భూములు లాక్కుంటే ఉద్యమిస్తాం
జాతీయ రహదారిపై అన్నదాతల రాస్తారోకో
ఓర్వకల్లు : పరిశ్రమల స్థాపన కోసం సారవంతమైన భూములను తీసుకుంటే ఉద్యమిస్తామని అన్నదాతలు రోడ్డెక్కారు. బుధవారం మండలంలోని పాలకొలను, చింతలపల్లె, కొమరోలు, సోమయాజులపల్లె, చెన్నం చిట్టిపల్లె, హుసేనాపురం గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న 18వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ, మండలంలోని వేర్వేరు ప్రాంతాలలో పరిశ్రమల స్థాపన కోసం వేలాది ఎకరాలను సేకరించారని, ప్రస్తుతం మరో 10 వేల ఎకరాలు అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చెప్పినట్లు తెలిసిందన్నారు.
దీంతో సారవంతమైన నల్లరేగడి భూములపై సర్వే చేసి నివేదికలను తయారు చేయడం వల్ల సుమారు 7 గ్రామాలు ఎత్తిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోందని విమర్శించారు. ప్రతి ఏటా రెండు పంటలు పండే రూ.లక్షల విలువ చేసే భూములు కోల్పోతే రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోతారన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, సాగుకు యోగ్యంకాని భూముల్లో మాత్రమే పరిశ్రమలు స్థాపించుకోవాలని, వ్యవసాయ భూములు జోలికి వస్తే తిరగబడతామంటూ రెవెన్యూ అధికారులపై ధ్వజమెత్తారు.
ఎస్‌ఐ చంద్రబాబునాయుడు అక్కడికి చేరుకుని ఆందోళకారులను శాంతింపజేశారు. గ్రామాలు ఎత్తిపోయే పరిస్థితి లేదని, పట్టాభూములు తీసుకోవాలని తమకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్ తెలియజేయడంతో ఆందోళనకు తెరపడింది. వీరి ఆందోళన మూలాన గంటసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. వివిధ గ్రామాల రైతులు రామ్మోహన్‌రెడ్డి, భగవంతరెడ్డి, శివన్న, ఆకులరాముడు తదితరులు పాల్గొన్నారు.