మా బతుకులు మమ్మల్ని బతకనీయండి | Farmers have objected on the capital master plan | Sakshi
Sakshi News home page

మా బతుకులు మమ్మల్ని బతకనీయండి

Published Tue, Jan 12 2016 1:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

Farmers have objected on the capital master plan

రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై రైతుల అభ్యంతరం
 పునాదిపాడుని రెసిడెన్షియల్ జోన్‌లోనే ఉంచాలంటూ వినతి

 
పునాదిపాడు (కంకిపాడు) : రాజధాని మాస్టర్ ప్లాన్‌తో మా బతుకుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో మార్చండి...రెసిడెన్షియల్ జోన్‌గా కొనసాగించి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి...అంటూ పునాదిపాడు రైతులు తహశీల్దార్‌కు విజ్ఞప్తిచేశారు. పునాదిపాడు పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో పునాదిపాడు, గొల్లగూడెం గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతు ప్రతినిధులు మద్దాలి తిరుమలరావు, మద్దాలి సాయిబాబు తదితరులు మాట్లాడుతూ గ్రామంలో 1686 ఎకరాల ఆయకట్టులో 650 ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు ఏర్పడ్డాయన్నారు. 1036 ఎకరాల్లో సాగు జరుగుతుందన్నారు. 2008 ఉడా మాస్టర్ ప్లాన్‌లో జీవో నెంబరు 387 ప్రకారం పునాదిపాడుతో సహా ఉయ్యూరు వరకూ రెసిడెన్షియల్ జోన్‌గా ప్రకటించారన్నారు. స్టాంపు డ్యూటీ రూ 50 లక్షలకు పెంచారన్నారు. చెన్నై-విశాఖ కారిడార్‌లో కంకిపాడు క్లస్టరులో 3200 ఎకరాలు పేర్కొంటూ కేంద్రం వద్ద జాబితాలు ఉన్నాయని, కారిడార్ పేరుతో ఇళ్లు, పొలాలు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో పొలాలు తీసుకుని నామ మాత్రపు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. అగ్రికల్చర్ జోన్ 1లో గ్రామాన్ని చేర్చటం వల్ల అభివృద్ధిలో వెనుకబడి పోతుందన్నారు. కొనుగోలుదారులు లేక, భూమిని నమ్ముకున్న రైతులు ఇబ్బందులో పడే ప్రమాదం ఉందన్నారు.

తహశీల్దార్‌కు వినతి
 రైతులు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ రోజాకు వినతిపత్రాన్ని అందించారు. రైతులు మాట్లాడుతూ సొంత పొలాల్లో రైతులు ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతులు ఎలా ఉంటాయో వివరించాలని కోరారు. రైతులు నష్టపోకుండా పునాదిపాడు గ్రామాన్ని రెసిడెన్షియల్ జోన్ గా కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు. రైతుల వినతులపై స్పందించిన తహశీల్దార్ రోజా మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా రైతుల నుంచి వచ్చిన అభ్యర్థలను పరిశీలించి సీఆర్‌డీఏకు నివేదిక పంపుతామన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా తమ వంతు కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచి జంపని వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి ముసిబోయిన వెంకటేశ్వరరావు, రైతు ప్రతినిధులు పీ.సుగుణమూర్తి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, అనుమోలు శ్రీను, ఆర్.నాగేంద్రబాబు, యార్లగడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement