విద్యుత్ కోసం రైతుల ఆందోళన
Published Fri, Feb 7 2014 2:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
చింతలపూడి, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి 7 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయూలని మండలంలోని వెలగలపల్లి, ఫాతిమాపురం గ్రామాలకు చెందిన రైతులు చింతలపూడి సబ్‌స్టేషన్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. కార్యాలయం గేటుకు తాళాలు వేసి, సిబ్బందిని బయటకు పంపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి అధికారులను నిలదీశారు.రోజుకు 4 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదని, సబ్‌స్టేషన్ పరిధిలో మొక్కజొన్న, పసుపు, మిర్చి, పొగాకు, కూరగాయల తోటలు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సం బంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని, కనీసం అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు.
కొన్ని ప్రాంతాల్లో వర్జీనియా పొగాకు తోటలకు 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులు, ఆహార పంటలకు సరఫరా చేయకపోవడం దారుణమని రైతు గోలి రామకృష్ణారెడ్డి విమర్శించారు. రైతుల ఆందోళనతో వాహనాల రాకపోకలు నిలిచిపోరుు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారితో చర్చించారు. ఈలోగా వెలగలపల్లి గ్రామానికి చెందిన గోలి లోకేశ్వరరెడ్డి, వంగాల సోమిరెడ్డిలు పక్కనే ఉన్న విద్యుత్ టవర్ ఎక్కి నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని బలవంతంగా కిందకు దింపారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Advertisement