జగన్ నీరసించారు, బరువు తగ్గారు: వైద్యుల వెల్లడి
రాష్ట్ర విభజనపై నిరంకుశంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి చంచల్ గూడ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల వివరాలను బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్లో అధికారులు వెల్లడించారు.
బుధవారం సాయంత్ర వైఎస్ జగన్ కు ఆరు రకాలు వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వైఎస్ జగన్ నీరసించినట్టు, బరువు తగ్గినట్లు తెలిపారు. ఆయనకు బీపీ, షుగర్ సాధారణ స్థాయిలో ఉన్నాయన్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, నాలుగు రోజులు పూర్తవుతున్నా జగన్ మాత్రం కూర్చునే తన దీక్ష కొనసాగిస్తున్నారని వివరించారు. వైద్యులు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాత్రిపూట కూడా ఈ పర్యవేక్షణ కొనసాగించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు.
ఇక గురువారంతో దీక్ష ఐదోరోజుకు చేరుకుంటున్నందున జైలు అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైతే బయటి నుంచి కూడా వైద్యులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే, జైలు ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలు కాక, అదనపు సదుపాయాలు ఏమైనా అవసరం అవుతాయా అని సూపరింటెండెంట్ సమీక్షించారు. బయటి ప్రభుత్వాస్పత్రి నుంచి అవసరమైతే మరికొన్ని పరికరాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోని వైఎస్ జగన్కు ఐదోరోజు ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో తెలుసుకోడానికి మరికొన్ని రకాల పరీక్షలను సైతం వైద్యులు చేయించారు. ఇందుకోసం వారు ఆయన నుంచి రక్త, మూత్ర శాంపిళ్లు తీసుకున్నారు. అయితే, వాటి పరీక్షల నివేదికలు మాత్రం గురువారానికే అందుతాయని, వాటిని బట్టి మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత మరింత సమాచారం అందిస్తామని జైలు అధికారులు తెలిపారు. సాధారణంగా ఐదు రోజులుగా దీక్షలో ఉన్నవారికి కామెర్లు లేదా ఇతర సమస్యలు వస్తాయేమోనని వైద్యులు పరీక్షిస్తారు. అలాంటి లక్షణాలు కనపడితే తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఇందుకోసమే వైద్యులు రక్త, మూత్ర నమూనాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.