
మంత్రి పుల్లారావు ఇంటిని ముట్టడించిన రైతులు
గుంటూరు : శనగలకు మద్దతు ధర కల్పించాలని ప్రకాశం జిల్లా రైతులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావును డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని పుల్లారావు నివాసాన్ని శనగ రైతులు ముట్టడించారు. జిల్లాలో దాదాపు 17 లక్షల క్వింటాళ్ల శనగలు శీతల గిడ్డంగుల్లో మగ్గిపోతున్నాయని వారు పుల్లారావుకు ఈ సందర్భంగా వివరించారు.
20 రోజుల కిత్రం సీఎం చంద్రబాబును కలసి పరిస్థితి వివరించామని ఆయన ఫలితం లేకపోయిందని వారు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శీతల గిడ్డంగుల్లోని శనగలను వేలం వేస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పుల్లారావు... 15 రోజుల వరకు వేలాన్ని నిలిపివేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.