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. అంతేకాక.. ఐదేళ్లుగా వరుస దుర్భిక్ష పరిస్థితులవల్ల పంటలు కోల్పోయినా వారికి పెట్టుబడి రాయితీ ఎగవేయడమే కాక, కరువు మండలాలను తక్కువగా ప్రకటించారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో అసత్య హామీలిస్తున్న బాబు.. రైతులకు ఇవ్వాల్సిన బకాయిల విడుదలకు మాత్రం చర్యలు తీసుకోవడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
రూ.13,280 కోట్ల రైతుల బిల్లులు పెండింగ్‌లో..
ఇదిలా ఉంటే.. విలాసవంతులు, సంపన్నులు తిరిగే విమానాలకు చంద్రబాబు సర్కారు ఇంధన సబ్సిడీ ఇస్తోంది. ఇది చాలదన్నట్లు విజయవాడ నుంచి తిరిగే విమానాలకు గిట్టుబాటుకాకపోతే ప్రభుత్వమే లోటు పూడ్చుతోంది. ఫైవ్‌స్టార్ హోటళ్లు, లక్షల్లో ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలు, ఫక్తు వ్యాపార దృక్పథంతో ఏర్పాటుచేస్తున్న పరిశ్రమలకే కాకుండా.. కాగితాలకే పరిమితమైన వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తోంది. కానీ, ఆరుగాలం కష్టపడే రైతులకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం పెండింగ్‌లో పెడుతోంది. తద్వారా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని వ్యవసాయ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఉన్న రైతుల రుణం మొత్తం రూ.87,612 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే కోటయ్య కమిటీ పేరుతో రకరకాల షరతులు విధించి రూ.63,000 కోట్లకు పైగా ఎగవేశారు. అంతేకాక.. సర్కారు లెక్కల ప్రకారమే మూడు, నాలుగు విడతల రుణమాఫీ కింద చెల్లించాల్సిన సొమ్ము కూడా ఇప్పటివరకూ రైతుల
ఖాతాల్లో జమకాలేదు.
ఇదిలా ఉంటే.. 2015–16లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఇప్పటికీ సర్కారు పెండింగులోనే పెట్టింది. గత ఏడాది ఖరీఫ్‌లో కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్ల పెట్టుబడి రాయితీ ఇంకా చెల్లించలేదు. 2018 రబీ సీజన్‌లో ప్రభుత్వం 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 450 మండలాల్లో దుర్భిక్షం ఉన్నప్పటికీ 257 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చడంపై విమర్శలు రావడంతో జిల్లాల కలెక్టర్లు మరో 90 మండలాలను కరువు జాబితాలో ప్రకటించాలన్న ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 2018 రబీ సీజన్‌లో దుర్భిక్ష బాధిత రైతులకు ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
వ్యవసాయోత్పత్తుల బిల్లులూ చెల్లించని బాబు
రైతులకు రావాల్సిన రకరకాల బిల్లులను బాబు సర్కారు పెండింగులో పెట్టింది. కరువు కాలంలో అష్టకష్టాలు పడి పండించిన వ్యవసాయోత్పత్తులను విక్రయించిన రైతులకు సర్కారు మొండిచేయి చూపించింది. అలాగే..
►మొక్కజొన్నను ప్రభుత్వానికి విక్రయించిన వారికి రూ.200 కోట్లు పైగా బిల్లులు చెల్లించలేదు. ఈ డబ్బుకోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
►పౌరసరఫరాల శాఖ గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన వారికి ఇప్పటికీ డబ్బులివ్వలేదు.
►విపత్తు బాధిత రైతులూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
►బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా పెండింగులోనే ఉన్నాయి.
►ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్నచిన్న నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను కూడా పెండింగులో పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment