రైతు ద్రోహి సీఎం చంద్రబాబు
కూడేరు: ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు ద్రోహి అని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాటమయ్య ధ్వజమెత్తారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ నాయకులు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు వెలుపలకు రాకుండా గేట్లు వేసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
కాటమయ్య మాట్లాతూ వరుస కరువులతో జిల్లాలో రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక రైతులు బతుకుతెరవుకోసం వలస బాట పట్టారన్నారు. వర్షాభావం వల్ల గడ్డి కొరత ఏర్పడి పశువులు అల్లాడుతున్నాయన్నారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న మూగజీవాలను తక్కువ ధరకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారన్నారు.అయినా ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వడంలేదని మండిపడ్డారు. గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి పశుసంపదను కాపాడాలన్నారు.
రైతు సాధికారత సంస్థ ద్వారా రైతులకు రుణమాఫీ చేస్తానని సీఎం చెబుతున్నారని, అసలు ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో స్పష్టం చేయడం లేదన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ వసంతలతకు అందజేశారు. కార్యాక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశులు, తాలుకా కార్యదర్శి గోపాల్, మండల కార్యదర్శి రమణ, నాయకులు సంగప్ప, మల్లిఖార్జున, శ్రీరాములు, రమణప్ప,ఖాశీం పీరా, పార్వతి ప్రసాద్ పాల్గొన్నారు.