సాక్షి, నెల్లూరు: రైతు భరోసా పథకంతో తమకు ధీమా వచ్చిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఏటా పంట పెట్టుబడికి నిధులిచ్చేలా వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన వేదికపై పలువురు రైతులు, గ్రామ సచివాలయ ఉద్యోగి వారి మనోగతాన్ని వెల్లడించారు.
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
రైతులకు అండగా ఉంటూ అన్ని విధాలా సాయం చేస్తున్న సీఎం జగన్‌కు రైతు కుటుంబాలతో పాటు ప్రజలంతా రుణపడి ఉంటారు. సీఎం రైతు పక్షపాతి. ఆయన రావడంతో వరుణుడు కూడా స్పందించడం శుభ సూచికం. ఐదారేళ్లుగా రైతులు పంటలు పండక, వర్షాలు పడక ఎన్నో కష్టాలు అనుభవించారు. ఈ రోజు జిల్లాలోని కండలేరు, సోమశిల జలాశయాలు నిండుగా కళకళలాడుతున్నాయి. సీఎం ముందుగానే ఆలోచించి చెరువులను నింపాలని ఆదేశించారు. అధికారులు కూడా స్పందించారు.
– చాంద్‌బాషా, మాజీ సర్పంచ్, రైతు, చెరుకుమూడి, మనుబోలు మండలం
రైతు సేవకుడిగా పనిచేస్తా
నిరుద్యోగిగా ఉన్న నేను గ్రామ సచివాలయ పరీక్ష రాసి జిల్లాలో మూడవ ర్యాంకుతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించా. నేను రైతు కుటుంబంలో జన్మించాను. పేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద చదువులు ఎలా చదవాలనే సమయంలో దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారు. దీంతో ఎమ్మెస్సీ, బీఈడీ చదవగలిగా. జగన్ సీఎం అయిన 100 రోజుల్లోనే 1.35 లక్షల మందికిపైగా శాశ్వత ఉద్యోగాలిచ్చారు. ఇలా ఉద్యోగం పొందిన నేను ఇప్పుడు రైతులందరికీ రైతు సేవకుడిగా పనిచేస్తా.
– సుబ్రహ్మణ్యం, సచివాలయ ఉద్యోగి, పాపిరెడ్డిపాళెం, టీపీగూడూరు మండలం
రైతుల కళ్లలో ఆనందం
పంట వేసుకునే సమయంలో రైతుభరోసా పథకాన్ని అమలు చేయడంతో రైతుల కళ్లలో ఆనందం కనపడుతోంది. సీఎం జగన్ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా.
– రమణారెడ్డి, రైతు, మహ్మదాపురం, పొదలకూరు మండలం
జగన్ పాలనలో ప్రాజెక్టులు నిండాయి
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నెల్లూరు జిల్లాలో బీసీని మంత్రిని చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మాజీ సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిండలేదు. వైఎస్ జగన్ సీఎం కాగానే అన్ని ప్రాజెక్టులు నిండాయి. సోమశిలలో 10 ఏళ్ల తర్వాత ఈ ఏడాదే 75 టీఎంసీలు నిల్వచేసిన ఘనత మన ప్రభుత్వానిది.
– అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి
రైతు భరోసా సువర్ణ అధ్యాయం
రైతు భరోసా పథకం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని రైతుల కోసం జగన్ చేశారు. వ్యవసాయ మిషన్ సమావేశంలో కొందరి విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ రైతులకు ఆర్థిక సాయాన్ని మరి కొంత పెంచి ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఐదునిమిషాల్లోనే తీసుకున్నారు. ఈ సాయం పెంచడం వల్ల ఆర్థిక భారం పెరుగుతున్నా కూడా సీఎం వెనుకాడలేదు.
– కన్నబాబు, మంత్రి
ప్రతి రైతుకు పథకం అందించడమే లక్ష్యం
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం రైతులను మోసగించినట్టు కాకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు పథకం అందించాలన్న లక్ష్యంతో జగన్ పని చేస్తున్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎలా తగ్గించుకోవాలా అని చూసేది. ప్రస్తుత ప్రభుత్వం అర్హులకు ఎలా పథకాన్ని అందించాలా అని చూస్తోంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి
భూ యజమానుల హక్కుల రక్షణకు చట్టం
రాష్ట్రంలో భూ యజమానుల హక్కుల పరిరక్షణకు, భూ యజమానికి మనోధైర్యం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. రైతుకు తెలియకుండానే ఎవరైనా భూమిని అమ్మితే ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారం ఆ రైతుకు పరిహారం చెల్లిస్తుంది.
– బోస్, ఉప ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment