జగన్ దీక్షకు భారీ బందోబస్తు
జగన్ దీక్షకు భారీ బందోబస్తు
Published Sat, Oct 5 2013 2:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షకు నగరపోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షను అడ్డుకుని, భగ్నం చేస్తామని కొన్ని సంఘాలు ప్రకటించడంతో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీక్షావేదికతో పాటు లోటస్‌పాండ్ చుట్టూ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించాలని నిర్ణయించారు. బందోబస్తుపై పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. జగన్ గత నెలాఖర్లో బెయిల్‌పై విడుదలైనప్పుడు ఆయన ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకోవడం తెలిసిందే. జైలు నుంచి లోటస్‌పాండ్ వరకు రోడ్ల న్నీ జనసంద్రమయ్యాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని వీఐపీల జాబితాలో ఉన్న జగన్ దీక్షకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి లోట స్‌పాండ్ వరకు ప్రధాన మార్గాల్లో నాలుగు చోట్ల బారికేడ్లతో కార్డన్ ఏరియాలు ఏర్పా టు చేయనున్నారు. లోటస్‌పాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఘా, గస్తీని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. దీక్ష జరిగినన్నాళ్లూ సీమాంధ్ర, ఇతర జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసుల అంచనా. సాధ్యమైనంతమేర వాహనాలను లోటస్‌పాండ్ దాకా రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. రావి నారాయణరెడ్డి ఆడిటోరియం వద్దే వాహనాలను ఆపేసి, అక్కడ నుంచి అభిమానులను కాలినడకన దీక్షాస్థలికి పంపాలని భావిస్తున్నారు.
Advertisement