చైతన్య గీతిక..అనంతపురం | Anantapuram Constituency Review | Sakshi
Sakshi News home page

చైతన్య గీతిక..అనంతపురం

Published Wed, Mar 20 2019 10:11 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Anantapuram Constituency Review - Sakshi

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు నిలయం. విద్యార్థి ఉద్యమాలకు పెట్టింది పేరు. ఎందరో ఉద్దండులను రాష్ట్రానికి అందించిన నేల. దాతృత్వంలోనైనా.. అన్యాయాన్ని ఎదిరించడంలోనైనా ఇక్కడి ప్రజలు ముందుంటారు. అందుకే ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం అనంతం. ఇప్పటిదాకా రెండు ఉప ఎన్నికలతో పాటు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్‌ అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచింది. 

సాక్షి, అనంతపురం : అనంతపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. గతంలో అనంతపురం పట్టణంతోపాటు రూరల్‌ మండలం,  బుక్కరాయసముద్రం, రాప్తాడు మండలాల్లో కొంత భాగం ఉండేది. 2009లో నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తరువాత అనంతపురం పట్టణంతో పాటు రూరల్‌ మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ పరిధిలో సగభాగం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, రూరల్‌ పంచాయతీలు మాత్రమే ఈ నియోజక వర్గంలోకి వచ్చాయి. బుక్కరాయసముద్రం శింగనమల నియోజవర్గంలోకి వెళ్లగా, రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడింది.

ఈ నియోజకవర్గంలోకి అనంతపురం రూరల్‌ మండలంలో 80 శాతం విలీనం చేశారు.అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 4.50 లక్షల జనాభా ఉంది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,22,652 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,10,503 మంది, మహిళలు 1,12,109 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్‌ 40 ఓట్లు ఉన్నాయి. అనంతపురం నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. అనంతపురం రూరల్‌ మండలంలోని ఎ.నారాయణపురం, రాజీవ్‌కాలనీ, రుద్రంపేట, అనంతపురం రూరల్‌ పంచాయతీలు వస్తాయి. ఈ పంచాయతీల్లో 33వేలు ఓట్లు ఉన్నాయి. తక్కిన 1,89,319 ఓట్లు నగర పరిధిలో ఉన్నాయి. మొత్తం 256 బూత్‌లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా హోదా పెరిగిన తరువాత రెండుసార్లు మేయర్‌ ఎన్నికలు జరిగాయి. అనంతపురం నగర మొదటి మేయర్‌గా కాంగ్రెస్‌ పార్టీ తరపున రాగే పరశురాం 2009 నుంచి 2014 దాకా పనిచేశారు. రెండో మేయర్‌గా టీడీపీకి చెందిన స్వరూప ప్రస్తుతం కొనసాగుతున్నారు.  



జిల్లాలో ఉన్న మిగతా 13 నియోజకవర్గాలతో పోల్చితే అనంతపురం నియోజక వర్గంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన దాదాపు అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఏటా ఇక్కడికి  వలసలు వచ్చి ఓటర్లుగా నమోదవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, శ్రామికుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఓట్లు పరిశీలిస్తే బలిజలు, ముస్లింలు, ఆర్యవైశ్యులు ప్రాధాన్యతగా ఉంటాయి.   

వైఎస్సార్‌ కృషితో తాగునీటి సమస్య పరిష్కారం  

2004కు ముందు అనంతపురం పట్టణంలో విపరీతమైన తాగునీటి ఎద్దడి ఉండేది. మామూలు రోజుల్లోనే నాలుగైదు రోజులకోసారి తాగునీళ్లు వచ్చేవి. ఇక వేసవి కాలం వస్తే 10–15 రోజులకోసారి కూడా వదిలే పరిస్థితి ఉండేది కాదు. రోజూ నీటి ట్యాంకుల వద్ద మహిళల యుద్ధాలు జరిగేవి. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 67 కోట్లతో పీఏబీఆర్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. కేంద్రాన్ని ఒప్పించి 80 శాతం నిధులు తెప్పించారు. తక్కిన 20 శాతంలో పది శాతం రాష్ట్ర ప్రభుత్వం, తక్కిన  10 శాతం మునిసిపాలిటీ భరించాల్సి ఉన్నా...ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా వైఎస్సార్‌ చర్యలు తీసుకున్నారు

జీఓ విడుదల అయి, పనులు ప్రారంభించి 2010 నాటికి నగరానికి నీళ్లు వచ్చాయి. వచ్చే 30 ఏళ్ల వరకు అంచనాతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినా 40 ఏళ్లు దాకా ఎలాంటి ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు. పీఏబీఆర్‌ నీటి పథకం రావడంతో నగరంలోని ఏ కాలనీలోనూ నీటి సమస్యే లేదు. రోజూ ప్రజలకు అవసరం కంటేకూడా ఎక్కువగానే నీటి నిలువ ఉంటోంది. అయితే ప్రస్తుత పాలక వర్గం తప్పిదాలతో చాలా కాలనీలకు నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు.  


పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో రహదారుల నిర్మాణం, అనంతపురం–తాడిపత్రి రహదారికి రూ.55 కోట్లు వెచ్చించి బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్షం వస్తే మురుగునీరు రోడ్లు, నివాసాల్లోకి రాకుండా ఉండేందుకు మరువవంక, నడిమివంకల ఆధునికీకరణకు రూ.56 కోట్లు మంజూరు చేసిన కరకట్టలు నిర్మించారు. నడిమివంక దాదాపు పూర్తయినా మరువవంక పెండింగ్‌ ఉంది. మిగులుగా ఉన్న రూ. 17 కోట్ల నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మరో నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి తరలించారు. ఫలితంగా మరువవంక ఆనుకుని ఉన్న కాలనీలను చిన్నపాటి వర్షానికి జలమయం అవుతూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  వైఎస్‌ హయాంలోనే నగరంలోని పేదలకు ఇందిరమ్మ పథకం కింద 2,200 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వేలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేశారు.  

‘అనంత’ను అక్కున చేర్చుకున్న ప్రజలు 
కాంగ్రెస్‌ పార్టీ తరుఫున నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకటరామిరెడ్డి ఈసారి అనంతపురం అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలుస్తున్నారు. వివాదారహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న ‘అనంత’ నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన తర్వాత నగరంలోని 50 డివిజన్లతో పాటు ఎ.నారాయణపురం, రాజీవ్‌కాలనీ, రుద్రంపేట, అనంతపురం రూరల్‌ పంచాయతీల్లో ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నిర్ణయాత్మకమైన ఓటర్లుగా ఉన్న ముస్లింలు పూర్తిగా వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ, ఈసారి మరోసీటు పెంచి ఐదుసీట్లు ఇచ్చింది. తమకు ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని ఆ వర్గం నిర్ణయించింది.  

చౌదరికి ఇంటిపోరు 
ప్రస్తుత ఎమ్మెల్యే వై.ప్రభాకర్‌చౌదరికి సొంత పార్టీలో అసమ్మతి పోరు ఎక్కువగా ఉంది. కేఎం జకీవుల్లా, జయరాంనాయుడు వర్గాలు ప్రభాకర్‌చౌదరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో చౌదరికి టికెట్‌ ఇస్తే తాము పార్టీని వీడతామంటూ ఆల్టిమేటం జారీ చేశారు. పదిమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. బలిజలు కూడా తమకు కేటాయించకపోతే తగిన గుణపాఠం చెబుతామంటూ టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్‌చౌదరి, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. మరోవైపు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చౌదరి, మేయర్‌ స్వరూప మధ్య కూడా విభేదాలున్నాయి. వీరి ముగ్గురూ మూడుముక్కలాట ఆడుతూ పార్టీని భ్రష్టు పట్టించారంటూ కార్యకర్తలు పలు సందర్భాల్లా వ్యాఖ్యానించారు. కార్పొరేషన్‌ పనుల్లో పర్సెంటీజీల వ్యవహారంలో ఎమ్మెల్యే, మేయర్‌ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్‌ కనుమరుగైన తర్వాత అనంతపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి మంచి ఆదరణ ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement