మేమే... బాబు ప్రభుత్వానికి చందాలిస్తాం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో భూములిచ్చేది లేదని మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలోని రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే తామే ఎకరాకు ప్రభుత్వానికి రూ. లక్ష చొప్పున చందాలు ఇస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతు, కూలీల పరిరక్షణ కమిటీ గురువారం మంగళగిరి మండలంలోని నిడమర్రులో పర్యటించింది. ఈ సందర్భంగా రాజధానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెలిపారు. తామంతా ఈ భూమినే నమ్ముకున్నామని చెప్పారు.
పంట భూమి తమ కుటుంబంతో పెనవేసుకుని పోయిందని తెలిపారు. అలాంటి భూమిని రాజధాని నిర్మాణానికి ఇవ్వాలంటే మనస్సు అంగీకరించడం లేదని అన్నారు. రైతులు అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతు, కూలీల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ... రైతులు చంద్రబాబును నమ్మడం లేదన్నారు. రుణమాఫీ అంశంలో చంద్రబాబు ఏం చేశారో రైతులు ఇప్పటికే గుర్తించారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును రైతులు నమ్మె పరిస్థితి లేదని ధర్మాన వెల్లడించారు.