ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. బంద్‌లో మూడోరోజైన ఆదివారం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వాహనాల రాకపోకలు నిలిపేశారు.
ఒంగోలు నగరంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేశాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద 27 మంది వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు రిలే దీక్ష చేపట్టారు. కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ప్రతి మహిళ ఉద్యమంలోకి రావాలన్నారు. జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు కఠారి శంకర్, కేవీ రమణారెడ్డి, వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
500కుపైగా మోటారు బైకులతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా కాకుండా నగరంలో షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లను సైతం మూసేయించారు. ఆటోల రాకపోకలను కూడా పలుచోట్ల అడ్డుకున్నారు. అనంతరం నగరంలోని ప్రధాన రహదారులగుండా మంగమూరు రోడ్డు జంక్షన్‌కు చేరుకున్నారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు త్రోవగుంట అంబేద్కర్ బొమ్మ వద్ద పలువురు తెల్లవారుజామునే వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. రామ్‌నగర్ పదో లైను వాసులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అద్దంకిలో గొట్టిపాటి దీక్ష భగ్నం: సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అద్దంకి తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు శనివారం రాత్రి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు బలవంతంగా ఆయన దీక్షను భగ్నం చేశారు. హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఆయన్ను పరామర్శించారు. సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా నిరవధిక దీక్ష చేపట్టాం తప్ప ఓట్లు, సీట్ల కోసం కాదని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు సంఘీభావంగా చీరాలలో మేరీబాబు చేపట్టిన 72 గంటల దీక్ష రెండో రోజుకు చేరింది. నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు అవ్వారు ముసలయ్య, పాలేటి రామారావు, యడం చినరోశయ్య, సజ్జాహేమలతలు మద్దతు తెలిపారు. కందుకూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ నూకసాని బాలాజీ, ఉన్నం వీరాస్వామి, తూమాటి మాధవరావు ఆధ్వర్యంలో 200కుపైగా బైక్‌లతో ర్యాలీ నిర్వహిస్తూ షాపులను మూసేయించారు. కందుకూరు నుంచి ఉలవపాడు వరకు మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. ఉలవపాడు హైవేపై 2 గంటలపాటు రాకపోకలు నిలిపేశారు. రోడ్లపై వంటావార్పు చేశారు. కందుకూరులో ఐదుగురు రిలే దీక్ష చేపట్టారు. కనిగిరిలో నిరసన ర్యాలీతోపాటు రాస్తారోకో కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. పొన్నలూరు, కనిగిరిలో ఏడుగురు రిలే దీక్ష చేపట్టారు. టంగుటూరులో కూడా నిరసన ర్యాలీలు నిర్వహించి రాస్తారోకో చేశారు.
దర్శిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మోటారు బైకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావులు గిద్దలూరు పట్టణానికి ఇరువైపులా ఉన్న ప్రధాన రహదారులను దిగ్బంధం చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. కంభానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు 15 మంది ఆదివారం దీక్ష చేపట్టారు. ఆంటోనీ, సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాచర్ల వాసులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గిద్దలూరు వరకు వారు మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. కొమరోలు మండలం రెడ్డిచర్లలో సమైక్యవాదుల గర్జనపేరుతో ఆందోళన నిర్వహించారు. కంభంలో కూడా రాస్తారోకో చేశారు. సంతనూతలపాడులో నియోజకవర్గ సమన్వయకర్త అంగలకుర్తి రవి, మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డిలు పార్టీ నేతలతో కలిసి రాస్తారోకోతో పాటు బంద్ నిర్వహించారు.
బంద్ విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు : వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ
ఒంగోలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన 72 గంటల బంద్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాల కన్వీనర్లు, మండల, నగర పార్టీ కన్వీనర్లు, కార్యకర్తలు వివిధ స్థాయిలో ప్రతి ఒక్కరూ బంద్ విజయవంతం చేసేందుకు సహకరించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు సంఘీభావంగా రిలే దీక్షలు చేస్తున్న వారికి కూడా అభినందనలు తెలిపారు. వ్యాపార సంస్థలు, థియేటర్లు, ఆటోల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
మూడోరోజూ వైఎస్సార్ సీపీ బంద్ విజయవంతం
Published Mon, Oct 7 2013 3:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement