
రాజధాని మనహక్కు..
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కర్నూలును రాజధాని చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలులో మహాసభ నిర్వహించారు. ఈ సభకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య తదితరులు హాజరయ్యారు.
రాజధాని మనహక్కు.. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలునే రాష్ట్ర రాజధాని చేయాలని హైకోర్టు న్యాయమూర్తి కె. లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సి.క్యాంపులోని లలిత కళా సమితిలో రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె. లక్ష్మణరెడ్డి హాజరై మాట్లాడారు. రాజధాని సాధన కోసం ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. అనంతరం పలువురు మేధావులు మాట్లాడుతూ ‘మన రాజధాని మన హక్కు’ అనే నినాదంతో ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
- కర్నూలు(విద్య)
రాజధానిని చేయాలని సోనియా భావించారు
రాష్ట్ర విభజన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ఒకప్పటి రాజధానిగా ఉన్న కర్నూలులోనే తిరిగి రాజధాని ఏర్పాటు చేయాలని తలంచారు. కానీ కోస్తాలోని నాయకులు సోనియాను తికమక పెట్టి రాజధానిని మనకు రానీయకుండా చేశారు.
-విజయ్‌కుమార్‌రెడ్డి, చాంబర్ కామర్స్ జిల్లా అధ్యక్షులు
పోలవరంలాంటి ప్రాజెక్టు సాధించాలి
రాజధాని కోసం ప్రత్యేకంగా పోరాటం చేయాలి. పోలవరం లాంటి ప్రాజెక్టును సాధించుకోవాలి. మనకు అపారమైన నీటివనరులు ఉన్నాయి. కానీ వాటిపై హక్కులేకుండా పోయింది. ఈ మేరకు జులై 2న నంద్యాలలో మేధావులతో సమావేశం ఏర్పాటు చే సి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాము.
-బొజ్జా దశరథరామిరెడ్డి, నంద్యాల
రాజధానికి కర్నూలే అనుకూలం
కర్నూలు రాజధాని ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం. శ్రీబాగ్ ఒప్పందంలో కూడా కర్నూలును రాజధానిగా చేయాలని సూచించారు. జిల్లాలో భూమి, నీరు సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించవు. అందువల్ల కర్నూలును రాజధానిగా చేయాలి.
-ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే
అభివృద్ధి చెందిన కోస్తాలో రాజధాని ఎందుకు
కోస్తావారు సీమ కంటే బాగా అభివృద్ధి చెంది ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చూడటం భావ్యం కాదు. క ర్నూలులోనే రాజధానిని ఏర్పాటు చేయాలి. సీఎం చంద్రబాబునాయుడు ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపాలి.
-బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డోన్ ఎమ్మెల్యే