కోటి ఆశల ఖరీఫ్ | Farmers prepared cultivation Kharif | Sakshi
Sakshi News home page

కోటి ఆశల ఖరీఫ్

Published Fri, Jun 12 2015 11:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Farmers prepared cultivation Kharif

 విజయనగరంవ్యవసాయం: చినుకులు పడుతుండడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.  గత కొద్ది రోజులుగా ఆడపా, దడపా వర్షాలు పడుతుండడంతో  విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. తొందరగా నాట్లు వేస్తే మంచి దిగుబడి వస్తుందని రైతులు తొందరపడుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 2,03,727 హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగుచేయనున్నట్టు వ్యవసాయాధికారులు అంచనావేస్తున్నారు.
 
 22 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం
 ఈ ఖరీఫ్ సీజన్‌లో 1,19,472 వేల హెక్టార్లలో వరి పంట సాగవుతుందని  వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి 80 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. అయితే  59,635 క్వింటాళ్లు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. ఇప్పటికి 22 వేల క్వింటాళ్లు  విత్తనాలు సిద్ధం చేశారు. 37,635 క్వింటాళ్లు ఇంకా  జిల్లాకు  రావాల్సి ఉంది.   20 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులు వద్ద ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు  చెబుతున్నారు.  అయితే  గత నాలుగేళ్ల నుంచి రైతులు  సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవడం మానేశారు.  ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలపైనే అధారపడుతున్నారు. జిల్లా రైతాంగం వద్ద 1000 క్వింటాళ్లకు మించి విత్తనాలు ఉండవు. మిగతా 19 వేల క్వింటాళ్ల కోసం రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి.
 
 మిగతా విత్తనాల  వివరాలు
 ఖరీఫ్‌లో వేసేందుకు వీలుగా వేరుశెనగ కె-9 రకం- 6 వేలు క్వింటాళ్లు, మినుము 1740 క్వింటాళ్లు , పెసర 1400 క్వింటాళ్లు, కంది 350 క్వింటాళ్లు, మొక్కజొన్న 3 వేలు క్వింటాళ్లు , పచ్చిరొట్ట ఎరువులు 3500 క్వింటాళ్లు సిద్ధం చేశారు.
 
 ఎరువుల కేటాయింపులు
 యూరియా 35 వేల టన్నులు అవసరం కాగా,  9 వేల టన్నులు   జిల్లాకు చేరింది. డీఏపీ 14 వేల టన్నులకు గాను నాలుగువేల టన్నులు,  పొటాష్ ఆరు వేల టన్నులకు గాను వేయి టన్నులు జిల్లాకు చేరాయి.   కాంప్లెక్స్ ఎరువులు 12  వేల టన్నులకుగాను 4700 టన్నులు  చేరాయి.
 
 రుణాధారిత రైతులే ఎక్కువ...
 జిల్లాలో సాగుచేసే రైతులు నాలుగు లక్షల 45 వేల మంది ఉన్నారు.   వీరిలో బ్యాంకు రుణాలు తీసుకున్నవారు 3లక్షల 40 వేలు మందే.  1.05 లక్షల మంది  రైతులు రుణాలు తీసుకోలేదు( నాన్‌లోనీ ఫార్మర్స్). అయితే రుణాలపై అధారపడి వ్యవసాయం చేస్తున్న వారిని గుర్తించి బ్యాంకులు రుణాలివ్వాలి.  పాత రుణాలును రీషెడ్యూల్ చేయడం తప్ప  కొత్తగా బ్యాంకులు రుణాలివ్వడం లేదు.
 
 కౌలు రైతుల పరిస్థితి దారుణం:  
 సాధారణ రైతుల పరిస్థితి కంటే కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైయింది.  కౌలు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఏటా చెబుతోంది తప్ప ఆదుకున్న దాఖలాలు లేవు. అన్నింటా కౌలు రైతులు దగాకు గురివుతున్నారు.  2011లో కిరణ్‌కుమార్ సర్కార్  కౌలు రైతులకు ప్రత్యేకంచి రుణ అర్హత కార్డులను మంజూరు చేసింది. ఆ ఏడాది  23,344 మంది రైతులను కౌలు రైతులుగా గుర్తించి రుణ అర్హత కార్డులు ఇచ్చారు. ఇందులో  5,438 మంది రైతులకు రూ.5.96 కోట్లు రుణాలు ఇచ్చారు. 2012-13లో 17,395 మంది రైతులను గుర్తించి 5710 మంది రైతులకు రూ.6.45 కోట్లు రుణాలు ఇచ్చారు. 2013-14లో 22,638 మంది రైతులను గుర్తించి 1821 మంది రైతులకుగాను 4.50 కోట్లు రుణాలు ఇచ్చారు. 2014-15 లో కౌలు రైతులను గుర్తించలేదు. 2015-16 లో 20 వేలు మంది వరకు కౌలు రైతులను గుర్తించారు. కానీ రుణాలు మంజూరు చేయలేదు.
 
 నారుమడులను సిద్ధం చేస్తున్న రైతన్న
   ఆడపా, దడపా వర్షాలు కురుస్తుండడంతో రైతులు నారుమడులను సిద్ధం చేస్తున్నారు. చెరువుల్లో  నీరు చేరగానే నారుపోసే ఆలోచనలో ఉన్నారు.


  సాగు వివరాలు: ఖరీప్ సీజన్‌లో వరి సాధారణ సాగు 1,19,472 హెక్టార్లు, చెరుకు 15,574, నువ్వులు 10,224 , మొక్కజొన్న 11,715, ప్రత్తి 13,770, వేరుశెనగ 13,264, గోగు 12, 145 , జొన్న 368, వలిసలు 292 , రాగి 2032, సామ 361, కొర్ర 166, కంది1719, మినుము 1251 హెక్టార్లు, పెసర 1124 హెక్టార్లు, పొగాకు 70 హెక్టార్లలో సాగువుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
 
 ప్రైవేటు వ్యాపారులే దిక్కు:
 ఈఏడాది ఖరీఫ్ రుణ లక్షం రూ.1009 కోట్లు కాగా ఇంతవరకు రూ.180 కోట్లు రుణాలుగా ఇచ్చారు. ఇందులో కూడా అధికశాతం బంగారం కుదవ పెట్టి రుణాలు తీసుకున్నవే.  బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు బంగారాన్ని కుదవ పెట్టి ఖరీఫ్ పెట్టుబడి కోసం రుణాలు తీసుకుంటున్నారు.  చాలా మంది రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.  అధిక వడ్డీలకు  అప్పు  తెచ్చి ఖరీఫ్‌కు పెట్టుబడిపెట్టే అగత్యం అన్నదాతకు ఏర్పడింది.
 
 18 వేలు చెరువులు:
 జిల్లాలో 18 వేలు   చెరువులున్నాయి.  కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలుకు  చెరువుల్లో నీరు చేరుతోంది. జిల్లాలో లక్షా 50 వేల హెక్టార్లకుపైగా  వర్షధారంపైనే సాగు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement