డిష్యూం.. డిష్యూం
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ, అధికారులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీనివాస్‌కు, జైలర్ గుణశేఖర్, డిప్యూటీ జైలర్ శ్రీనివాసులు మధ్యఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల కిందట కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదీ శ్రీనివాస్ వంట చేస్తుండగా కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నావని జైలర్ గుణశేఖర్ గదమాయించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ గుణశేఖర్‌పై తిరగబడ్డాడు. అంతలోపు అక్కడికి వచ్చిన డిప్యూటీ జైలర్ శ్రీనివాసులు గుణశేఖర్‌కు వత్తాసు పలుకుతూ ఇద్దరూ కలిసి జీవితఖైదీ శ్రీనివాస్‌పై దాడి చేశారు. తనపై అధికారులు దాడి చేయడంతో వారిపై శ్రీనివాస్‌కూడా ప్రతి దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న సహచర ఖైదీలు, అధికారులు వీరిని అదుపు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. ఇదిలాఉండగా గతంలో నందికొట్కూరు జైలులో జీవిత ఖైదీ శ్రీనివాస్ ఉండేవాడు.
అక్కడే డిప్యూటీ జైలర్ శ్రీనివాసులు పనిచేసేవాడు. జీవితఖైదీ, డిప్యూటీ జైలర్ 15 రోజుల తేడాతో కడప కేంద్ర కారాగారానికి వచ్చారు.నందికొట్కూరులో కూడా వీరి మధ్య విబేధాలు ఉండేవని సమాచారం. ఇది మనసులో పెట్టుకుని పరస్పరం దాడులకు పాల్పడినట్లు తెలిసింది. వారం రోజుల కిందట కేంద్ర కారాగారం నుంచి వరంగల్ సెంట్రల్‌జైలుకు ఐఎస్‌ఐ తీవ్రవాదులను తరలించారు. వరంగల్ సెంట్రల్ జైలు వద్ద వీరిని తనిఖీ చేయగా సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. ఇలా కేంద్ర కారాగారం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.