దగ్గర పడుతున్న పోలింగ్ తేదీ
రాజకీయ ఎత్తుగడలు, తెర వెనుక
ఒప్పందాలు ముమ్మరం
విజయవాడలో యూటీఎఫ్, ఎస్టీయూ మమేకం
మచిలీపట్నం : పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో గుంటూరు, కృష్ణాజిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ఎత్తుగడలు, తెరవెనుక ఒప్పందాలు జరుగుతున్నాయి. తోడల్లుళ్లయిన కేఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. యూటీఎఫ్ తరఫున కేఎస్ లక్ష్మణరావు, టీడీపీ తరఫున ఏఎస్ రామకృష్ణ పోటీలో ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. 17 సంవత్సరాల పాటు విజయవాడలో టీచరుగా, అనంతరం విజయవాడ నగర మేయర్‌గా పనిచేసిన తాడి శకుంతల పోటీలో ఉండటంతో ఆమె సాధించే ఓట్లు మిగతా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినబడుతోంది. ఇప్పటివరకు జిల్లా నుంచి మహిళలు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవటం, గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేసిన తాడి శకుంతల అభ్యర్థిత్వంపై మొగ్గుచూపటం తెరపైకి రావటంతో ఎన్నికలు వేడెక్కుతున్నాయి. విజయవాడలో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించడానికి శకుంతల చేసిన కృషి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చూపిన చొరవ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి.
మహిళా టీచర్లు, అధ్యాపకుల్లో కొంత మార్పు వచ్చిందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి, రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో యూటీఎఫ్ నాయకులు పునరాలోచనలో పడినట్లు సమాచారం. యూటీఎఫ్ వారంతా కేఎస్ లక్ష్మణరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని, రెండో ప్రాధాన్యత ఓటును శకుంతలకు వేయాలని, శకుంతల వర్గానికి చెందిన ఉపాధ్యాయులు ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి, రెండో ప్రాధాన్యత ఓటును లక్ష్మణరావుకు వేయాలని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ద్వారా ప్రతిపాదన చేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరితే ఈ ప్రభావం ఏఎస్ రామకృష్ణపై పడుతుందనే వాదన వినిపిస్తోంది.
తెరపైకి సామాజిక సమీకరణలు...
కేఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ తోడల్లుళ్లు కావడంతో పాటు ఒకే సామాజికవర్గానికి చెందినవారని, తాడి శకుంతల మరో సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో కొత్త సమీకరణలు తెరపైకి వచ్చినట్లు సమాచారం. తాడి శకుంతల అధికంగా ఓట్లు రాబట్టుకుంటే ఎవరిని ఈ అంశం విజయాల వైపు తీసుకువెళుతుంది.. ఎవరిని ఓటమిపాలు చేస్తుందనే అంశంపై మిగిలిన ఇద్దరు అభ్యర్థులు, వారి అనుచరులు తర్జనభర్జన పడుతున్నారు.
రాజుకుంటున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
Published Fri, Mar 13 2015 1:07 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement