సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని... ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం పెట్టిన పార్టీకి మాత్రమే మద్దతిస్తామని స్పష్టం చేశారు. లోటస్‌పాండ్‌లో ఆయన గురువారం తటస్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ విధివిధానాల గురించి వారికి వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హంగ్ వస్తేనే మంచిదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 25 ఎంపీ స్థానాలను ప్రజలు వైఎస్సార్ సీపీకే కట్టబెడతారని.. తద్వారా కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని పేర్కొన్నారు.
విశాఖకు రైల్వేజోన్ రావాలి..
రైల్వేజోన్ అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని వైఎస్ జగన్ అన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు రైల్వేజోన్ ఉందని.. చట్టప్రకారం విశాఖకు రైల్వే జోన్ రావాలన్నారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ కోసం అలుపెరుగని కృషి చేస్తామని పేర్కొన్నారు.
మగ్గం ఉన్న ప్రతీ ఇంటికీ రూ. 2 వేలు
తమ పార్టీ ప్రకటించిన పథకాలను ఎంతగా కాపీ కొట్టినా ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మగ్గం ఉన్న ప్రతీ ఇంటికీ రూ. 2 వేలు ఇస్తామని, పవర్‌లూమ్ ఉన్న వారికి కరెంటు చార్జీలు తగ్గిస్తామని తెలిపారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతీ కులానికి ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
ఆర్థిక భరోసా కల్పిస్తాం..
వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో రూ. 75 వేలు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. గ్రామ సెక్రటేరియట్ ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ గ్రామంలో 10 మంది ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు ప్రతీ 50 కుటుంబాలకు రూ. 5 వేల జీతంతో ఒకరిని నియమిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని తెలిపారు.
తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తాం
ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ సీఎం చంద్రబాబు తన బినామీలకే కట్టబెడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. దేవాలయాల్లోని కాంట్రాక్టులు కూడా తన బంధువులకే అప్పగిస్తున్నారని ఆరోపించారు. కియా ఫ్యాక్టరీ ఘనత చంద్రబాబు తీసుకున్నా సరే గానీ.. అందులో 5 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన, ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.
ప్రతీ మే నెలలో రూ. 12,500
వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 85 లక్షల మందికి పైగా రైతులకు ప్రతీ మే నెలలో రూ. 12,500 ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ తన పదవీకాలంలో పథకాల తీరుపై స్వయంగా అధికారులకు ఫోన్ చేసేవారని.. సీఎం సీటులో ఉన్న వ్యక్తి ధ్యాసను బట్టి పథకాల అమలు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వాళ్లనే ఈ లోకం గుర్తుపెట్టుకుంటుందని.. అలా చేయని పక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతామని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment