జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు అపూర్వ మద్దతు
చంచల్‌గూడ జైలు వద్ద భారీగా అభిమాన సందోహం
జై జగన్ నినాదాలతో హోరెత్తిన పరిసరాలు
నిర్బంధించిన పోలీసులు, స్థానికులనూ తరిమేసిన వైనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన నిరాహార దీక్షకు ప్రజాభిమానం వెల్లువెత్తింది. బుధవారం నాలుగో రోజున ఆయన దీక్షకు మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో జైలుకు తరలివచ్చారు. ‘జై జగన్..’ అన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. శాంతియుతంగా ఆందోళన చేసేందుకు అనుమతించాలని వారు పదేపదే కోరినా పోలీసులు విన్పించుకోలేదు. జైలు పరిసరాలకు చేరకుండానే వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నిర్బంధాన్ని ప్రతిఘటించిన అభిమానులపై బలప్రయోగం చేశారు. మహిళలను సైతం లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో కుక్కేశారు. కనీసం నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని వేడుకున్నా వినలేదు. 150 మందిని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో జైలు పరిసరాలకు వచ్చిన స్థానికులనూ తరిమివేశారు. ఎదురు తిరిగిన వారిని భయపెట్టారు. బెదిరించారు. అక్కడి నుంచి పంపేశారు.
పరిసరాలన్నీ ఖాకీమయం
హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు విడతలవారీగా జైలు వద్దకు వచ్చారు. వారిలో రంగారెడ్డి, మెదక్ జిల్లాల యువకులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ముందే ఊహించిన పోలీసులు జైలు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంతోష్‌నగర్ సబ్ డివిజన్‌కు చెందిన ఆరు పోలీసు స్టేషన్ల బలగాలను అక్కడే మోహరించారు. అదనంగా సరిహద్దు భద్రత దళాలను రప్పించారు. జైలు ప్రధాన ద్వారం వద్దయితే ఎమర్జెన్సీని తలపించేలా ఏర్పాట్లు చేశారు. ఆంక్షలతో సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలిగించారు. ఎదురుగా ఉన్న రోడ్డులో ఒకవైపు భాగాన్ని మూసేశారు. ప్రత్యేకంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అయినా అభిమానులు అనేక మార్గాల్లో జైలు వద్దకు చేరుకున్నారు. పోలీసులను ఎదిరిస్తూ జైలు ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. పెల్లుబికిన నిరసనల నడుమ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
అరెస్టులు చేస్తామన్నా వెనుకాడని అభిమానులు
జైలు వద్దకొస్తే అరెస్టు చేస్తామని పోలీసులు పదేపదే హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నేతలకు పోలీసు అధికారులు ఫోన్లు చేసి మరీ ఈ మేరకు చెప్పారు. జైలు పరిసరాలను నిషేధిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. కానీ జగన్ అభిమానులు ఇవేవీ లెక్కజేయలేదు. సొంత వాహనాల్లో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. అరెస్టులు చేసినా వెనుకాడేది లేదని పోలీసులకు స్పష్టం చేశారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డిని నమ్ముకుని ఈ కాంగ్రెస్‌కు ఓటేశాం.
మాకు కనీసం నిరసన తెలిపే అధికారం లేదా?’ అని ప్రశ్నించారు. జగన్ కోసం ఎన్నిసార్లయినా అరెస్టవుతామని రంగారెడ్డి జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్ స్పష్టం చేశారు. పోలీసు హెచ్చరికలపై మండిపడ్డారు. ‘ఇదెక్కడి నిర్బంధం? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా? జగన్‌కు మద్దతు తెలపడమే నేరమా?’ అని రంగారెడ్డి జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేత సురేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఖాకీలు ఆయన్ను పెడరెక్కలు విరిచి పోలీసులు జీపులోకి నెట్టేశారు. శాంతియుతంగా ఉన్న తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని మైనారిటీ నేత అర్షద్ ప్రశ్నించారు. పోలీసులు మాత్రం ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా, కనీసం అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కూడా ఇవ్వకుండా వ్యాన్లలోకి ఎక్కించారు.
నీరసించిన జగన్
జగన్ ఆరోగ్య పరిస్థితి మాములుగానే ఉందని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. బుధవారం అందిన వైద్య నివేదికలను బట్టి ఆయన రక్తపోటు, చక్కెర స్థాయి నిలకడగా ఉన్నాయని వెల్లడించారు. అయితే కొన్ని రక్త పరీక్షల వివరాలు అందాల్సి ఉందని, పూర్తి సమాచారం ఇవ్వడం ఆ తర్వాతే సాధ్యమని వివరించారు. రోజు మాదిరిగానే ఉదయం జగన్ దినపత్రికలు చదివారు. కొంత నీరసంగా ఉండటం వల్ల గతంలో మాదిరి ఎక్కువగా మాట్లాడలేదని తెలిసింది. మధ్యాహ్నం బ్యారక్‌కు వెళ్లిన అధికారులతోనూ ఆయన ముక్తసరిగానే మాట్లాడినట్టు తెలిసింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో షుగర్ లెవల్స్ తగ్గాయని, జగన్ ముఖంలో నీరసం ఛాయలు కన్పించాయని జైలు వర్గాల ద్వారా తెలిసింది.
అభిమానంపై ‘అధికార’ జులుం
Published Thu, Aug 29 2013 2:17 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement