మద్దతుకే లొల్లి..! | farmers protests for ground nuts support price | Sakshi
Sakshi News home page

మద్దతుకే లొల్లి..!

Published Tue, Jan 28 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

farmers protests for ground nuts support price

మహబూబ్‌నగర్ వ్యవసాయం,గద్వాల న్యూస్‌లైన్: ఈ ఏడాది వేరుశనగ పంటను సాగుచేసిన రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా త యారైంది.  వర్షాలు సంమృద్దిగా కురవడంతో మంచిరోజులు వచ్చాయని రైతులు  భావించారు. గత రబీలో  ప ల్లీ పంటను వేసిన వారికి  కాస్తో కూస్తో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ ఏడాది కూడా అలాగే  ఉంటుందనే భావనతో  ఈ రబీలో 1.10 లక్షల హెక్టార్లలో వేరుశనగపంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంటకు తెగుళ్లు సోకాయి. దిగుబడి సగానికి తగ్గిపోయింది. 
 
వాస్తవానికి చెట్టుకు 20 కాయల వరకూ వస్తే మంచి కాపుగా భావిస్తారు. కాన్నీ పలు ప్రాంతాల్లో మొక్కకు ఏడునుంచి 10 కాయలకు మించి లేవు. మరోవైపు  మద్దతుధర రాక రైతులు తికమక పడుతున్నారు. ఈ స్థితిలో  రైతుల నుండి పంటను ప్రభుత్వ సంస్థల ద్వారా  కొనాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు వేరుశనగ కొనే ప్రయత్నం జరగలేదు. కొన్ని చోట్ల కేంద్రాలు తెరుస్తామని చెప్పినా ఇంకా అవి ప్రారంభం కాలేదు. దీంతో అన్నదాతలు తమకు తోచిన ధరకు ఇచ్చేస్తున్నారు.
 
 విత్తనానికి రూ.4,500..రైతు పంటకు  మాత్రం రూ.2,500 ?
 రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో ఈ ఏడాది వేరుశనగ విత్తనాలను సరాఫరా చేసి క్వింటాకు రూ.4500  తీసుకుంది. ఇప్పుడు పంట ధర మాత్రం  రూ. 2500 దాటడం లేదు.రైతులు తెచ్చిన పంట తడిగా ఉందని, నాపలు ఎక్కువగా ఉన్నాయంటూ  కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు  ధరను  పెరగనివ్వడం లేదు.
 
 వేరుశనగకు ప్రభుత్వం రూ.4వేలు మద్దతు దరను నిర్ణయించింది.జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1.60 లక్షల క్వింటాళ్లను రైతుల నుండి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల నుండి ఎక్కువగా రూ. 3000 వేల లోపే కొనుగోలు చేశారు.కాగా వచ్చిన దాంట్లో ఒక 10శాతం అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు చూపించి మిగతా 90శాతం  ఉత్పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ కర్షకులను నట్టేట ముంచుతున్నారు.
 
 తెగుళ్లతో తగ్గిన దిగుబడి
 గత నెలలో మంచు కురవడంతో వేరుశనగపంటకు తిక్కాకుమచ్చ తెగులు,  లద్దెపురుగు ఆశించింది. ఇది దిగుబడిని దెబ్బతీసింది.  వీటిని అదుపు చేసేందుకు రైతులు క్రిమిసంహారక మందులకోసం భారీగా పెట్టాల్సి వచ్చింది. 
 
 ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ సంస్థలు కొనుగోలు చేసేనా?
 మద్ధతు ధర సమస్య వచ్చినప్పుడు ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ వంటివి ముందుకు రావాలి.  ఇప్పటి వరకు ఈ సంస్థలతో కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకుంటే నిరసన కార్యాక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
 
 కంట తడే...
 గద్వాల ప్రాంతంలో వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి బోర్లు, బావులు, కాలువల కింద వేరుశనగ పంటను వేశారు. గత మూడు నెలల నుంచి వేరుశనగను విక్రయించేందుకు గద్వాల మార్కెట్ యార్డుకు తీసుకొస్తుండగా మార్కెట్‌లో వస్తున్న ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. యార్డుకు రోజూ దాదాపు 2 వేల బస్తాల వేరుశనగ వస్తోంది. నవంబర్ నెలలో రూ.3,500 నుంచి రూ.3,700 వరకు క్వింటాలుకు ధరలు వచ్చాయి. డిసెంబర్ నెలలో రూ,3,400 నుంచి రూ.3,500 వచ్చింది. జనవరి నెలలో సైతం రూ.3,600 నుంచి రూ. 3,800 వరకు వచ్చింది.
 
 జనవరిలో ఒక్క 24వ తేదీన ఒక లాట్‌కు అత్యధికంగా రూ.4,010 వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం వేరుశనగకు రూ.4 వేలు మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులనుంచి ఆ ధర పలకడం లేదు. ఇక గద్వాల మార్కెట్‌లో వారం రోజుల క్రితం ప్రభుత్వం ఏపీ ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే తేమ 8 శాతంగా, మట్టి, ధూళి క్వింటాలుకు కేవలం రెండు కేజీలు, నాపలు 4 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన ప్రకారం రైతుల వేరుశనగ ఉండడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయినప్పటికీ రైతులు అక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు. 
 
 తిక్కఆకుమచ్చ తెగులు ముంచింది
 నేను మూడెకరాల్లో వేరుశనగ  సాగుచేశాను.కాగా రాత్రి వాతావరణం చల్లగా ఉంటూ, ఆధికంగా మంచు కురవడంతో పంటకు తిక్క ఆకుమచ్చ తెగులు సోకింది.మందులకు రూ.10వేల ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలి. - శేఖర్, వడ్డేమాన్
 
 అప్పులు తీర్చే పరిస్థితే లేదు
 నేను 30 బస్తాల వేరుశనగ పంటను మహబూబ్‌నగర్ మార్కెట్‌యార్డుకు తీ సుకువచ్చాను.ధాన్యాంభాగాలేదని రూ. 2,400 వంతున చెల్లించారు. నేను ఈ పంట సాగు కోసం రూ.25వేల వరకు ఖర్చు చేశాను.కాగా ఇంత తక్కువ ధర చెల్లించడంతో చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేకుండా పోయింది. - మాణిక్యం...దౌల్తాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement