సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘చెప్పిన దాని కన్నా ముందుగా.. మాట ఇచ్చిన దాని కన్నా మిన్నగా రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చాం.. అభివృద్ధి అంటే జీడీపీ లెక్కలు కాదు.. రైతు కుటుంబాలు బాగుంటేనే అభివృద్ధి.. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది.. రైతు భరోసాగా ఉంటేనే రాష్ట్రానికి కూడా భరోసా.. అన్నదాతలను ఆదుకునే దిశగా రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మార్పులు తీసుకొస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అన్నం పెట్టే రైతులకు అండగా ఉండాలని, తోడుగా నిలవాలని ఈ పథకాన్ని తెచ్చామన్నారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
54 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు వర్తింపు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో భూమి లేని వాళ్లే చాలా మంది ఉన్నారు. అలాంటి భూమి లేని నిరుపేదలకు కూడా మంచి చేయాలన్న ఆరాటంతో వారికి కూడా రూ.13,500 ఇవ్వడానికి ఈ పథకం ద్వారా శ్రీకారం చుట్టాను. 43 లక్షల మంది రైతులున్నారని గత ప్రభుత్వం సాధికార సర్వేలో లెక్కలు కట్టి తేలి్చంది. కానీ మన ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలనే కృత నిశ్చయంతో గ్రామ వలంటీర్లను, గ్రామ సచివాలయాల ద్వారా సర్వే చేస్తూ దాదాపు 51 లక్షల మంది రైతు కుటుంబాలకు పథకం ద్వారా లబ్ధి కలిగించాలని నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఈ పథకం కింద కౌలు రైతులుగా నమోదైన 3 లక్షల మందికి కూడా మొత్తంగా 54 లక్షల మంది రైతన్నలకు ఈ పథకం అమలు చేసే అవకాశాన్ని దేవుడు నాకిచ్చాడని సగర్వంగా చెబుతున్నాను.
ఈ ఏడాది ఇప్పటికే జూన్ మాసంలో రూ.2 వేలు ప్రతి రైతు చేతిలో పెట్టాం. ఇప్పుడు ఇక్కడి నుంచి బటన్ నొక్కితే మరో రూ.9,500 మీరు నిర్దేశించిన బ్యాంకు అకౌంట్లలో జమవుతుంది. మరో రూ.2 వేలు సంక్రాంతి పండగ వేళ ఇవ్వబోతున్నాం. మొత్తంగా చెప్పింది రూ.12,500 అయినా, ఈ సంవత్సరం ఇస్తామని చెప్పకపోయినా రూ.12,500 బదులు రూ.13,500 ప్రతి రైతుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు, ఆరి్థక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా ఇస్తున్నాం. చెప్పిన దాని కంటే ముందుగా, మాటిచి్చన దాని కంటే మిన్నగా మీ బిడ్డ అడుగులు ముందుకువేస్తున్నాడని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెబుతున్నాను.
నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోండి
రైతు భరోసాకు అర్హతలు,లబ్దిదారులు, ఇతర వివరాలు గ్రామ సచివాలయంలో, ఎమ్మార్వో కార్యాలయంలో కనిపిస్తాయి. ఎవరైనా మిగిలిపోయివుంటే గ్రామ సచివాలయాలు, వలంటీర్లను ఉపయోగించుకుని నవంబరు 15 వరకు నమోదు చేసుకోండి. లిస్టులో మీ పేరు చూసుకోండి. ఎవరికైనా రాకపోయుంటే కంగారు పడాల్సిన పనిలేదు. వెంటనే నమోదు చేసుకుంటే తర్వాత బుధవారానికి మీ బ్యాంకు ఖాతాలో డబ్బు పడుతుందని చెబుతున్నా. మరికొద్ది సేపట్లోనే రైతు భరోసా సొమ్మును 13 జిల్లాల్లోని రైతులు, కౌలు రైతుల ఖాతాల్లో జమ చేయడం మొదలవుతుంది.
నేను విన్నాను.. నేను ఉన్నానని ఆ రోజే చెప్పా..
2014 తర్వాత రాష్ట్రంలోని రైతులంతా కూడా సర్వం నష్టపోయామని విలవిలాలడుతున్న పరిస్థితులు చూశాం. నా 3,643 కి.మీ. పాదయాత్రలో కూడా 13 జిల్లాల్లోని రైతాంగం పడుతున్న కష్టాన్ని గ్రామ గ్రామంలో చూశా. మన రైతులు చిరునవ్వుతో బ్యాంక్ గడప తొక్కే పరిస్థితి లేని రోజులు చూశా. సున్నా వడ్డీ లేదు. పావలా వడ్డీ లేదు. బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలన్నీ అరకొరగా ఇస్తున్న రోజులు చూశా. ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా ఎలా ఎగరగొట్టాలన్న ఆరాటంతో గడిపిన ప్రభుత్వ తీరును చూశా. ధరల స్థిరీకరణ లేని రోజు చూశా. విపత్తు ఏదైనా వచి్చనప్పుడు సాయం చేయడానికి మంచి మనస్సు లేని ప్రభుత్వాన్ని కూడా చూశా. విడిపిస్తానన్న బంగారం విడిపించకుండా ఆ బంగారం వేలం వేసిన రోజులు కూడా నా పాదయాత్రలో గ్రామ గ్రామాన చూశా. ఐదేళ్లుగా వర్షాలు లేక అల్లాడిపోయిన రైతుల పరిస్థితులనూ చూశా. అన్నం పెట్టే రైతన్నలు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులు.
ఇలాంటి పరిస్థితులు నా కళ్ల ముందే కనిపించేవి. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 50 శాతం మంది రైతన్నలు అర హెక్టారు లోపే ఉన్నవాళ్లు. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నపుడు నా పాదయాత్రకు ముందు 2017 జూలై 8న నాన్నగారి జయంతి రోజున మంగళగిరిలో మన పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ రోజు నేను రైతన్నలకు ఒక మాట చెప్పా. (ఆ రోజు జగన్ చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించారు). రైతు భరోసాతో అండగా ఉంటానని మాటిచ్చా. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించాను. ఆ పాదయాత్రలో ఊరూరా రైతులు వారి కష్టాలు చెప్పుకున్నారు. మంచి రోజులు రాబోతున్నాయ్.. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేనున్నాను.. అని చెప్పాను. ‘మీ కష్టం నేను విన్నాను.. మీకు నేనున్నాను..’ అని హామీ ఇచ్చాను.
ఆ రోజు అక్షరాలా చెప్పిన దాని కన్నా 8 నెలల ముందుగానే ఈ రోజు ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నాం. ఇక రేపటి సంవత్సరం నుంచి ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలోనే రూ.7500, అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోతకైనా.. రబీ అవసరానికైనా.. రూ.4,000, రైతు పండగ సంక్రాంతి సందర్భంగా మరో రూ.2 వేలు ఇవ్వబోతున్నాం. రైతన్నల కోరిక మేరకు వ్యవసాయ మిషన్ సూచనల మేరకు అక్షరాలా రూ.12,500ను రూ.13,500కు పెంచి ఇస్తామని సగర్వంగా చెబుతున్నాను. మీరు చూపించిన ఆదరణకు మీ బిడ్డ కచ్చితంగా రుణం తీర్చుకుంటాడని చేతులు జోడించి హృదయ పూర్వకంగా తెలియజేస్తున్నా’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ఈ సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, పి.అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎంపీలు ఆదాల ప్రభాకరరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బల్లి దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి చేశాం..
►మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతున్నాం.
►రైతన్నకు పగటి పూట ఉచితంగా 60 శాతం ఫీడర్లలో 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం. (రూ.1,700 ఖర్చుతో మిగిలిన 40 శాతం ఫీడర్లను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేస్తాం.)
►పంటల బీమా కోసం అక్షరాలా 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు రూ.2,164 కోట్ల బీమా ప్రీమియం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నాం. రైతన్నకు ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది.
►భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు ఉపశమనం కలిగిస్తూ 11 నెలలు మాత్రమే పంటపై హక్కు ఉండేలా చట్టం తీసుకొచ్చాం.
►రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిగా వడ్డీని సొమ్మును మాఫీ చేసేలా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలుకు చర్యలు తీసుకున్నాం.
►రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.
►2019 ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 6.62 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశాం. రబీకి కావలసిన విత్తనాల పంపిణీ కూడా జరుగుతోంది.
►రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా చూశాం.
►కరువు కాలంలో ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేశాం.
►ధాన్య సేకరణలో గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించాం.
►తొలి నెలలోనే శనగ రైతుల్ని ఆదుకోవడానికి క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున రూ.300 కోట్లు మంజూరు చేశాం.
►పామాయిల్ రైతులు అవస్థలు పడుతున్నారంటే రూ.87 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం.
►రైతన్న ఆత్మహత్య చేసుకుంటే వారింటికి కలెక్టరే వచి్చ, వారి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షలు చేతిలో పెట్టి ఆదుకునే పరిస్థితి తీసుకురాగలిగాం.
►ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల అక్షరాలా రూ.770 కోట్ల మేర వారికి మేలు జరుగుతుంది.
►ఆవులు, గేదెలు చనిపోతే రూ.15 వేలు – రూ.30 వేల వరకు.. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేలు నష్టపరిహారం ఇచ్చేలా ఇన్సూరెన్స్ పథకాలకు నాంది పలికాం.
►నీటి ప్రాజెక్టుల్లో అందరికీ కనిపించేలా పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చాం.
►సింహపురి ప్రజలు మొన్నటి ఎన్నికల్లో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు మన పారీ్టకే ఇచ్చారు. నన్ను మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించినందున ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవడానికి మీ జిల్లా వాడిని ఇరిగేషన్ మంత్రిగా చేసి ఒకడుగు ముందుకేశాను.
ఇవి చేస్తున్నాం..
►చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు.
►గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.2 వేల కోట్లు చెల్లించబోతున్నాం.
►పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారని రేట్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
►మీ గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఒక షాపు ఏర్పాటు చేసి నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ ఇస్తాం.
►ప్రతి మండలంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్‌లు ఎక్కడెక్కడ అవసరమవుతాయో మార్కింగ్ చేసి, వాటిని ఐదేళ్లలో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపడతాం.
►ప్రతి రెండు మూడు నియోజవర్గాలను యూనిట్‌గా తీసుకొని అక్కడ ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావాలో అధ్యయనం చేస్తాం.
►రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. నెల్లూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తాను.
►సోమశిల హైలెవెల్ కాలువ పనులు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు, పెన్నా సంగం బ్యారేజి పనులతో పాటు కండలేరు హైలెవెల్ కాలువ పనులు, సౌత్‌పీడర్ కెనాల్, కాకుటూరు కెనాల్, తిక్కవరప్పాడు లిప్ట్ ఇరిగేషన్ పనులన్నింటినీ పూర్తి చేస్తాం.
రైతుల ఇళ్లలో పండుగ
వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభంతో రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికలకు ముందు ఇచి్చన హామీ కంటే మొత్తాన్ని పెంచి ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు బాంధవుడయ్యారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుంటున్న రైతు కుటుంబాలు ఇక ఎన్నడూ అలాంటి పాలన వద్దని నినదిస్తున్నారు.
– మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు నాయకుడు, ఒంగోలు
ఇచ్చిన మాటకన్నా ఎక్కువగా
గతంలో మన మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు కలిపి రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. ఇప్పుడు దానికి రూ.1000 పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఐదు సంవత్సరాలకు రూ.67,500 ఇస్తాం. చెప్పిన దానికంటే ముందుగానే, అంతకంటే రూ.17,500 ఎక్కువగానే 54 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
►సోమశిలలో 73 టీఎంసీల నీరు నిండడం పదేళ్ల క్రితం చూశాం. మళ్లీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా 75 టీఎంసీల నీరు ఉండడం చూస్తున్నాం అని రైతన్న నోటి నుంచి వచి్చన మాట విన్నప్పుడు నిజంగా చాలా ఆనందమేసింది. నిండు మనస్సుతో రైతుకు మంచి చేయాలన్న ప్రభుత్వం ఉంది కాబట్టే దేవుడు దీవించాడు. అందుకే దేశంలోని 29 రాష్ట్రాల చరిత్రలోనే రైతన్నకు అత్యధికంగా సాయం అందించే పథకాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నామని సగర్వంగా చెబుతున్నా.
►ఈ రోజు దాదాపు 40 లక్షల మందికి రైతుభరోసా కింద సొమ్ము అందిస్తున్నాం. మిగిలిన దాదాపు 14 లక్షల మంది రైతులకు కూడా ప్రతి బుధవారం వారి అకౌంట్‌కు రైతు భరోసా సొమ్ము చెల్లిస్తాం. ఎవరైనా మిగిలిపోయివుంటే గ్రామ సచివాలయాల్లో, ఎమ్మార్వో కార్యాలయాల్లో, కలెక్టర్ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో వచ్చే నెల 15లోగా దరఖాస్తు చేసుకోండి. మరో రెండు రోజుల్లో వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తాం. అర్హత ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలన్నది నా తాపత్రయం.
Comments
Please login to add a commentAdd a comment