అన్నదాత ఆగ్రహం | farmers are fight against water to crops | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆగ్రహం

Published Sat, Dec 21 2013 3:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

farmers are fight against water to crops

    సాగునీటి కోసం లోసరి కాలువ ఆయకట్టు రైతుల పోరాటం
     ఇరిగేషన్ అధికారుల తీరుపై నిరసన
     నేడు కలెక్టరేట్ ఎదుట బైఠారుుంపు
     సంఘీభావం ప్రకటించిన బీజేపీ
 
 భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ :
 భీమవరం మండలంలోని లోసరి మెయిన్ కెనాల్ ఆయకట్టు పరిధిలోని రైతులకు విత్తనాలిచ్చారు.. నారుమళ్లు పోసుకోమన్నారు.. నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో ఇరిగేషన్ అధికారులు కాలువకు అడ్డుకట్టలు వేసి సాగునీటి సరఫరాను నిలిపివేశారు. ఇదేంటని అడిగితే.. అదంతే అంటున్నారు. దీంతో నాలుగు రోజు ల క్రితం ఆందోళనకు దిగిన అన్నదాతలు కాలువపై వేసిన అడ్డుకట్టలను తొలగిం చారు. ఆ మరుక్షణమే ఇరిగేషన్ అధికారులు మళ్లీ అడ్డుకట్టలు వేశారు. ఆవేదనకు గురైన రైతులు భీమవరం తహసిల్దార్ కార్యాల యూనికి చేరుకున్నారు. సాగునీరు ఇప్పించాలంటూ గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ బైఠాయించారు. వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు.
 
  శుక్రవారం మధ్యాహ్నం కూడా ఇదేపని చేశారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు అధికారులు సీఆర్‌పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. రైతులు వేసిన టెంట్‌ను రెవెన్యూ అధికారులు తొలగిం చారు. వంటావార్పు కోసం తెచ్చుకున్న సామగ్రిని బలవంతంగా లాక్కుని  తహసిల్దార్ కార్యాలయంలో దాచేశారు. చివరకు రైతులందర్నీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పరిస్థితిని గమనిం చిన రైతులు ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా విరమించారు. శనివా రం ఏలూరు వెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
 
 భారీగా మోహరించిన పోలీసులు
 గురువారం ఉదయం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోయూరు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టూటౌన్ సీఐ జయసూర్య ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్సై విజయకుమార్, రూరల్ ఎస్సై ప్రసాదరావు, సిబ్బందితోపాటు భీమవరంలో మకాం వేసిన సీఆర్‌పీఎఫ్ బలగాలను తహసిల్దార్ కార్యాలయం వద్ద మోహరించారు.
 
 రైతుల్ని నష్టపరుస్తారా?
 పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రుద్రరాజు సత్యనారాయణరాజు (పండురాజు) లబ్ధి కోసం రైతులను నష్టపరుస్తారా అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ శాఖ అధ్యక్షుడు రేవు రామకృష్ణ అధికారులను నిలదీ శారు. సార్వాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, దాళ్వాకు అనుమతి ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లోసరి కెనాల్‌కు వేసిన అడ్డుకట్టను రైతులు తొలగిం చిన సమయంలో నరసాపురం ఆర్డీవో వసంతరావు వచ్చారని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు మరోసారి అడ్డుకట్ట వేయడం దారుణమన్నారు. సాగునీరు ఇవ్వలేనప్పుడు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలను ఎందుకు సరఫరా చేశారని ప్రశ్నించారు. మొత్తం 3,500 ఎకరాల్లో రైతులు నారుమళ్లు వేశారని, ఇప్పుడు దాళ్వా వేయవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.
 
 అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారని, రైతుల గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు. ఆందోళన కార్యక్రమంలో కొప్పర్తి వెంకట రామారావు, గుద్దటి రవికుమార్, బొమ్మిడి శ్రీనివాస్, రేవు రామకృష్ణ, గుద్దటి చంద్రరావు, రామాయణం ఏడుకొండలు, భూసారపు అమ్మిరాజు, ఆరేటి సత్యనారాయణ, బోడపాటి రామకృష్ణ, జడ్డు పెదకాపు, ఆకుల నరసింహమూర్తి, ముత్యాలరావు, ఇంటి రామకృష్ణ, కొప్పర్తి భాస్కరరావు, పలువురు మహిళా రైతులు పాల్గొన్నారు.
 
 బీజేపీ నాయకుల సంఘీభావం
 తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగర్ల ప్రభాకర గాంధీ తదితరులు కలిశారు. వారు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రైతులను నష్టాల పాల్జేసి కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చేవిధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని శ్రీనివాసవర్మ ధ్వజమెత్తారు. రైతులకు తాము అండగా ఉంటామని, కాంట్రాక్టర్ ఆటల్ని సాగనివ్వబోమని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement