సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర కోసం రెండున్నర నెలల పాటు చేసిన పోరాటం ఎటువంటి ఫలితం లేకుండా ముగిసింది. మొన్న ఆర్టీసీ, ఉపాధ్యాయులు, నేడు ఏపీఎన్‌జీఓలు నిరధిక సమ్మెను విరమించారు. అయితే సమ్మె విరమణపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎటువంటి హామీ లేకుండా సమ్మె ఎలా విరమిస్తారు’ అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన ప్రకటనపై జనం భగ్గుమన్నారు. వారితోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఉద్యమబాట పట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జూలై 31 నుంచి చిన్నా.. పెద్దా తేడా లేకుండా జనమంతా రోడ్డెక్కారు. 80 రోజుల పాటు ఎండ.. వానను లెక్కచేయకుండా.. నిద్రాహారాలు మాని ఆందోళనలు జరిపారు.
చిన్నారులు సైతం ‘జై సమైక్యాంధ్ర’ అంటూ జెండా పట్టుకుని నినదించారు. ఎర్రని ఎండల్లో రోడ్లపై బైఠాయించి గంటల తరబడి ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేశారు. వినూత్న తరహాలో నిర సనలు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ దేవుళ్లను ప్రార్థించారు. కొందరు ఉద్యోగులు జీతాలు సైతం వదులుకున్నారు. కార్మికులైతే పస్తులుండి ఉద్యమం చేశారు.
వీరి త్యాగాలకు ఫలితమేదీ..: విభజన వార్త తట్టుకోలేక కొందరు గుండె ఆగి మరణిస్తే.. మరి కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదోని పరిధిలో గ్రామసేవకుడు త్యాగరాజు, నారాయణపురానికి చెందిన రైతు జగన్నాథరెడ్డి, ఆళ్లగడ్డ మండలంలో చింతకుంట గ్రామంలో నాగశేషుడు, గూబగుండం గ్రామంలో నాగరాజు అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు.
అదే విధంగా రుద్రవరానికి చెందిన ఆశీర్వాదమ్మ, చాగలమర్రికి చెందిన టైలర్ మహబూబ్‌బాషాల గుండె ఆగింది. ఆత్మకూరు పరిధిలో నలుగురు, ఇలా జిల్లా వ్యాప్తంగా 36 మందికిపైగా మరణించారు. అదే విధంగా సుమారు 225 మందిపైన కేసులు నమోదైనట్లు సమాచారం. కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ, డోన్ పరిధిలో బ్యాంక్, హోటల్, రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాల ధ్వంసం వంటి ఘటనల్లో బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేయటంతోపాటు కొందరిని అరెస్టు చేశారు. అయితే వారు బైల్‌పై విడుదలయ్యారు. కేసులు మాత్రం మాఫీ కాలేదు.
పాడైన చదువులు... నష్టపోయిన వ్యాపారులు: సమైక్యాంధ్ర కోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు బంద్ పాటించాయి.
ఉపాధ్యాయులు, విద్యార్థులు చదువులు పక్కనపెట్టి, పరీక్షలను వాయిదా వేసుకుని రోడ్డుపైకొచ్చి ఆందోళనలు చేశారు. చిన్నపిల్లలైతే కొందరు ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించి ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు వేలాది రూపాయలు అప్పులు చేసి ఫీజులు చెల్లించిన విద్యాలయాలు మూత పడటంతో చదువులు అటకెక్కాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సమ్మె కారణంగా జిల్లాలో పలుమార్లు బంద్‌కు పిలుపునిచ్చారు. వివిధ వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. దీంతో కోట్లాది రూపాయలు వ్యాపారులు నష్టపోయారు. అదే విధంగా కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వివిధ ప్రజా సంఘాలు దీక్షల కోసం ఏర్పాటు చేసిన టెంట్లకు అద్దెలు చెల్లించారు. ఆ టెంట్లకు రోజుకు రూ.1000 నుంచి రూ.9వేల వరకు చెల్లించిన సంఘాలు ఉన్నాయి. అదే విధంగా స్టేజ్‌లు ఏర్పాటు, వచ్చిన వారికి నీళ్లప్యాకెట్లు, బాటిళ్లు, భోజనాల కోసం వేలాది రూపాయలు వెచ్చించినట్లు ఓ ప్రజా సంఘం నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఎంతోమంది తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడకేసిన పాలన..: జిల్లా వ్యాప్తంగా మున్సిపల్, వివిధ శాఖల ఉద్యోగులు సమ్మె బాట పట్టటంతో అనేక ప్రజాసేవలన్నీ నిలిచిపోయాయి. ఒక్క మీసేవ, మున్సిపల్, పంచాయతీ సేవలన్నీ నిలిచిపోయాయి. దీంతో జనన మరణ, కుల, ఆదాయ వంటి ధృవీకరణ పత్రాలు మొత్తం రెండు లక్షలకుపైగా పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా పల్లెల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు లేవు. ఇదిలా ఉంటే స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య, రవాణా, మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించే సుమారు రూ.300 కోట్లు నిలిచిపోవటంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు అంచనా. అదే విధంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవటంతో జిల్లాలోని 11 డిపోలకు సంబంధించి మొత్తం రూ.70 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొత్తంగా 80 రోజులపాటు చేసిన పోరాటం ఎటువంటి ఫలితమివ్వకపోవటంతో సామాన్య జనం మండిపడుతున్నారు.
పోరు ఇదేమి తీరు
Published Fri, Oct 18 2013 12:50 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement