అడ్డగోలు విభజనపై యావద్దేశం ఆలోచించాలి: వైఎస్ జగన్
అడ్డగోలు విభజనపై యావద్దేశం ఆలోచించాలి: వైఎస్ జగన్
Published Sat, Oct 5 2013 1:49 AM | Last Updated on Wed, Aug 8 2018 5:45 PM
‘‘ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విభజనపై యావత్ దేశమూ ఆలోచించాలని నేను కోరుతున్నాను. మార్పు రావాలి. ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశే కాదు. ఓట్ల కోసం, సీట్ల కోసం రేపు కర్ణాటకను, తమిళనాడును విభజించే పరిస్థితి రావచ్చు. ఇంకా ఎక్కడైనా విభజన చేయవచ్చు. దీనికొక విధానం ఉండాలి. ఒక నిబద్ధత (సాంక్టిటీ) ఉండాలి. ఒక హేతుబద్ధత ఉండాలి’’ అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీకి కూడా విజ్ఞప్తి చేస్తారా అని ప్రశ్నించగా, ‘ఎందుకు ఒక్క రాహుల్ గురించే అడుగుతారు? ఇక్కడి పరిస్థితులను చూడాల్సిందిగా, జోక్యం చేసుకోవాల్సిందిగా దేశం మొత్తాన్ని నేను కోరుతున్నాను. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను అడుగుతున్నాను. నేనిది అన్యాయమంటున్నాను. మన భావితరాల దుస్థితిని ఊహించమని కోరుతున్నాను. మనకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది నిజం, ఇది ఎక్కడైనా జరగొచ్చు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. వాళ్లు వద్దని, వీళ్లు రావాలని నేననడం లేదు. అందరినీ, అన్ని పార్టీలనూ రమ్మని అడుగుతున్నాను. మాకు జరుగుతున్న ఈ అన్యాయంపై యావత్ దేశం మన వెనుక నిలబడి పోరాడాలని కోరుతున్నాను. అందరూ ఒత్తిడి పెంచాలని కోరుతున్నాను. ఈ అన్యాయమైన నిర్ణయం తీసుకున్న వాళ్లు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. నిర్ణయం తీసుకున్న వాళ్లు ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవాలని అంటున్నాను. ఇలా చేయడం సరికాదని వాళ్లు భావించాలంటున్నాను. ఈ రోజు దీన్ని అంగీకరిస్తే ఇంతటితో ఆగదు. ఓట్ల కోసం, సీట్ల కోసం రేపు దేశంలో ఇంకెక్కడైనా చేస్తారు’’ అని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఉద్దేశించి జగన్ అన్నారు.
సోనియాను ఎందుకు విమర్శించడం లేదన్న చంద్రబాబు విమర్శలను ఓ విలేకరి ప్రస్తావించగా, ‘ఏం ప్రశ్న ఇది? ఇక్కడ మనమెందుకు కూర్చున్నాం? ఒక ప్రధానమైన లక్ష్యం కోసం ఉన్నామిక్కడ. మీరేం ప్రశ్న అడుగుతున్నారు?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రాష్ట్రాన్ని కొందరు అడ్డగోలుగా విభజిస్తున్నారు. ఇంకొందరు దానికి మద్దతిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని నేను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నాను. అది ఎఫ్‌డీఐ విషయంలో రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా కావచ్చు. నేను వ్యతిరేకించాను. చంద్రబాబు దాన్ని బలపర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసినప్పుడు రాష్ట్ర ప్రభత్వంపై అవిశ్వాస తీర్మానం వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పార్టీ ఓట్లేసింది. కానీ చంద్రబాబు మాత్రం విప్ జారీ చేసి మరీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఎవరు, ఎవరితో కలిసిపోయి ఉన్నారు? రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇది జరుగుతోందని. అయినా ప్రస్తుత సమస్య నుంచి దారి మళ్లించేందుకే ఈ ప్రయత్నమంతా జరుగుతోంది. దయచేసి అలా చేయొద్దు’ అన్నారు.
Advertisement
Advertisement