=కాంగ్రెస్ తీరుపై నాగిరెడ్డి ఆగ్రహం
=ధాన్యం ధర ప్రకటించకపోవడంపై నిరసన
=బొమ్మినంపాడులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా
బొమ్మినంపాడు (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని రైతుల నడ్డివిరిచే చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు శాస్తి తప్పదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. బీపీటీ రకం ధాన్యానికి ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండలంలోని బొమ్మినంపాడు వద్ద జాతీయరహదారిపై రైతులతో సోమవారం ధర్నా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రైతులను వంచిస్తున్నారు...
రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతూ మోసగిస్తున్నాయని నాగిరెడ్డి విమర్శించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్వింటాలు ధాన్యానికి రూ.30 మాత్రమే మద్దతు ధర పెంచడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్వింటాలు ధాన్యానికి రూ.2 వేలు చెల్లిస్తామని ప్రచారం చేయడం రైతులను వంచించడమేనన్నారు.
దివంగత వైఎస్ హయాంలో మినహా ఏ ప్రభుత్వమూ ధాన్యం ధర గణనీయంగా పెంచలేదని గుర్తుచేశారు. మార్కెట్‌లో సన్న బియ్యం ధరలను నియంత్రించేందుకు గతేడాది ఈ రకం ధాన్యం క్వింటాలు రూ.1,500 కొనుగోలు ధరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సార్వా వరి కోతలు మరికొద్దిరోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రారంభమవుతాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు బీపీటీ వంటి సన్నరకాల ధాన్యం ధర ప్రకటించకపోవడం దారుణమన్నారు. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర నిర్ణయించకుండా ధాన్యం ఎలా కొంటారు...
నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిందన్నారు. సన్నరకాల ధాన్యం ధర నిర్ణయించకుండా ఏవిధంగా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. పార్టీ మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు,సేవాదళ్ మండల కన్వీనర్ తాళ్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బొబ్బిలి రత్తయ్యనాయుడు, నాగిరెడ్డి శివప్రసాద్ మాట్లాడారు. బొమ్మినంపాడు, ములకలపల్లి, కొర్రగుంటపాలెం గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులు ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.