పాదయాత్రగాజిల్లాలో ప్రవేశించిన జగన్‌కు కొబ్బరిబొండం ఇస్తున్న ముస్లిం మహిళలు (ఫైల్)
టీడీపీ, బీజేపీ బంధం ముస్లింలను ఏనాడూ స్థిరంగా ఉండనివ్వలేదు. ఒకసారి వాజ్‌పేయి, మరోసారి మోదీ పుణ్యామా అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ముస్లింను ఎదగనివ్వకుండా చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏ ఒక్క సీటును ముస్లింలకు కేటాయించకపోవడం చంద్రబాబులోని ముస్లిం వ్యతిరేక భావజాలానికి అద్దం పడుతోంది. దీనికి తోడు తన మంత్రివర్గంలో ముస్లింలకు అవకాశమివ్వని చంద్రబాబు వైఖరితో ఆ సామాజిక వర్గాన్ని అవమానానికి గురైంది. వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన అత్తార్ చాంద్‌బాషాను సంతలో పశువులా కొనుగోలు చేసి టీడీపీలోకి చేర్చుకున్న అంశం ముస్లింల మనోభావాలను మరింత దెబ్బతీసింది. ఇలాంటి దశలో వైఎస్సార్ పాలనను ప్రతి ఒక్క ముస్లిం గుర్తుకు చేసుకుంటున్నాడు.
సాక్షి, అనంతపురం: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలోనే కొనసాగుతున్న వారిలో కదిరి మహమ్మద్ ఇస్మాయిల్ ఒకరు. ఆయనకు కదిరి సీటు కేటాయించాలని ఢిల్లీ స్థాయిలో జమాతే హింద్ పెద్దలు స్వయంగా చంద్రబాబును కలిసి విన్నవించుకున్నారు. వారి విన్నపాన్ని చంద్రబాబు తోసిపుచ్చాడు. దీంతో దాదాపు జిల్లాలోని అన్ని మసీదుల ముతవల్లిలు, పేష్ ఇమామ్‌లు ఇటీవల ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై ముస్లింల పట్ల టీడీపీ సర్కార్ అవలంభిస్తున్న నిర్లక్ష్యం వైఖరిపై చర్చించారు. చంద్రబాబుకు తమ తడాఖా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు.
వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం
జిల్లా వ్యాప్తంగా దాదాపు 210 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. వీటిలో ఒక్క కదిరి ప్రాంతంలోనే 110 ఎకరాలు అన్యాక్రాంతం కాగా, అనంతపురంలోని గుత్తి రోడ్డులో సుమారు 90 సెంట్ల రూ. కోట్లలో విలువైన భూమిని టీడీపీకి చెందిన ప్రముఖులు కబ్జా చేశారు. ఈ విషయంలో టీడీపీలోని ముస్లింలు వర్గాలుగా విడిపోయి న్యాయం చేయాలంటూ ఓ వర్గం వారు అప్పటి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని కలిసారు. దీంతో కబ్జాదారులు మంత్రి సునీత పంచన చేరారు. రాజకీయ ప్రాబల్యం కోసం ముస్లింలలో ఐక్యతను అప్పటి నుంచి టీడీపీ పెద్దలు దెబ్బతీస్తూ వచ్చారు. ఇదే అలుసుగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మసీదుల్లో, దర్గాల్లో అధికార పెత్తనానికి వారు తెరలేపారు. వారి మాటే చెల్లుబాటు అయ్యేలా పావులు కదుపుతూ వచ్చారు. ఎలాంటి పాండిత్యం లేకపోయినా తమ పార్టీకి చెందిన వారిని ఖాజీగా నియామకం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం చివరకు న్యాయస్థానం మెట్టు ఎక్కేలా చేసింది. జిల్లా ముస్లింల చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఖాజీలను టీడీపీ సర్కార్ నియమించింది. ఆఖరుకు ఈద్గా మైదానంలో నమాజు చేయించే విషయంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ వచ్చారు.
పొంతన లేని టీడీపీ సర్కార్ పథకాలు
- ముస్లిం మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఏవీ సక్రమంగా అమలుకు నోచుకోలేదు. కేవలం ప్రచారానికే తప్ప మరేందుకు అవి ఉపయోగపడలేదు. ముస్లింలను ఇంతలా మభ్య పెట్టిన చంద్రబాబు సర్కార్ పథకాలు పరిశీలిస్తే..
- పేద ముస్లిం యువతి వివాహానికి దుల్హన్ పథకం కింద రూ. 50 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం టీడీపీ కార్యకర్తలకు తప్ప సామాన్యులకు అందలేదు.
- మైనారిటీ సబ్‌ప్లాన్ అమలుతో ముస్లింల అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవంగా సబ్‌ప్లాన్ అమలు ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయాన్ని టీడీపీకి చెందిన ముస్లిం నాయకులే అంగీకరిస్తున్నారు.
- ముస్లింకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీవనోపాధుల పెంపునకు విరివిగా రుణాలు అందజేస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముస్లింలను పూర్తి నిరాదరణకు గురి చేశారు. ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా అందివ్వకపోవడంతో చాలా మంది ముస్లిం విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేసుకోవాల్సి వచ్చింది.
రాబోవు రోజులు మంచివి
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాల వల్ల ముస్లింలలో చాలా మంది ఉన్నత విద్యావంతులయ్యారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆయన బాటలోనే నడుస్తున్న వైఎస్ జగన్ ప్రకటించిన పథకాలు చాలా బాగున్నాయి. జగన్ సీఎం అయితే ముస్లింలకు మంచి రోజులు వస్తాయి.
– రఫీ, చిరు వ్యాపారి అనంతపురం
ఉపాధి దొరుకుతుంది
కుటుంబపోషణకు ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని అనుకుంటున్నా. అయితే పెట్టుబడులకు అప్పులు చేయాల్సి వస్తోంది. మా పరిస్థితి చూసి బ్యాంక్ వాళ్లేవరూ అప్పు ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ముస్లిం సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే నిజమైతే మాలాంటి వారికి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణాలు సులువుగా అందుతాయి.
– మల్లికా జహా, పాతూరు, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment