పెళ్లికోసం చుట్టరికానికి వచ్చిన ఆ తండ్రీకొడుకులు మృత్యువాతపడి ఈ లోకాన్నే వీడారు. మంగళవారం సెంటిమెంటు ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.
రాజాం: పెళ్లికోసం చుట్టరికానికి వచ్చిన ఆ తండ్రీకొడుకులు మృత్యువాతపడి ఈ లోకాన్నే వీడారు. మంగళవారం సెంటిమెంటు ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. పచ్చని పెళ్లి పందిరి కాస్తా రోదనలు.. ఆర్తనాదాలతో నిండిపోయింది. మండలపరిధిలోని పెనుబాక గ్రామంలో ఈ నెల మూడో తేదీన జరిగిన వివాహానికి సంతకవిటి మండలం మందరాడకు చెందిన ఆకాశపు వీరభద్రుడు(45), ఆకాశపు శంకర్(21), వీరభద్రుడి భార్య లక్ష్మి, రెండో కుమారుడు భానుప్రసాద్ హాజరయ్యారు. ఈ పెళ్ళిల్లు కాస్తా విద్యుత్‌దీపాలతో అలంకరించి ఉంది.
పెళ్లి తరువాత సంప్రదాయంగా దగ్గరి బంధువులతో ఏనాలు పండగ సైతం మంగళవారం జరుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణానికి మంగళవారం మంచిరోజు కాదని కొంతమంది చెప్పగా బుధవారం వెళ్ళిపోవచ్చని పెళ్ళింట్లో ఉండిపోయారు. దురదృష్టవశాత్తూ ఇంటికి అలంకరించిన సీరియల్ సెట్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో తండ్రి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. ఆయన్ను రక్షించాలన్న శంకర్‌కూడా మృత్యువాతపడ్డాడు. స్థానికులు గుర్తించి 108 వాహనం ద్వారా రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా వారిద్దరూ మృతి చెందినట్టు వైద్యుడు గార రవిప్రసాద్ ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హతాశులైన గ్రామస్తులు
పెళ్ళి బాజా మోగి వారం తిరగలేదు. అదే ఇంట్లో చావుమేళం మోగడం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. పెళ్ళికి బంధువులుగా వచ్చిన వారు శవాలుగా తిరిగివెళ్ళడం వారిని తీరని విషాదం నింపింది. వారం రోజుల నుంచి పెళ్ళిలో అందరితో కలివిడిగా ఉన్నవారు విగతజీవులు కావడం ఎవరూ తట్టుకోలేకపోయారు.
మందరాడలో విషాదం
మృతుల స్వగ్రామమైన సంతకవిటి మండలం మందరాడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బావమరిది పెళ్ళికి ఎంతో హుషారుగా వెళ్ళిన వీరభద్రుడు కుటుంబంలో ఇద్దరు మృత్యువు పాలవ్వడం జీర్ణించుకోలేకపోయారు. శంకర్ ఇటీవల రాజాంలో ఐటీఐ చదివి వైజాగ్‌లో ఓ ఉద్యోగంలో చేరాడు. నెల రోజులు కాకముందే మామయ్య పెళ్ళి తాతగారింటి వద్ద జరుగుతుందన్న ఆనందంలో పరుగున వచ్చాడని, ఇంతలోనే మృత్యువాత పడ్డారని వారంతా ఆవేదన చెందారు. చేతికందివచ్చిన కుమారుడుతో పాటు భర్త మృతితో లక్ష్మి రోదన అందరినీ కంటతడి పెట్టించింది.