నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి | Y S Jaganmohan Reddy back to Chanchalguda jail from NIMS | Sakshi
Sakshi News home page

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి

Published Thu, Sep 5 2013 2:00 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి - Sakshi

నిమ్స్ నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి 9:15 గంటలకు నిమ్స్‌నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని భావించిన నిమ్స్ వైద్య బృందం బుధవారం మధ్యాహ్నం చంచల్‌గూడ జైలు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగస్ట్ 25న చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేపట్టిన జగన్ ఆరోగ్యం క్షీణించడంతో అదే నెల 29న అర్ధరాత్రి జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
 
జగన్ ఆరోగ్యం క్షీణించడం, ఉస్మానియా ఆస్పత్రిలో వసతుల లేమి, భద్రతా కారణాల దృష్ట్యా ఆగస్ట్ 30న నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆయన అక్కడ ఆగస్ట్ 31వ తేదీ మధ్యాహ్నం వరకూ దీక్ష కొనసాగించారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో, నిమ్స్ వైద్యులు జైలు అధికారుల అనుమతితో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి దీక్ష భగ్నం చేశారు. అప్పట్నుంచీ ఆయన నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. బుధవారం నాటికి జగన్ పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి చేయచ్చునని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చంచల్‌గూడ జైలు అధికారుల తెలియజేయడంతోపాటు డిశ్చార్జి సమ్మరీ (వైద్య నివేదిక)ని కూడా ఇచ్చారు. దీంతో ఆయనను బుధవారం రాత్రి భారీ భద్రత మధ్య బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా నిమ్స్‌కు చేరుకున్నారు. 
 
 నాలుగు వారాలపాటు పోషకాహారం ఇవ్వాలి: నిమ్స్ వైద్య బృందం
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడు రోజులు నిరాహార దీక్ష చేసిన కారణంగా పూర్తిగా బలహీనంగా మారారని జైలు అధికారులకు ఇచ్చిన వైద్య నివేదికలో నిమ్స్ వైద్య బృందం పేర్కొంది. ఆయన పూర్వపుస్థాయికి వచ్చేందుకు నాలుగు వారాలపాటు పోషక విలువలతో కూడిన ఇంటి భోజనం ఇవ్వడం మంచిదని సూచించారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఇవ్వాల్సిన డైట్ చార్ట్ (ఆహార పదార్థాల పట్టిక)ను జైలు అధికారులకు అందజేశారు. ప్రస్తుతం జగన్ శరీరంలో కెటబాలిజం (నిరాహార దీక్షలు లేదా వేరే ఏదైనా కారణాల వల్ల శరీరంలో ప్రతికూల మార్పులు కలగడం) జరిగిందని, అది అనబాలిజం (ప్రతికూల మార్పులకు లోనైన శరీరం తిరిగి యథాస్థితికి రావడం)లోకి రావాలని, దీనికోసం బలమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షలు అన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఇంకా కొద్దిగా నీరసంగా ఉన్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డికి రెండు వారాల తర్వాత తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని డిశ్చార్జి సమ్మరీలో పేర్కొన్నారు. జగన్ సతీమణి వైఎస్ భారతి బుధవారం కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయన వద్దనే ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement