గురువుల బరిలో త్రిముఖ పోరు | Fighting in the ring masters triangular | Sakshi
Sakshi News home page

గురువుల బరిలో త్రిముఖ పోరు

Published Sat, Mar 14 2015 2:50 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

Fighting in the ring masters triangular

మునిగేదెవరు.. గెలిచేదెవరు !
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. మరో ఆరు రోజుల్లో ప్రచార గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యత్వానికి పోటీ పడుతున్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

బరిలో 15 మంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార పార్టీ మద్దతుదారు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు, సామాజికవేత్త రాము సూర్యారావు మధ్యే నెలకొంది. మరో అభ్యర్థి పిల్లి డేవిడ్‌కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ పోటీ మాత్రం చైతన్యరాజు, కృష్ణారావు, సూర్యారావు మధ్యనే ఉందన్నది నిర్వివాదాంశం.
 
దూకుడు గట్టెక్కిస్తుందా..
తెలుగుదేశం పార్టీ మద్దతుతో సిట్టింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజు ప్రచార పర్వంలో దూసుకువెళ్తున్నా.. విపరీతమైన ప్రచారమే ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల మాదిరి రోడ్లపై టెంట్లు వేయడం, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులతో సభలు, సమావేశాలు నిర్వహించడం, ఆర్భాటపు ప్రచారాలు, గెలుపుపై అతి విశ్వాసం వెరసి ఒకింత ఆయనకు ప్రతికూల అంశాలుగా పరిణమించనున్నాయని అంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీగా చైతన్యరాజుపై ఉపాధ్యాయుల్లో కొంత అసంతృప్తి ఉం దనే మాట వాస్తవమే అయినప్పటికీ టీడీపీ మద్దతుదారుగా బరిలో ఉం డటం కలసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవలే వెలువడిన పీఆర్‌సీ ప్రకటన, పాఠశాల వేళల్లో మార్పు లు చేయటం చైతన్యరాజుకు ప్లస్ పాయింట్లుగా మారతాయనే అభిప్రాయంతో ఆయన మద్దతుదారులు ఉన్నారు.

ఇక డబ్బు విపరీతంగా వెదజల్లుతారన్న ప్రచారమూ ఆయనకు ఒకింత మైనస్‌గా మారింది. గెలిస్తే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతుండటంతో ఆశావహులు ఈయన నుంచి ఎక్కువ ఆశిస్తున్నారని అంటున్నారు. ఎక్కువ ఆశలు పెట్టుకోవడంతో ఎంతిచ్చినా ఇంతేనా అనే పరిస్థితి చైతన్యరాజుకు ఎదురు కానుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
 
సానుభూతి పనిచేస్తుందా! ఇక పోటీలో ప్రధాన అభ్యర్థిగా ఉన్న ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు విజయం తనదే అన్న ధీమాతో ప్రచారంలో ముందుకువెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకే చెందిన ఈయన గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే సీటీ ఆశించారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. పార్టీ నాయకత్వం ఈసారి కూడా చైతన్యరాజుకే అవకాశం ఇవ్వడంతో కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన దరిమిలా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాలన్న ప్రచారాన్ని ఈయన బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అప్పట్లో ఎమ్మెల్యే టికెట్.. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఈయనపై ఒకింత సానుభూతి ఉందని అంటున్నారు.

టీడీపీలోని ఓ బలమైన సామాజిక వర్గం కూడా ఈయనకే మద్దతిస్తుందన్న వాదనలు  వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే హంగు, ఆర్భాటాలకు అతీతంగా చాపకింద నీరులా ప్రచారం సాగిస్తున్న కృష్ణారావు పరిస్థితి బలంగానే ఉందని, అయితే నోట్ల కట్టలను నమ్ముకుంటే మాత్రం పరిస్థితి తారుమారు కానుందని అంటున్నారు.
 
వామపక్ష భావజాలం గెలిపిస్తుందా
ఇక పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్న పీడీఎఫ్, యూటీఎఫ్ మద్దతుదారు రాము సూర్యారావు వామపక్ష భావ జావజాలం కలిగిన మాస్టార్లనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో ప్రిన్సిపాల్‌గా సుదీర్ఘకాలం చేసిన అనుభవానికి తోడు, అప్పట్లో ఇంట్లోనే వందలాది మంది పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పిన మంచితనం, ఎంతో మందికి ఫీజులు కట్టి చదివించిన దాతృత్వం, సామాజిక వేత్తగా ఉన్న పేరు సూర్యారావును గెలిపిస్తాయని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

ఇటీవల రెవెన్యూ సర్వీసెస్ అసోసిసేషన్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సూర్యారావు గెలుపునకు అవకాశాలు మెరుగయ్యాయని చెబుతున్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నంత అనుకూలత తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు సూర్యారావుకు రాలేదని, అక్కడ కూడా పరిస్థితిలో మార్పు వస్తేనే సూర్యారావు ఒడ్డున పడే అవకాశముందని అంచనా.

మొత్తంగా చూస్తే చైతన్యరాజు, కృష్ణారావు, సూర్యారావు మధ్యే ప్రధాన పోటీ ఉందని, తొలి, మలి ప్రాధాన్య ఓట్ల వ్యవహారం కూడా ఈ ముగ్గురి మధ్యనే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆరు రోజుల్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కట్టనున్నారో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement