రుణమాఫీ అనగానే వద్దు ‘బాబూ’ అంటూ బెంబేలు | Farmers Don't Trust On Tdp Government | Sakshi
Sakshi News home page

రుణమాఫీ అనగానే వద్దు ‘బాబూ’ అంటూ బెంబేలు

Published Sun, Mar 17 2019 11:35 AM | Last Updated on Sun, Mar 17 2019 11:58 AM

Farmers Don't Trust On Tdp Government - Sakshi

సాక్షి, అనంతపురం: రుణమాఫీ అనగానే రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. రుణమాఫీ హామీ ప్రకటించే నాటికి రుణాలు కట్టని రైతులతో పాటు కట్టిన రైతులకూ తనదైన శైలిలో న్యాయం చేసి శభాష్‌ అనిపించుకున్నారు. కరువు కాటకం సంభవించిన 2008లో 6.63 లక్షల మంది రైతులకు నెల రోజుల వ్యవధిలోనే ఒకే విడత కింద రూ.733 కోట్లు లబ్ధి చేకూర్చారు. అప్పట్లో రూ.733 కోట్లు అంటే ఆషామాషీ కాదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.  


రైతులకు భరోసా.. 
కరువు పరిస్థితులు ఏర్పడిన కష్ట కాలంలో భయపడవద్దు... నేనున్నా... అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘అనంత’ రైతుల్లో భరోసా ఇచ్చాడు. 2008లో కరువు కరాళనృత్యం చేస్తున్న పరిస్థితుల్లో  వైఎస్సార్‌ కేంద్ర ప్రభుత్వ సాయంతో రుణమాఫీకి చర్యలు చేపట్టాడు.  జిల్లాలో 3.04 లక్షల మంది రైతులకు  రూ.555 కోట్లు ఒకేసారి మాఫీ చేశారు. నెల రోజుల్లోనే రైతులను రుణ విముక్తులను చేశారు. అప్పట్లో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏ జిల్లాలోనూ జరగలేదు. వైఎస్సార్‌ ఆదుకునే చర్యలు చేపట్టడంతో లక్షల రైతు కుటుంబాల ఇంట ఆనందం తాండవించింది.  ఫలితంగా ఇప్పటికీ ఎప్పటికీ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతు హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. 


ఇది బాబు మార్క్‌ మాఫీ  
సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ అంటేనే రైతులు జడుసుకుంటున్నారు. రుణమాఫీ అనగానే వద్దు ‘బాబూ’ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి 2014 ఎన్నికల్లో రైతుల నుంచి ఓట్లు దండుకున్న చంద్రబాబు సీఎం పీఠం ఎక్కగానే స్వరం మార్చేశారు. కొర్రీలు, కమిటీలు, షరతులు విధించి మాఫీ సొమ్మును బాగా తగ్గించేశారు. 2013 డిసెంబర్‌ నాటికి జిల్లా వ్యాప్తంగా పంట, బంగారు, వ్యవసాయ అనుబంధరంగాల రుణాలు 10.24 లక్షల అకౌంట్ల పరిధిలో రూ.6,817 కోట్లు రుణాలు ఉంటే చివరకు రూ.2,744 కోట్లు మాఫీకి ఒప్పుకున్నారు. ఐదేళ్లవుతున్నా ఇంకా 1,165 కోట్లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. విడతలు వారీ, రుణమాఫీ పత్రాలు, రుణమాఫీ వేదికలు, గ్రీవెన్స్‌లు, చెక్కులు అంటూ ఐదేళ్ల నుంచి రైతులకు కంటినిండా నిద్ర లేకుండా చేశారు.

ఐదేళ్లవుతున్నా చంద్రబాబు మాఫీ మాయ నుంచి రైతులు ఇప్పటికీ తేరుకోలేదు. అసలు ఎంత, వడ్డీ  ఎంత, ఎంత మాఫీ అయింది, ఎంత సొమ్ము జమ అయిందనేది రైతులకు అర్థం కాకుండా పోయింది. రుణమాఫీ కోసం మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రం, హైదరాబాద్, విజయవాడ, గన్నవరం, బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. మాఫీ అయిన సొమ్ము కన్నా రోజుల తరబడి అటుఇటు తిరగడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన వారు వేలల్లో ఉన్నారు. ఇపుడు ఎన్నికలు సమీపించడంతో రైతులు గుర్తుకు రావడం ఎన్నికల కోడ్‌ ప్రకటించిన సమయంలోనే 4, 5వ విడత రుణమాఫీ సొమ్ము ఇస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ఎత్తుగడ కింద ప్రకటించడంతో రైతులు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.  


 

రుణాలు కట్టిన రైతులకు ప్రోత్సాహకం 
వైఎస్సార్‌ 2008లో రుణమాఫీ చేసే సమాయానికి అప్పటికే చాలా మంది రైతులు తమ రుణాలు  చెల్లించారు. వారిని గౌరవిస్తున్నట్లు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సగర్వంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా రుణాలు చెల్లించిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం కింద అందజేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 3.59 లక్షల మంది రైతులకు రూ.178 కోట్లు పంపిణీ చేశారు. 2008లో ఇచ్చిన ప్రోత్సాహకాలు, రుణమాఫీతో 6.63 లక్షల మందికి ఒకే విడత కింద రూ.733 కోట్లు లబ్ధిచేకూర్చడంతో రైతు ఇంట సంబరాలు చేసుకున్నారు. అదే ఏడాది వేరుశనగ, ఇతర పంటల నష్టానికి గ్రామం యూనిట్‌గా  పంటల బీమా పథకం ద్వారా 5.20 లక్షల మందికి రూ.620 కోట్లు పరిహారం అందించారు. పావలా వడ్డీ కింద మరో రూ.42 కోట్లు అందించారు. ఇలా 2008లో ఒకే సంవత్సరం జిల్లా రైతులకు ఏకంగా రూ.1,400 కోట్ల వరకు లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. 


వైఎస్సార్‌ చలువతో రూ.5 లక్షల రుణమాఫీ 
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతోనే నా బ్యాంకు రుణం రూ.5 లక్షలు మాఫీ అయ్యింది. 2008లో పామిడి ఆంధ్రాబ్యాంకులో స్వరాజ్‌ ట్రాక్టర్‌ కోసం రూ.2,70 లక్షలు, వ్యవసాయ మోటారుకు 3 ఇంచుల పైపుల కోసం రూ.40 వేలు రుణం పొందాను. ట్రాక్టర్‌కు అసలుకు వడ్డీతో కలిపి రూ.3.40 లక్షలు, పైపులకు అసలు వడ్డీతో కలిపి రూ.60 వేలు మొత్తం బ్యాంకు రుణం రూ.5 లక్షలైంది. సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ అప్పట్లో  మొత్తం మాఫీ అయ్యింది. అప్పట్లో మండలంలోనే అన్ని లక్షలు రుణమాఫీ అయిన ఏకైక రైతును నేనే. వైఎస్‌కు నేను సర్వదా రుణపడి ఉంటా.
– బంగారు శ్రీనివాసులురెడ్డి, పి.కొత్తపల్లి, పామిడి  


వాతావరణ బీమాతో ఊరట   
నాకు గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. 2008లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో పంటలు నష్టపోయాం. దిక్కుతోచనిస్థితిలో ఉన్న మాకు వాతావరణ బీమా కింద రూ.35 వేలు పరిహారం మంజూరైంది. దీంతో పంట సాగుకు చేసిన అప్పు తీర్చా. అయితే ఇప్పుడు చంద్రబాబు పాలనలో  ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశనగ పంట నష్టపోతున్నా ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతావరణ బీమా మంజూరు కావడం లేదు.  
– వెంకటేశులు, రైతు ఒంటారెడ్డిపల్లి, కంబదూరు మండలం 

వైఎస్‌ ప్రభుత్వం మాఫీ చేసిన సొమ్ము      రూ.555 కోట్లు 
రుణాలు కట్టిన రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు   రూ.77 కోట్లు 
ఖరీఫ్‌ పంట నష్టానికి ఇచ్చిన బీమా పరిహారం   రూ.620 కోట్లు
పావలావడ్డీ కింద అందించిన ప్రయోజనం    రూ.42 కోట్లు 
రైతులకు ఒకే విడతగా లబ్ధి చేకూర్చిన మొత్తం    రూ.1,400 కోట్లు  

   

చంద్రబాబు హామీ మేరకు వ్యవసాయ రుణాలు  రూ.6,817 కోట్లు 
చివరకు మాఫీకి అంగీకరించిన మొత్తం  రూ.2,744 కోట్లు 
మూడు విడతలుగా విడుదల చేసిన మొత్తం  రూ.1,900 కోట్లు 
ఐదేళ్లవుతున్నా ఇంకా పెండింగ్‌లో పెట్టిన మొత్తం   రూ.1,165 కోట్లు 
అరకొరగా మాఫీ అయిన రైతుల సంఖ్య   1.10 లక్షల మంది 
అర్హత ఉన్నా మాఫీకి నోచుకోని వారి సంఖ్య    35 వేల మంది  

       
   





      
       

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement