runamaphi scheme
-
సాగు భళా..రుణం డీలా?
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి ఈ సారి పంటలు సాగయ్యాయి. ప్రధానంగా పత్తి, సోయాబీన్ పంటలను రైతులు అధికంగా సాగు చేశారు. కొద్దిగా కందులు, మినుములు, శనగ వేశారు. అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణాన్ని మించి సాగైన ఆనందం రైతుల్లో ఉన్నా బ్యాంకు రుణాల విషయంలో మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో గతేడాది పంట రుణ లక్ష్యంలో 76.82 శాతం సాధించారు. అయితే జిల్లాలో ప్రధానంగా ఖరీఫ్ పంటలే రైతులకు జీవనాధారం. రబీలో అతితక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పం టలకే రైతులకు రుణాలిస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ప్రసు ్తతం ఖరీఫ్ దాటిపోయినా రుణ లక్ష్యం లో దారుణంగా బ్యాంకర్లు వెనుకబడిపోయారు. అయితే తాము రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రైతులే రుణాలను రీషెడ్యూల్ చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. బ్యాంక్‌కు వెళితే పాత బకాయిలు కడితేనే కొత్త రుణం ఇచ్చేదని బ్యాంక ర్లు తమ నిబంధనలు వల్లే వేస్తున్నారు. మరో పక్క ఎన్నికలకు ముందు రూ.లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మెనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో పలువురు రైతుల్లో ఆ రుణం కడితే మాఫీ వర్తిస్తుందో.. లేదోనన్న అయోమయంలో అసలు దాని జోలికే పోవడంలేదు. ఈ పరిస్థితిలో ఈసారి రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు విఫలమయ్యాయి. పాత బకాయిలు కట్టినా రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడంలేదు. దీంతో జిల్లాలో రుణ లక్ష్యం కొండంత కనిపిస్తుండగా గోరంత పంపిణీ చేసినట్టు లెక్కలు కనబడుతున్నాయి. కాగా ఒక రైతు బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు దాన్ని నిర్ణీత వ్యవధిలో కట్టినప్పుడు రుణం రీషెడ్యూల్ చేస్తారు. నిర్ణీత వ్యవధిలో కట్టిన రైతులకు దానిపై 7శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది. ఒకవేళ వ్యవధి దాటితే వడ్డీ శాతం పెరుగుతుంది. అన్నదాతలు ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందనే నమ్మకంతో పాత బకాయిలను చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతోనే బ్యాంక ర్లు రుణాలు రీషెడ్యూల్ చేయలేకపోయామని పేర్కొంటున్నారు. ఏదేమైనా జిల్లాలో ఈఏడాది పంట రుణ లక్ష్యంలో పూర్తిగా వెనుకబడిపోయింది. సాధారణంగా రైతులు సాగు సమయంలో పంట రు ణం కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు పాత బకాయిలను పట్టుకొని కొత్త రుణం ఇవ్వడం చేస్తారు. ఈ పద్ధతిని బుక్అడ్జెస్ట్మెంట్గా పరిగణిస్తారు. ఉదాహరణకు.. రైతు లక్ష రూపాయల రుణ బకాయి ఉంటే కొత్తగా కొంతమొత్తం పెంచి లక్షన్నర రుణం ఇస్తున్నట్లు బుక్‌లో పేర్కొన్నా లక్షన్నరలో రూ.50వేలు రైతు చేతిలో పెట్టి పాత బకాయి కింద లక్ష చేతిలో పెడతారు. దీన్నే బుక్ అడ్జెస్ట్‌మెంట్‌గా పరి గణిస్తారు. ఇది ఆనవాయితీగా బ్యాంకర్లు, రైతుల మధ్య కొనసాగుతున్న ఒక అనధికారిక ఒప్పందంగా చెప్పవచ్చు. ప్రైవేట్ అప్పుల వైపు.. రుణాలు రీషెడ్యూల్ కాకపోవడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేట్ అప్పులు చేస్తున్నారు. జిల్లాలో పంట కాలానికి రైతులకు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారులు అధికంగా ఉన్నారు. పంట కాలాన్ని పరిగణలోకి తీసుకొని 20 నుంచి 25శాతం వడ్డీతో వ్యాపారులు రైతులకు అప్పులు ఇస్తున్నారు. రుణం రీషెడ్యూల్ చేసుకోలేని రైతులు ప్రైవేటు అప్పులతో కుదేలవుతున్నారు. జిల్లాలో లక్షకుపైగా రైతుల అకౌంట్లు ఉంటే, 40శాతం అకౌంట్లకు కూడా రుణాలు లభించలేదు. జిల్లాలో పంటల సాగు సాధారణ సాగు : 1,93,072 హెక్టార్లు సాగైన విస్తీర్ణం : 1,94,110 హెక్టార్లు (101శాతం) 2019–20 (ఖరీఫ్+రబీ)రూ.1576.53 కోట్లు రుణ లక్ష్యం.. ఖరీఫ్‌లో ఇచ్చింది : రూ.348.94 కోట్లు (22శాతం) రుణం పొందిన రైతులు : 34,833 కోట్లు 2018–19లో రూ.1473.93 కోట్లు గతేడాది రుణ లక్ష్యం (ఖరీఫ్+రబీలో) ఇచ్చింది : రూ.1128.43 కోట్లు రుణం పొందిన రైతులు : 1,11,343 -
రుణమాఫీ అనగానే వద్దు ‘బాబూ’ అంటూ బెంబేలు
సాక్షి, అనంతపురం: రుణమాఫీ అనగానే రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. రుణమాఫీ హామీ ప్రకటించే నాటికి రుణాలు కట్టని రైతులతో పాటు కట్టిన రైతులకూ తనదైన శైలిలో న్యాయం చేసి శభాష్ అనిపించుకున్నారు. కరువు కాటకం సంభవించిన 2008లో 6.63 లక్షల మంది రైతులకు నెల రోజుల వ్యవధిలోనే ఒకే విడత కింద రూ.733 కోట్లు లబ్ధి చేకూర్చారు. అప్పట్లో రూ.733 కోట్లు అంటే ఆషామాషీ కాదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. రైతులకు భరోసా.. కరువు పరిస్థితులు ఏర్పడిన కష్ట కాలంలో భయపడవద్దు... నేనున్నా... అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘అనంత’ రైతుల్లో భరోసా ఇచ్చాడు. 2008లో కరువు కరాళనృత్యం చేస్తున్న పరిస్థితుల్లో వైఎస్సార్ కేంద్ర ప్రభుత్వ సాయంతో రుణమాఫీకి చర్యలు చేపట్టాడు. జిల్లాలో 3.04 లక్షల మంది రైతులకు రూ.555 కోట్లు ఒకేసారి మాఫీ చేశారు. నెల రోజుల్లోనే రైతులను రుణ విముక్తులను చేశారు. అప్పట్లో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏ జిల్లాలోనూ జరగలేదు. వైఎస్సార్ ఆదుకునే చర్యలు చేపట్టడంతో లక్షల రైతు కుటుంబాల ఇంట ఆనందం తాండవించింది. ఫలితంగా ఇప్పటికీ ఎప్పటికీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇది బాబు మార్క్ మాఫీ సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ అంటేనే రైతులు జడుసుకుంటున్నారు. రుణమాఫీ అనగానే వద్దు ‘బాబూ’ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి 2014 ఎన్నికల్లో రైతుల నుంచి ఓట్లు దండుకున్న చంద్రబాబు సీఎం పీఠం ఎక్కగానే స్వరం మార్చేశారు. కొర్రీలు, కమిటీలు, షరతులు విధించి మాఫీ సొమ్మును బాగా తగ్గించేశారు. 2013 డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా పంట, బంగారు, వ్యవసాయ అనుబంధరంగాల రుణాలు 10.24 లక్షల అకౌంట్ల పరిధిలో రూ.6,817 కోట్లు రుణాలు ఉంటే చివరకు రూ.2,744 కోట్లు మాఫీకి ఒప్పుకున్నారు. ఐదేళ్లవుతున్నా ఇంకా 1,165 కోట్లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. విడతలు వారీ, రుణమాఫీ పత్రాలు, రుణమాఫీ వేదికలు, గ్రీవెన్స్‌లు, చెక్కులు అంటూ ఐదేళ్ల నుంచి రైతులకు కంటినిండా నిద్ర లేకుండా చేశారు. ఐదేళ్లవుతున్నా చంద్రబాబు మాఫీ మాయ నుంచి రైతులు ఇప్పటికీ తేరుకోలేదు. అసలు ఎంత, వడ్డీ ఎంత, ఎంత మాఫీ అయింది, ఎంత సొమ్ము జమ అయిందనేది రైతులకు అర్థం కాకుండా పోయింది. రుణమాఫీ కోసం మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రం, హైదరాబాద్, విజయవాడ, గన్నవరం, బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. మాఫీ అయిన సొమ్ము కన్నా రోజుల తరబడి అటుఇటు తిరగడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన వారు వేలల్లో ఉన్నారు. ఇపుడు ఎన్నికలు సమీపించడంతో రైతులు గుర్తుకు రావడం ఎన్నికల కోడ్ ప్రకటించిన సమయంలోనే 4, 5వ విడత రుణమాఫీ సొమ్ము ఇస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ఎత్తుగడ కింద ప్రకటించడంతో రైతులు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. రుణాలు కట్టిన రైతులకు ప్రోత్సాహకం వైఎస్సార్ 2008లో రుణమాఫీ చేసే సమాయానికి అప్పటికే చాలా మంది రైతులు తమ రుణాలు చెల్లించారు. వారిని గౌరవిస్తున్నట్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సగర్వంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా రుణాలు చెల్లించిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం కింద అందజేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 3.59 లక్షల మంది రైతులకు రూ.178 కోట్లు పంపిణీ చేశారు. 2008లో ఇచ్చిన ప్రోత్సాహకాలు, రుణమాఫీతో 6.63 లక్షల మందికి ఒకే విడత కింద రూ.733 కోట్లు లబ్ధిచేకూర్చడంతో రైతు ఇంట సంబరాలు చేసుకున్నారు. అదే ఏడాది వేరుశనగ, ఇతర పంటల నష్టానికి గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం ద్వారా 5.20 లక్షల మందికి రూ.620 కోట్లు పరిహారం అందించారు. పావలా వడ్డీ కింద మరో రూ.42 కోట్లు అందించారు. ఇలా 2008లో ఒకే సంవత్సరం జిల్లా రైతులకు ఏకంగా రూ.1,400 కోట్ల వరకు లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. వైఎస్సార్ చలువతో రూ.5 లక్షల రుణమాఫీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే నా బ్యాంకు రుణం రూ.5 లక్షలు మాఫీ అయ్యింది. 2008లో పామిడి ఆంధ్రాబ్యాంకులో స్వరాజ్ ట్రాక్టర్ కోసం రూ.2,70 లక్షలు, వ్యవసాయ మోటారుకు 3 ఇంచుల పైపుల కోసం రూ.40 వేలు రుణం పొందాను. ట్రాక్టర్‌కు అసలుకు వడ్డీతో కలిపి రూ.3.40 లక్షలు, పైపులకు అసలు వడ్డీతో కలిపి రూ.60 వేలు మొత్తం బ్యాంకు రుణం రూ.5 లక్షలైంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ అప్పట్లో మొత్తం మాఫీ అయ్యింది. అప్పట్లో మండలంలోనే అన్ని లక్షలు రుణమాఫీ అయిన ఏకైక రైతును నేనే. వైఎస్‌కు నేను సర్వదా రుణపడి ఉంటా. – బంగారు శ్రీనివాసులురెడ్డి, పి.కొత్తపల్లి, పామిడి వాతావరణ బీమాతో ఊరట నాకు గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. 2008లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో పంటలు నష్టపోయాం. దిక్కుతోచనిస్థితిలో ఉన్న మాకు వాతావరణ బీమా కింద రూ.35 వేలు పరిహారం మంజూరైంది. దీంతో పంట సాగుకు చేసిన అప్పు తీర్చా. అయితే ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశనగ పంట నష్టపోతున్నా ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా మంజూరు కావడం లేదు. – వెంకటేశులు, రైతు ఒంటారెడ్డిపల్లి, కంబదూరు మండలం వైఎస్ ప్రభుత్వం మాఫీ చేసిన సొమ్ము రూ.555 కోట్లు రుణాలు కట్టిన రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు రూ.77 కోట్లు ఖరీఫ్ పంట నష్టానికి ఇచ్చిన బీమా పరిహారం రూ.620 కోట్లు పావలావడ్డీ కింద అందించిన ప్రయోజనం రూ.42 కోట్లు రైతులకు ఒకే విడతగా లబ్ధి చేకూర్చిన మొత్తం రూ.1,400 కోట్లు చంద్రబాబు హామీ మేరకు వ్యవసాయ రుణాలు రూ.6,817 కోట్లు చివరకు మాఫీకి అంగీకరించిన మొత్తం రూ.2,744 కోట్లు మూడు విడతలుగా విడుదల చేసిన మొత్తం రూ.1,900 కోట్లు ఐదేళ్లవుతున్నా ఇంకా పెండింగ్‌లో పెట్టిన మొత్తం రూ.1,165 కోట్లు అరకొరగా మాఫీ అయిన రైతుల సంఖ్య 1.10 లక్షల మంది అర్హత ఉన్నా మాఫీకి నోచుకోని వారి సంఖ్య 35 వేల మంది -
జగనన్న వస్తే..ప్రతి రైతుకూ రూ.50 వేలు
సాక్షి, కోవెలకుంట్ల: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.50 వేలు పెట్టుబడి నిధి కింద అందజేయనున్నారు. ఒక్కో ఏడాదికి రూ.12,500 చొప్పున రెండవ సంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు ప్రతి ఏటా మే నెలలో రైతు కుటుంబాలకు పెట్టుబడి నిధి అందనుంది. వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు చేయూతగా మారటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లోని ఆరు మండలాల పరిధిలో 50 వేల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా లబ్ధి చేకూరనుంది. పంట సాగుకు చాలా ఉపయోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతు కుటుంబానికీ రూ. 50వేలు పెట్టుబడి నిధి కింద అందుతుంది. ఏటా రూ. 12,500 ఇవ్వడం వల్ల ఈ నిధులతో పంట సాగుకు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. –ఉసేనయ్య, రైతు, బిజనవేముల రుణ సమస్య తప్పుతుంది వ్యవసాయంలో పెట్టుబడే ప్రధాన సమస్య. నవరత్నాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా కింద మే నెలలోనే రూ. 12,500 ఇవ్వడం రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ముందే పెట్టుబడి సమకూరడం వల్ల రుణ సమస్య తప్పుతుంది. –ప్రతాప్‌రెడ్డి, రైతు, కోవెలకుంట్ల పెట్టుబడి సమస్య తీరుతుంది ఖరీఫ్‌కు ముందే పెట్టుబడి నిధి కింద రూ.12,500 ప్రతి రైతు కుటుంబానికీ అందటం వల్ల ఆ ఏడాది పెట్టుబడి సమస్య తీరుతుంది. రైతులకు పంటల సాగుకు పెట్టుబడికి చేతులో డబ్బులు ఉండటంతో ప్రణాళికా బద్ధంగా వ్యవసాయానికి వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుంది. –వెంకటరాముడు, రైతు, గుళ్లదూర్తి -
రుణమాఫీ పేరుతో నయవంచన
సాక్షి, అమరావతి బ్యూరో: రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతుల్ని నిండా ముంచింది. గత ఎన్నికల సమయాన మాఫీ చేస్తామని బాబు చెప్పిన మాటలు విని ఢిపాల్టర్లుగా మారిపోయారు. జిల్లాలో రూ. 8వేల కోట్లకు పైగా రైతు రుణాలు ఉండగా, ఇందులో రూ. 2884.64 కోట్ల మేర మాత్రమే మాఫీ అయ్యాయి. మూడు విడతల్లో రూ.1632.36 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 4, 5 విడతల్లో రూ. 1152 కోట్ల మేర రుణాలు బకాయి ఉంది. హడావుడిగా జమ నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి గత ఏడాది జూన్‌లోనే రైతు ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేయాలి. దానిగురించి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక హడావుడిగా జీవో జారీ చేసింది. ఏప్రిల్‌లో ఖాతాల్లో జమ చేస్తామని రైతుల్ని మరోసారి మభ్యపెట్టే యత్నం చేసింది. రుణమాఫీ పేరుతో దగా చేసిన ప్రభుత్వం, రకరకాల నిబంధనలు పెట్టి, అరకొర మాఫీ చేసే యత్నం చేసింది. అన్నదాత సుఖీభవతో మరో ఎత్తుగడ ఐదేళ్ల కాలంలో రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసిన బాబు, వచ్చే బడ్జెట్లో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక నిధులు విడుదలంటూ రైతుల్ని మరో నయవంచన చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ కొత్త పథకం పెట్టి, రైతు ఖాతాల్లో రూ. 1000 వేసి, మరోసారి మోసం చేసే ఎత్తుగడను అవలంబించారు. రైతులకు రావా ల్సిన, ఇన్పుట్ సబ్సిడీ, మొక్కజొన్నకు సంబంధించి అదనపు రాయితీ పాత బకాయిలను సంబంధించి ఇంతవరకు నిధులు మంజూరు చేయక పోవడం గమనార్హం. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం మాయమాటలు చెప్పి, నట్టేట ముంచిందని రైతులు మండి పడతున్నారు. తమకు సాయం చేసేందుకు ఐదేళ్లు అవకాశం ఉన్నా పట్టించుకోకుండా నేడు అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేస్తోందని మండిపడుతున్నారు. మోసం చేసిన ప్రభుత్వం ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మాయ చేసింది. బాబు మాటలు నమ్మి బ్యాంకులో అప్పు కట్టలేదు. తీరా నిబంధలు పెట్టి అరకొరగా రుణమాఫీ చేసింది. వడ్డీలు పెరిగిపోయాయి. బ్యాంకు డిఫాల్టర్‌గా భావించి కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు. 4,5 విడతల రుణమాఫీ సంబంధించిన సొమ్ము ఇంత వరకు రాలేదు. – నూతక్కి రాంబాబు, మంగళగిరి మండలం ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ బకాయిలు చెల్లించకుండానే అన్నదాత సుఖీభవ అంటూ రైతులను మోసం చేసే యత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. భారీ నష్టాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ. 1000తో ఒరిగేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం. – చల్లా వెంకటేశ్వర్లు, తొండపిగ్రామం, ముప్పాళ మండలం పాత బకాయిల సంగతి ఏంటీ ? ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. గత ఏడాది రబీలో మొక్కజొన్న, జొన్న పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో, క్వింటాకు రూ200ల చొప్పున అదనపు సాయం ఇస్తామని ప్రభుత్వం చెప్పి రైతుల జాబితాలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రూ.53 కోట్లు ఇంతవరకు ఖాతాల్లో చేరలేదు. ని«ధులు విడుదల చేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అదనపు సాయం కోసం మొక్కజొన్న, జొన్న రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నేటికీ అందని పరిహారం ఈ ఏడాది వరి పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన పెథాయ్ తుపాన్ వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగడంతో పాటు, కళ్లాల్లో ధాన్యం తడిచి పంట మొలకెత్తడంతో పాటు, ధాన్యం రంగు మారిపోయింది. రైతులు భారీగా నష్టపోయారు. తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసి, రూ.67 కోట్లను పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించినా ఇంత వరకూ రైతులకు పైసా అందలేదు. జిల్లాలోని తొమ్మిది కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయి, దెబ్బతిన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లను రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ప్రభుత్వం పైసా విదల్చలేదు. -
రుణమాఫీ.. ఓ బోగస్
రాజంపేట: తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటిస్తున్న రుణమాఫీ పథకం బోగస్‌గా మారిందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జీఎంసీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రాల రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడే అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులురెడ్డి, జీఎంసీ క్లబ్ సెక్రటరీ రాజమోహన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పాపినేని విశ్వనాథరెడ్డి, వైఎస్సార్సీపీ సేవాదళ్ కన్వీనర్ శిల్పి రాజాచారి, పార్టీ మండల కన్వీనర్ నాగినేని నాగేశ్వరనాయుడు, నాయకులు నడివీధి సుధాకర్, ఆకేపాటి రమేష్‌రెడ్డి, గోవిందు బాలకృష్ణ, పసుపులేటి సుధాకర్, డీలర్ సుబ్బరామిరెడ్డి, రమేష్‌నాయుడు పాల్గొన్నారు. గ్రామీణులకు సేవలందిస్తున్న ఏపీజీబీ: సీమ జిల్లాలో గ్రామీణులకు సేవలందిస్తున్న ఏకైక బ్యాంక్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అని రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జీఎంసీ క్లబ్లో ఏపీజీబీ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో స్వయంసహాయకసంఘాలకు రూ.56 లక్షల రుణాలను ఎంపీ చేతుల మీదుగా అందచేసే కార్యక్రమాన్ని ఏపీజీబీ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో కార్పొరేట్ బ్యాంకులు ధనికులకే పరిమితమయ్యాయని, ఒక్క ఏపీజీబీ మాత్రం పల్లెవాసులకు అండగా నిలుస్తోందన్నారు. ఏపీజీబీ జీఎం కృష్ణమాచారి, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్పిళ్లై, రీజనల్ మేనేజరు శివశంకరరెడ్డి, రాజంపేట మెయిన్‌బ్రాంచి చీఫ్ మేనేజర్ చంద్రపాల్‌రెడ్డి, డీఆర్డీఏ డీపీఎం అశోక్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఆకేపాటి సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి, మాజీ ఏజీపీ గురుప్రతాప్‌రెడ్డి, , వైఎస్సార్సీపీ పట్టణ యూత్ అధ్యక్షుడు యల్లమరాజు సురేష్‌రాజు, వైఎస్సార్సీపీ నాయకులు కుందా నెల్లూరు మధు, జీవీ సుబ్బారెడ్డి, భాస్కర్‌రాజు, కొప్పల సుబ్బన్న, జాహిద్‌అలీ, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
నమ్మిన రైతుకు వెన్నుపోటు!
రైతుల్ని ఎన్ని విధాలా రుణభారం నుండి తప్పించవచ్చన్నది పక్కనబెట్టి, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుండి తప్పించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రుణమాఫీతో విముక్తి ప్రసాదించకపోగా, రైతు ప్రపంచంలో కొత్త కల్లోలాన్ని సృష్టించింది. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద ఏ కాస్త అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి. రైతు రుణమాఫీ చేసి తీరుతానని గత ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దా నం చేశారు. అది సాధ్యం కాదని తన రాజకీయ ప్రత్యర్ధి జగన్మో హన్‌రెడ్డి అన్నప్పుడు బాబు ఎద్దే వా చేశారు. అసాధ్యాన్ని సాధ్యం చేసే చరిత్ర తమకు ఉన్నదన్నారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలోను రై తు రుణమాఫీ హామీని ప్రముఖంగా ప్రచురించారు. ఐదు కోట్ల మంది జనాభా గల రాష్ర్టంలో ఉన్న దాదాపు 85 లక్షల మంది రైతులు తమ రుణవిముక్తి ప్రదాత చంద్ర బాబు రూపంలో వచ్చాడని నమ్మారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదమూడు జిల్లాల్లో టీడీపీకి పడిన ఓట్లలో అత్యధికం రైతు కుటుంబాల నుండి వచ్చినవే. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైయస్సార్ సీపీల మధ్య ఓట్ల తేడా వెంట్రుకవాసి మాత్రమే. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద వెంట్రుకవాసి అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగించడం వేరు. వ్యవ సాయ భూమిని కలిగి ఉండటం వేరు. వ్యవసాయాన్ని వృత్తిగా సాగించేవాళ్లలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీ లు ఉంటారు. వాళ్లిద్దరూ చంద్రబాబు రుణమాఫీ ఖాతా లో లేరు. బాబు ఖాతాలో ఉన్నది వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు మాత్రమే. తొలి అడుగులోనే వారు వ్యవసాయ జనాభాని సగానికి పైగా నరికేశారు. రైతు రుణాల్లో పంటరుణం, వ్యవసాయరుణం, కుటుంబ రుణం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయని వ్యవ సాయార్థిక అంశంపై పరిశోధనా వ్యాసం రాసిన చంద్ర బాబుకు మరింత లోతుగా తెలుసు. ఎన్నికల ప్రచారం లోనూ, ఎన్నికల ప్రణాళికలోనూ బాబు రైతు రుణం మాఫీ చేస్తానని చెప్పారే గానీ పంటరుణం మాత్రమే మా ఫీ చేస్తానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. పంట రుణం సాధారణంగా ఎకరాకు 20 - 25 వేల రూపాయల మేర మాత్రమే ఉంటుంది. రెండెకరాల రైతుగా జీవితాన్ని మొదలు పెట్టిన చంద్రబాబుకు పంటరుణం వేల రూపాయల్లోనూ, రైతు రుణం లక్షల రూపాయల్లోనూ ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసు. ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ వ్యవసాయ రుణాలన్న చంద్రబాబు, వారి ప్రచారకర్తలు వాటిని ఇప్పు డు తుంగలో తొక్కారు. ఇప్పుడు పంటరుణాన్ని సహితం పక్కన పెట్టడానికి వాళ్లంతా పడరానిపాట్లు పడుతు న్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే కొత్త ఆయుధాన్ని కనిపె ట్టింది వీళ్లే. రైతులు పంటరుణం ఎంత తీసుకున్నారు? అనేదాన్ని పక్కనపెట్టి, పంటరుణం ఎంత తీసుకోవడా నికి అర్హులు? అనేదాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికగా తీసుకుంటుంది. అంటే రైతులకున్న పంటరుణంలో కూ డా వీరు భారీ కోత పెట్టారన్నమాట. అనేక వ్యవసాయ పరపతి సొసైటీలతో పాటూ కొన్ని బ్యాంకు ల్లో కూడా టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టుకోకుండానే పంటరుణం ఇవ్వడం అనేది చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తోంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డాక్యుమెంట్లు తాకట్టు పెట్టని పంట రుణాల్ని అండర్ ప్రాసెస్‌గా ఆన్లైన్లో పెడుతున్నా రు. అలాంటి రుణాలు ఎప్పటికీ మాఫీ కావని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిహెచ్ కుటుంబరావు తేల్చేశారు. ఆస్తులు, పొలాలు పంచుకున్న తరువాత కూడా అన్నద మ్ములు ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండ టం గ్రామీణ ప్రాంతంలో సాధారణ విషయం. అనేక సందర్భాల్లో అన్నదమ్ముల పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉం టాయి. అలాంటి అన్నదమ్ములు చెరో కొంత భూమి మీద చెరో కొంత పంటరుణాన్ని తీసుకుని ఉంటే, ఇద్దరి లో ఒక్కరికి మాత్రమే పంటరుణం మాఫీ అవుతుంది. ఒక రేషన్ కార్డుపై ఒకరికే రుణ మాఫీ అనేది కొత్త నిబంధన. అంటే, చంద్రబాబు పంటరుణం పథకం గ్రామీణ ఉమ్మడి కుటుంబాల్లో కొత్త చిచ్చు రగుల్చుతోంది. రుణమాఫీకి సంబంధిత పత్రాలు పోయిన సంద ర్భాల్లో వాటి ట్రూ- కాపీల కోసం బ్యాంకుల, పాలక మండళ్లు, రెవెన్యూ అధికారులను కలవాల్సి ఉంటుంది. వ్యవసాయదారుల్లో అత్యధికులు నిరక్షరాస్యులు. వయో వృద్ధులు. ఇన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి రుణ మాఫీ పత్రాలని సక్రమంగా సేకరించి, సమర్పించడం అనేది వాళ్లవల్ల అయ్యే పనికాదు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవ సాయ భూములు ఉండి, ఇతర రాష్ట్రాల్లో ఆధార్ కార్డులు ఉన్న రైతులు రుణమాఫీ పొందడానికి అనర్హులని ప్రణాళి కా సంఘం ప్రకటించింది. ఆరు నెలల క్రితం విడిపోయిన తెలంగాణ రాష్ర్టంలోనే కాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆంధ్రా రైతులు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు డు హైదరాబాద్‌లోని ఆంధ్రా రైతు లకు రుణమాఫీ అం శాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. వారి ప్రకటన వచ్చిన గంటలోపే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ కుటుంబరావు ప్రతిస్పందిస్తూ అది అసాధ్యమని తేల్చేశా రు. ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటూ, అక్కడే ఆధార్ కార్డు ఓటరు ఐడి కలిగి ఉన్న చంద్రబాబు గారికి పొరుగు రాష్ర్టంలో ఎమ్మెల్యేగా పోటీచేసి, ముఖ్యమంత్రి కావడానికి కూడా సహకరించిన నిబంధనలు, రైతుల దగ్గ రికి రాగానే అడ్డుకట్టగా ఎలా మారిపోతున్నా యో మరి. రైతుల్ని ఎన్ని విధా లా రుణభారం నుండి తప్పించవచ్చు అని కాక, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుం డి తప్పించవచ్చు అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తు న్నది. ఇది విషాదం! (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు సామాజిక విశ్లేషకులు, మొబైల్ నంబర్ : 90107 57776) -
ఆగని నోటీసులు
రైతుల ఆందోళన బ్యాంకు అధికారులతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ నేతలు మునగపాక: ఒకవైపు తీసుకున్న రుణాలు చెల్లించనక్కరలేదని రుణమాఫీ పథకం అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతుంటే మరోపక్క రుణ బకాయిలు చెల్లించకుంటే బంగారు ఆభరణాలు వేలం వేస్తామంటూ బ్యాంక్‌లు నోటీసులు జారీ చేస్తున్నాయి. మునగపాకకు చెందిన ఆడారి గోపి వ్యవసాయ పెట్టుబడుల కోసం 21-09-2011న స్థానిక ఎస్బీఐ నుంచి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.45 వేల రుణం తీసుకున్నారు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయారు. ఎస్బీఐ నుంచి గోపికి గురువారం అసలు, వడ్డీ కలిపి రూ. 59,232 ఈ నెల 29లోగా చెల్లించాలని లేకుంటే బంగారు వస్తువులను వేలం వేస్తామంటూ నోటీసు అందింది. అదే గ్రామానికి చెందిన దొడ్డి సత్తిపెంటారావు కూడా 30-07-2008లో మునగపాక ఎస్బీఐ నుంచి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.23 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నారు. రెండు దఫాలుగా రూ. పదివేలు చెల్లించారు. ఆయనకు కూడా బ్యాంక్ నుంచి అసలు, వడ్డీ రూ. 38,230 చెల్లించాలంటూ నోటీసు రావడంతో కంగుతిన్నారు. ఈనెల 29లోగా చెల్లించకుంటే వస్తువులను వేలం వేస్తామని చెప్పడంతో ఆవేదన చెందుతున్నారు. తాము రుణం చెల్లించలేని స్థితిలో ఉన్నామని అంటున్నారు. అధికారులను కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు : రైతులకు రుణమాఫీ అమలు చేసేవరకు బ్యాంక్‌లు ఎటువంటి నోటీసులు ఇచ్చినా తమ పార్టీ పోరాటం చేస్తుందని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మునగపాకకు చెందిన పలువురు రైతులకు నోటీసులు పంపడంతో శుక్రవారం వారితో కలిసి ఎస్బీఐ అధికారులను కలిశారు. వ్యవసాయం కలిసిరాక రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిపై ఒత్తిడి పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చే వరకు నోటీసులు రాకుండా చూడాలని కోరారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రైతులు రుణాలు చెల్లిస్తే వారికి కూడా మాఫీ పథకం అమలవుతుందన్నారు. ఈ ఆందోళనలో మునగపాక పీఏసీఎస్ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, వార్డు సభ్యుడు మళ్ల కృష్ణ, రైతులు ఆడారి గోపి, దొడ్డి సత్తి పెంటారావు తదితరులు పాల్గొన్నారు.