సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష! | Y S Jaganmohan Reddy to go on indefinite fast against AP bifurcation decision | Sakshi
Sakshi News home page

సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష!

Published Sat, Oct 5 2013 1:13 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష! - Sakshi

సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష!

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు నిరసనగా, విభజన విషయంలో అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పరిణామాలపై సమీక్షించారు. విభజన విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. సమావేశానంతరం పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మలతో కలిసి జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్యాయం జరుగుతున్న ప్రాంతంలో చెలరేగుతున్న ఆందోళనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎంత నిరంకుశంగా ఈ విభజన కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 నోట్‌ను ఆమోదించాక ఏర్పాటు చేయబోయే కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) ఆరు వారాల్లో విభజన సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందా అని సూటిగా ప్రశ్నించారు. ‘మా ఇష్టం వచ్చినట్టు మేం చేసేస్తాం, మీ చావు మీరు చావండి’ అన్న చందంగా విభజన చేస్తున్న వారు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకోవడానికి అన్ని పార్టీలూ తమ జెండాలతోనే కార్యాచరణలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా చరిత్రహీనుడిగా మిగిలి పోకుండా, ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని హైలైట్ చేయాలని జాతీయ మీడియాను కోరారు. యావత్ దేశంలోని అన్ని రాజకీయాల పార్టీల వారూ ఇందులో జోక్యం చేసుకోవాలన్నారు. ఇంత అప్రజాస్వామికంగా, అడ్డగోలుగా విభజన చేస్తున్నా దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన అయిపోయిందా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ విభజన కార్యక్రమాన్ని వీళ్లు ఎంత నిరంకుశంగా చేస్తున్నారంటే గతంలో ఎక్కడా, ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా అసెంబ్లీ తీర్మానం చేయాలన్న సంప్రదాయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోని అంశమన్నట్టుగా పక్కన పెట్టి, అధికారం ఉంది కదా అని వాళ్లిష్టం వచ్చినట్టుగా విభజన కార్యక్రమం చేపట్టారు.
 
దీనిపై మా పార్టీలో ఈ రోజు (శుక్రవారం) సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రుల బృందం వివిధ అంశాలపై ఆరు వారాల్లో పరిష్కారం చూపుతుందట. అంటే దానర్థం వాళ్లిష్టం వచ్చింది వాళ్లు చేసేస్తారు, మీ చావు మీరు చావండి అని చెప్పకనే చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒకటే అడుగుతున్నా. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్... ఇలా ఎక్కడ చూసినా అసెంబ్లీ తీర్మానం లేకుండా గతంలో ఎప్పుడూ విభజన చేయలేదు. విదర్భ విషయంలోనైతే తీర్మానం చేసినా పక్కన పెట్టారు. కానీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎందుకిలా అన్నీ పక్కనపెట్టి, అసెంబ్లీ తీర్మానం అనే ప్రస్తావనను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి, ఇంత అడ్డగోలుగా ఎందుకు విభజిస్తున్నారని మాత్రం నేను అడగదల్చుకున్నా’’ అని జగన్ అన్నారు. 
 
 ఈ శాస్త్రీయ ప్రక్రియను పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం మా అందరి జీవితాలతో ఇలా చెలగాటం ఆడుతున్నందుకు నిరసనగా శనివారం నుంచి హైదరాబాద్‌లో తమ కార్యాలయం ఎదురుగానే ఆమరణ నిరాహార దీక్షకు తాను కూర్చుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ‘దేవుడు అనుకూలిస్తే, మీ అందరి మంచి మనసులు తోడయితే, దేవుడి దయ వల్ల మీ అందరి మంచి మనసుల వల్ల పరిష్కారం వస్తుందని ఆశిస్తూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయం గురించి చెప్పడానికి త్వరలో తమ పార్టీ నేతలతో ఒక బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్టు వివరించారు. వారు ఢిల్లీ పెద్దలందరితో పాటు పలు పార్టీల ఫ్లోర్ లీడర్లందరినీ కలుస్తారన్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి, రాష్ట్రం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తారని వెల్లడించారు. అన్యాయం జరుగుతున్న ప్రతి ప్రాంతంలోనూ ఇప్పుడు జరుగుతున్న బంద్‌లు, ధర్నాలు పూర్తిగా కొనసాగుతాయని జగన్ వివరించారు. ఎందుకింత ఆరాటపడుతున్నాం, ఎందుకింత బాధ పడుతున్నామన్న విషయాన్ని కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర పెద్దల దాకా అందరూ ఆలోచన చేయాలని కోరారు.
 
 నీళ్ల సంగతేంటి?
 ‘‘ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? రాష్ట్రం ఒక్కటిగా ఉన్నపుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర దాటుకుని కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ దాటుకుని, అవి నిండాకే వాటిని కిందికి వదిలే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ఏమిటి? నాగార్జునసాగర్‌కు నీళ్లెలా ఇస్తారు? ఇలాంటి అంశాల మీద మాట కూడా చెప్పరు. ట్రిబ్యునళ్లున్నాయి, అవి చూసుకుంటాయని నోటికొచ్చినట్టుగా ఏదో అనేస్తున్నారు. నేను ఒక్క మాట అడగదల్చుకున్నా. నిజంగానే ట్రిబ్యునళ్లకు ఇంత పలుకుబడి ఉంటే ఇవాళ మహారాష్ట్ర ఈ విధంగా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్ నిండితే తప్ప కిందకు నీళ్లు వదలని పరిస్థితి ఎందుకుంది? అడిగే వాడు లేడు. పేరుకు మాత్రం, ‘ట్రిబ్యునళ్లున్నాయి, అవి చూసుకుంటాయ’ంటారు. 
 
 అవి నిజ ంగానే ఉంటే కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు ఇవాళ్టికి కూడా రోజూ కొట్టుకునే పరిస్థితి ఎందుకుంది? ఏటా గొడవలు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? అవసరం వచ్చినపుడు మాత్రం, ‘ట్రిబ్యునళ్లున్నాయి’ అంటూ వాటిమీద నెట్టేస్తారు. ఆ తరువాత మీరు కొట్టుకోండని చెప్పి సంవత్సరం, సంవత్సరం మీరే చావండని చెబుతారు. కృష్ణా ఆయకట్టులో రోజూ గొడవలు జరుగుతాయి. కృష్ణా ఆయకట్టంటే కేవలం ఇటువైపున్న ఎనిమిదిన్నర జిల్లాలు మాత్రమే కాదు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరే కాదు. అటువైపు మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం ఉన్నాయి. రోజూ కొట్టుకునే, తన్నుకునే పరిస్థితి వస్తుంది. ఇదా మీరు చేయాల్సిన పని? ఓట్ల కోసం, సీట్ల కోసం మా జీవితాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సబబని అడుగుతున్నాను. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పదేళ్లలో వెళ్లిపోవాలంటున్నారు. ఆరు వారాల్లో జీఓఎం పరిష్కారం చూపుతుందట. నేను అడగదల్చుకున్నా. నిర్మించడానికి 60 ఏళ్లు పట్టిన ఈ నగరాన్ని పదేళ్లలో ఎక్కడైనా, ఎవరైనా కట్టగలరా? చదువు అయిపోయిన వెంటనే, ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే, డిగ్రీ అయిపోయిన వెంటనే ఆ పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని అడగదల్చుకున్నా! పరిష్కారాలుండవు. వాళ్లిష్టం వచ్చింది చేసేస్తున్నారు. మీ చావు మీరు చావండంటున్నారు’ అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. స్పందించాల్సిన వారేమో ఓట్లు, సీట్లు పోతాయని స్పందించకుండా గమ్ముగా ఉండిపోతున్నారు. ఇది మారాలి! 
 
ఎక్కడైనా రాష్ట్రాలను విడగొట్టాలి అనంటే ఒక పద్ధతి ఉండాలి. అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాలను విడగొట్టరాదంటూ చట్టం తేవాలి’ అని జగన్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులు మారడం కోసమే ఆమరణ దీక్షకు  శ్రీకారం చుడుతున్నానన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీని కూడా కలిసి అడుగుతారా అని ప్రశ్నించగా, ‘బంగారంగా’ అని బదులిచ్చారు. ‘ప్రతి పార్టీనీ రమ్మని నేను చెబుతున్నా. మూడు పార్టీలు, ఐదు పార్టీల నుంచి సంఖ్య మారాలి. చంద్రబాబునాయుడు గారిని కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా... అయ్యా చరిత్రహీనుడిగా మిగిలి పోవద్దు, రండి, మూడు పార్టీల వైపునకు రండని. ప్రతి పార్టీనీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరమూ కలవాల్సిన అంశం ఇది. పొరపాటు చేశాము అంటే ముందు తరాలకు మనం అన్యాయం చేసినవాళ్లం అవుతాము. అది తెలుసుకోమని ఇవాళ ప్రతి ఒక్కరినీ వేడుకుంటూ అడుగుతున్నాను’ అన్నారు.
 
తీర్మానాన్ని కావాలనే విస్మరిస్తున్నారు
‘‘అసెంబ్లీ తీర్మానం లేకుండా ఇలా విభజించాలనుకోవడం న్యాయమా అని అడుగుతున్నాను. ఈ మౌలికమైన అంశాన్ని, ఈ అన్యాయాన్ని హైలైట్ చేయాలని జాతీయ మీడియాను కోరుతున్నా. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు పూనుకోవడమంటే మనం ఎలాంటి ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం? విభజన చేయాలనుకుంటున్న వాళ్లు అసెంబ్లీ తీర్మానాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. కొద్దిరోజుల్లో సాధారణ ఎన్నికలకు పోతున్నాం. ఈ దశలో విభజన సరైన చర్య అవుతుందా? ఓట్లు, సీట్ల కోసమే తప్ప ఇందులో ఏదైనా ఆచరణయోగ్యత ఉందా? ఆరు వారాల్లో కేంద్ర మంత్రుల బృందం సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందా?’’ అని జగన్ ప్రశ్నించారు.
 
సమైక్యం కోసం అంతా జెండాలు పట్టుకుని రావాలి
పార్టీ జెండాలు వద్దని జేఏసీ చెప్పడాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘‘లేదు. నేను పార్టీ జెండాలతోనే రమ్మంటున్నా. ప్రతి ఒక్కరూ జెండాలు పట్టుకుని ధైర్యంగా రండి. తప్పేముందమ్మా. నేనే చెబుతున్నా. బీజేపీ వాళ్లను కూడా జెండాలు పట్టుకునే రమ్మంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా జెండాలు పట్టుకునే రమ్మంటున్నాను. వైఎస్సార్‌సీపీ వాళ్లను కూడా జెండాలు పట్టుకునే రమ్మని చెబుతున్నాను. పార్టీ అధ్యక్షులు ముందుకు కదలాలి. పార్టీల్లో నిజాయితీ ఉండాలి. పార్టీ అధ్యక్షుల్లో నిజాయితీ ఉండాలి. మనం జెండాలు పట్టుకుని ఉన్నప్పుడే ఆ పరిస్థితి తీసుకురాగలం’ అని జగన్ బదులిచ్చారు. 
 
 ఇంత పెద్ద లక్ష్యంతో ఉద్యమిస్తున్నప్పుడు అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ‘ నేను వాస్తవం చెబుతున్నా. రేప్పొద్దున నీళ్లు లేకపోతే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ట్రిబ్యునళ్ల గురించి మీరే చూస్తున్నారు. కర్ణాటకలో ఏం జరుగుతా ఉంది? తమిళనాడులో ఏం జరుగుతా ఉంది? నేను చెప్పేదాంట్లో ఒక్క దాన్లో కూడా అబద్ధముంటే, అవాస్తవముంటే మీరే చెప్పండి. రాష్ట్రంలో మనందరమూ ఉన్నాం. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనమింకా పార్టీ రాజకీయాలను పెంచి పెద్ద చేయాలన్న ఆలోచనతో తప్పుదారి పట్టించొద్దు. భవిష్యత్ తరాల గురించి కనీసం కొంతైనా ఆలోచన చేయాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి రాజకీయాలకు అతీతంగా ఆలోచనలు చేయమని సవినయంగా ప్రార్థిస్తున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement