మృతుడు చంద్రశేఖర్‌రెడ్డి
బి.కొత్తకోట: పెళ్లిచూపులయ్యాయి.. ఇరు కుటుం బాలు వివాహానికి సరే అన్నాయి. పెళ్లికి తేదీ కూడా ఖరారు చేసుకోగా, అందుకు 15 రోజులకు ముందు నిశ్చితార్థం చేసుకొందామని నిర్ణయించుకొన్నారు. ఇంతలో విధి వెక్కిరించింది. పెళ్లి కొడుకుగా చూసుకొవాల్సిన కన్నబిడ్డ మంగళవారం మామిడితోటలో జీవచ్ఛవమై కనిపించడంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. గ్రామస్తులు, కుటుంబీ కుల కథనం మేరకు వివరాలు ఇలా..
పీటీఎం మండలం జెట్టోళ్లపల్లెకు చెందిన రిటైర్డ్ వీఆర్‌ఓ డీ.వెంకటరెడ్డి బి.కొత్తకోట మండలం కరెంట్‌కాలనీలో కాపురం ఉంటున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు డి.చంద్రశేఖర్‌రెడ్డి(30) ఎంటెక్ పూర్తి చేసి నెల్లూరుజిల్లా నాయుడుపేటలో ఓ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించి కర్ణాటకలోని ఓ సరిహద్దు గ్రామానికి చెందిన యువతిలో పెళ్లి నిశ్చయించారు. జూలై ఒకటిన వివాహం చేసేందుకు నిర్ణయించారు.
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి నాయుడుపేట నుంచి సోమవారం బి.కొత్తకోటలోని ఇంటికి చేరుకొన్నాడు. మంగళవారం ఉదయం 6గంటలకు మార్నింగ్ వాక్ కోసం పీటీఎం మండలం మల్లెల గ్రామంలోని వ్యవసాయం పొలం నుంచి మామిడితోపులోకి వెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. కొంతసేపటి తర్వాత గొర్రెల కాపరులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వారు చేరుకునేలోపే చంద్రశేఖర్‌రెడ్డి మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని బీరంగి గ్రామం కంబాలపల్లెలోని మృతుని తాత ఇంటికి తరలించారు. దీంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. స్థానిక తహసీల్దార్ బలరాముడు, ఆర్‌ఐ శ్రీనివాసులు, వీఆర్‌ఓలు మృతదేహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment