=క్రికెట్ మ్యాచ్‌ను అడ్డుకుంటామన్న గంటా
=జరిపి తీరుతామన్న బాలరాజు
=వన్డే క్రికెట్‌పై నీలినీడలు
=రచ్చబండ కూ మంత్రుల రచ్చ
=పది నిమిషాల వ్యవధిలోనే రెండు సమీక్షలు
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యుల ఆధిపత్య పోరు చివరకు క్రికెట్ మ్యాచ్‌నూ తాకింది. మ్యాచ్ జరపొద్దంటూ బీసీసీఐ (భార త క్రికెట్ నియంత్రణ మండలి)కి లేఖ రాయాలని మంత్రి గంటా కలెక్టరుపై ఒత్తిడి తెస్తున్నారు. సమైక్యవాదులంతా మ్యాచ్‌ను అడ్డుకుంటారంటూ సాక్ష్యాత్తూ మంత్రివర్యులే బీసీసీఐ ప్రతినిధులకు హెచ్చరికలు పంపడంతో పాటు బహిరంగంగానూ వెల్లడించారు.
తన రాజకీయ ప్రత్యర్థి మ్యాచ్ జరగదని చెబితే తాను మౌనంగా ఉంటే ఎలా అనే రీతిలో మం త్రి బాలరాజు ఆరు నూరైనా మ్యాచ్ జరిగి తీరుతుందని ప్రకటించారు. మ్యాచ్ రద్దు చే యాలని బీసీసీఐకి లేఖ రాయాల్సిన అవసరం లేదని ఆయన కలెక్టరు మీద ఒత్తిడి తెచ్చారు. మ్యాచ్‌ను అడ్డుకుంటే విశాఖ ఖ్యాతిని దిగజార్చిన వారవుతారని పరోక్షంగా గంటాపై మీద విమర్శల బాణాలు సంధించారు.
ఒకరు అవునంటే మరొకరు కాదని పట్టుబడుతుండంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రపంచం మొత్తం చూసే క్రికెట్ మ్యాచ్‌ను కూడా ఇద్దరు మంత్రులు ఓట్ల ప్రాతి పదిక యుద్ధంలా తయారు చేయడం పట్ల క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. మ్యా చ్ నిర్వహణపై అడుగు ముందుకేయాలా? వెనక్కు వేయాలా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం తేల్చుకోలేక సతమతమవుతోంది.
‘రచ్చ’బండ : రాష్ట్ర విభజన సెగ నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 26 వరకు రచ్చబండ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని ఎత్తుగడ వేసింది. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇతర దరఖాస్తుల బూజు దులపాలని, కొత్త దరఖాస్తులను కూడా జోడించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. రచ్చ బండను రచ్చ లేకుండా ఎలా నిర్వహించాలంటూ కలెక్టరు సాల్మన్ ఆరోఖ్యరాజ్ వారం రోజులుగా కుస్తీ పడుతున్నారు.
అధికారుల బాధలు అధికారులు పడుతుంటే మంత్రులిద్దరూ ఇక్కడ కూడా మేమున్నామంటూ ముందుకొచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి గంటా తన మద్దతు ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, యు.వి.రమణమూర్తిరాజుతో కలసి సర్క్యూట్ హౌస్‌లో కలెక్టరు ఆరోఖ్యరాజ్, జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, ఎస్‌పీ విక్రం జిత్ దుగ్గల్, ఇతర అధికారులతో రచ్చబండ నిర్వహణపై సమీక్ష జరిపారు.
భీమిలిలో 11న రచ్చబండ-3 ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తన వర్గ ఎమ్మెల్యేలు సూచించిన పనులన్నీ రచ్చబండలో పూర్తి చేసేలా సూచనలు ఇచ్చారు. ఇదే సమయంలో సర్క్యూట్‌హౌస్‌కు చేరుకున్న మంత్రి బాలరాజు మరో గదిలో వేచి ఉండి గంటా, ఆయన వర్గ ఎమ్మెల్యేలు వెళ్లిన పది నిముషాలకు అధికారులతో అక్కడే మరో సమీక్ష జరిపారు. రచ్చబండ నిర్వహణపై ఆయన కూడా కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తొలి సమీక్షలో చెప్పిన ఏర్పాట్ల వివరాలనే అధికారులు మంత్రి బాలరాజుకు మరోసారి వివరించారు.