నలుగురు కావలెను!
ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. వేంనరేందర్ రెడ్డిని పోటీలో నిలిపినా గెలిపించుకోవడం ఎలా అనే దానిపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికారికంగానే ఓ ఎమ్మెల్సీ గెలవాలంటే 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన నలుగురిని మినహాయిస్తే ఆపార్టీకి 11 మంది మాత్రమే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఐదుగురి మద్ధతు ఉండడంతో సంఖ్య 16కు చేరింది. సాధారణంగా గెలిచేందుకు ఇద్దరైతే సరిపోతుంది. కానీ నలుగురు ఎమ్మెల్యేల మద్ధతు కోసం ఆపార్టీ యువనేత ఒకరు తీవ్రంగా కష్టపడుతున్నారు. నలుగురెందుకు అనుకుంటున్నారా..? టీడీపీకి ఇప్పుడున్న 11 మందిలో ఇద్దరు కారెక్కెందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.
అందుకే ముందు జాగ్రత్త అన్న మాట. కావలసిన నలుగురు ఎమ్మెల్యేలను వెతికే పనిని చంద్రబాబు యువ నాయకుడికి అప్పగించినట్లు సమాచారం. శనివారం చంద్రబాబు నివాసంలో సమావేశమైన టీడీపీ నేతలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేల లిస్టును బాబుకు అందజేసినట్లు తెలిసింది. ఏదో ‘రకంగా’ ఆ నలుగురిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డికి ఓటేసేలా ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు.