విజయనగరం వ్యవసాయం: సాగు కోసం అన్నదాత అగచాట్లు పడుతున్నాడు. ఓ వైపు రబీ పనులు ముమ్మరంగా సాగుతుండగా... మరోవైపు పెట్టుబడులు ఎలారా దేవుడా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు గత్యంతరం లేక మళ్లీ ప్రైవేటు వ్యాపారుల వద్దకే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 68, 654 హెక్టార్లు కాగా ఇంతవరకు 46, 174 హెక్టార్లలో సాగైంది. అయితే రుణమాఫీ మాయల పుణ్యమా అని బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. రుణమాఫీ అవుతుందని రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో ఖరీఫ్‌లో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. రబీ సీజన్ వచ్చినా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు.
రబీలో రుణాలు ఇచ్చింది రూ.50 కోట్లే...
రబీ సీజన్‌లో రుణాల లక్ష్యం రూ.350 కోట్లు అయితే బ్యాంకులు ఇంతవరకు రూ. 50 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చాయి. అది కూడా రైతులు రుణమాఫీపై ఆశపడకుండా రుణాలు తిరిగి చెల్లించడంతో ఇచ్చారు. ఇందులో కూడా కొంతంమంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. రబీ సీజన్ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికి దాదాపు రుణాల లక్ష్యం పూర్తికావాలి. కానీ ఇంతవరకు రూ.50 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు.
ప్రైవేటు వ్యాపారులే దిక్కు...
చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, బ్యాంకులు మొండిచేయి చూపుతుండడంతో రైతులకు ఇప్పుడు ప్రైవేటు వ్యాపారులే దిక్కుగా మారారు. పంట సాగు చేయడానికి పెట్టుబడి లేకపోవడంతో కూలీలకు, ఎరువులకు, కలుపు తీయడానికి పెట్టుబడి పెట్టడానికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులు నూటికి రూ.2, రూ.3 వడ్డీకి అప్పులు తెస్తున్నారు.
మళ్లీ రుణం...
నా పేరు దారపు రెడ్డి రాము. మాది గంట్యాడ మండలం మధుపాడ గ్రామం. నేను రబీలో వరి పంట వేశాను. కూలీలకు, ఎరువులకు డబ్బులు లేక వడ్డీ వ్యాపారి వద్ద రూ.2వడ్డీకి రూ.15 వేలు అప్పు తెచ్చాను. గతంలో తెచ్చిన రుణం తీర్చలేదని బ్యాంకు వారు రుణం ఇవ్వలేదు.
- డి.రాము, రైతు, మధుపాడ
పెట్టుబడి ఎలా..?
Published Thu, Jan 8 2015 1:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement