నిమ్స్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై దాష్టీకం
సాక్షి, హైదరాబాద్: తనయుడి ఆరోగ్యంపై తల్లడిల్లిన తల్లి.. అనుమతితో వచ్చినా అడ్డుకున్నారు. తమ నేత పరిస్థితిపై ఆందోళన చెందుతున్న అభిమానులపైనా దయచూపకుండా లాఠీచార్జి చేసి అరెస్ట్ చేశారు. నిమ్స్ వద్ద శనివారం పోలీసులు చూపిన అత్యుత్సాహమిది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఆందోళన చెందిన పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్‌మోహన్‌రెడ్డి తల్లి విజయమ్మ శనివారం సాయంత్రం నిమ్స్‌కు వచ్చారు. ముందు రోజు కూడా ఆమె నిమ్స్‌కు వచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకోవటంతో ఆమె ఈసారి జైలు అధికారుల అనుమతి తీసుకుని వచ్చారు. కానీ పోలీసులు ఆమె వాహనాన్ని నిమ్స్ గేటు వద్దే అడ్డుకున్నారు.
జగన్‌ను చూసేందుకు తనకు అనుమతి ఉందని ఆమె వెల్లడించినా వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవంటూ ఆక్షేపించారు. దీంతో అక్కడున్న జగన్ అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. అధికారుల అనుమతి ఉన్నా అడ్డుకోవటం ఏమిటని పోలీసులను నిలదీశారు. దీంతో ఉన్నతాధికారులు విజయమ్మ వాహనాన్ని లోనికి వెళ్లనిచ్చారు. ఆ తర్వాత కూడా ఆమెను ఆస్పత్రి ఆవరణలో కొద్దిసేపు నిలువరించారు. ‘‘మూడు రోజులుగా జగన్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది. కన్నతల్లిని కనీసం చూసేందుకు కూడా వెళ్లనివ్వని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు’’ అంటూ విజయమ్మ కంటతడి పెట్టారు.
అభిమానులపై లాఠీచార్జి, అరెస్ట్‌లు..
జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, బాజిరెడ్డిలతో పాటు రాష్ట్రం నలువైపుల నుంచి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిమ్స్‌కు తరలివచ్చారు. ఆస్పత్రి వద్ద జగన్ బొమ్మలతో కూడిన మాస్క్‌లు, ప్లకార్డులు పట్టుకొని నినదించారు. వైద్యులు మెడికల్ బులెటిన్ ప్రకటించే సమయంలో తమ ప్రియతమ నేత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ఆత్రుతలో కార్యకర్తలు మీడియా పాయింట్ వద్దకు రాగానే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీలు ఝళిపించారు. 12 మందిని అరెస్ట్‌చేసి గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
లాఠీచార్జిలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు షేక్ నయీముద్దీన్ కాలికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఉన్న బంధువులను కలవటానికి వచ్చిన ఇద్దరు విద్యార్థులను సైతం పోలీసులు చితకబాది వ్యాన్‌లో ఎక్కించారు. మరోవైపు సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వంద మంది పార్టీ కార్యకర్తలు జగన్ మాస్క్‌లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ‘రాష్ట్ర విభజన ఆపండి - జగన్ ప్రాణాలు కాపాడండి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.