
యువతి శీలానికి వెల కట్టిన టీడీపీ నేత!
అసలే ప్రియుడు మోసం చేశాడని బాధలో ఉంటే.. డబ్బులు తీసుకుని గొడవ చేయోద్దంటూ టీడీపీ నేత మధ్యవర్తిత్వం చేశారు.
► అవమాన భారంతో యువతి ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: అసలే ప్రియుడు మోసం చేశాడని బాధలో ఉంటే.. డబ్బులు తీసుకుని గొడవ చేయోద్దంటూ టీడీపీ నేత మధ్యవర్తిత్వం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాధిత యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. బండారుపల్లి గ్రామానికి చెందిన కటారి నాగార్జున దర్జీ పనులు చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. సమీప బంధువైన ఓ యువతి(20)ని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తొలుత ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. అనంతరం మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు నెలలకిందట బెంగుళూరుకు తీసుకువెళ్లాడు.
ఓ ఇంట్లో కాపురం పెట్టారు. పెళ్లి చేసుకోమని కోరితే ఇదిగో అదిగో అంటూ సాకులు చెప్పేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వీరిద్దరూ బండారుపల్లికి వచ్చారు. గ్రామానికి చెందిన టీడీపీ నేత జోక్యం చేసుకొని పంచాయతీ పెట్టి మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. కొంత(రూ.50 వేలు) నగదు ముట్టచెబుతారని, ఎలాగోలా సర్దుకోవాలంటూ యువతికి నచ్చజెప్పే యత్నం చేశారు. న్యాయం కోసం నమ్మి వస్తే పెద్ద మనిషి ఇలా తన శీలానికి వెలకట్టడంతో మనస్తాపానికి లోనై శుక్రవారం పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
ఇది గమనించిన బంధువులు యువతిని ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే తనను మోసం చేసిన నాగార్జునను శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. నాగార్జున గతంలో కూడా మరొకరిని మోసగించాడని, ఆ కేసులో ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాడని బాధిత యువతి బంధువులు తెలిపారు.