సుదీర్ఘమైన ఎదురు చూపులు ఫలించిన వేళ... పదహారు నెలల జైలు జీవితం అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట అడుగుపెట్టిన ఆనంద క్షణాన... కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కళ్లు ఆనందంతో చెమర్చాయి.
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘమైన ఎదురు చూపులు ఫలించిన వేళ... పదహారు నెలల జైలు జీవితం అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట అడుగుపెట్టిన ఆనంద క్షణాన... కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కళ్లు ఆనందంతో చెమర్చాయి. ఇన్ని రోజుల ఎడబాటు తరువాత లోటస్‌పాండ్‌లోని ఇంటికి చేరుకున్న కొడుకును చూసి తల్లి విజయమ్మ చలించిపోయారు. నాన్న కోసం అనుక్షణం తల్లడిల్లిన రెండు పసి హృదయాలు ఉద్వేగానికి లోనయ్యాయి. దుఃఖం-సంతోషం మిళితమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన జగన్ పిల్లలు హర్ష, వర్ష తండ్రిని వాటేసుకున్నారు. ఆయన భార్య భారతి ఉద్వేగానికి లోనయ్యారు.
అన్న రాకతో షర్మిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చంచల్‌గూడ జైలు నుంచి బెయిలుపై విడుదలైన జగన్ రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నపుడు ఆయనకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణుల నుంచి అపూర్వమైన రీతిలో స్వాగతం లభించింది. గత ఏడాది మే 27వ తేదీన సీబీఐ పిలుపుమేరకు వరుసగా మూడోరోజు విచారణ కోసం ఇదే ఇంటి నుంచి ఆ రోజు ఉదయం 9.30 గంటలకు భారీ భద్రత నడుమ బయలుదేరి వెళ్లిన జగన్‌ను అటునుంచి అటే అరెస్టు చేసి తీసుకుపోయారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు జగన్ కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తూనే ఉంది. కష్టాల కడలిని దాటుకుని జైలు నుంచి వచ్చిన జగన్‌కు ఆత్మీయులు ఎదురేగి ఇంటిలోకి తీసుకెళ్లారు.
జైలు నుంచి ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అభిమానుల స్వాగత ర్యాలీతో జగన్ ఇంటికి చేరుకుని అడుగు లోపల పెడుతున్న క్షణం అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఉద్విగ్నానికి లోనయ్యారు. తల్లి, భార్య, పిల్లలు, సోదరి.. జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి పట్టారు. ‘వైఎస్సార్ అమర్ రహే... జై జగన్’ అంటూ అభిమానుల నినాదాలు మిన్నంటుతుండగా జగన్ ఇంట్లోకి అడుగు పెట్టారు. హాలులోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలు చల్లి వినమ్రంగా నివాళులర్పించారు. ఆ తరువాత తల్లి తన కుమారుడిని ముద్దాడారు. జగన్ కూడా అమ్మను ఆప్యాయంగా ముద్దాడారు. ఇల్లంతా పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు, బంధువులతో కిక్కిరిసి పోవడంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు.
జగన్ విడుదల సందర్భంగా ఇల్లంతా పూలతో అలంకరించడంతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఉదయం నుంచే జగన్ నివాసం బయట కార్యకర్తల, మీడియా కోలాహలం ఎక్కువగా కనిపించింది. ఉదయం నుంచే జనం అక్కడకు చేరుకోవడం ప్రారంభించారు. చంచల్‌గూడ జైలు నుంచి జగన్ బయటకు అడుగు పెట్టారనే వార్త తెలిసినప్పటి నుంచీ ప్రజలు ఆయన ఇంటి వద్ద బాణసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ కనిపించారు. ఆయన నివాసానికి చేరుకునే నలుమార్గాల్లోనూ ట్రాఫిక్ రద్దీ పెరిగి పోవడంతో పోలీసులు క్రమబద్ధం చేశారు. రాత్రి పదిన్నర గంటల తరువాత గానీ అక్కడ సద్దుమణగలేదు.