కడప అగ్రికల్చర్ : కష్టకాలంలో ఉన్న రైతుల్ని ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం పలాయన మంత్రం పఠిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా వర్షాభావం, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికందక రైతులు అల్లాడుతున్నారు. ఈ తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసేందుకు సిద్ధమైంది. శనివారం అసెంబ్లీలో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పిన సమాధానం చూస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోలేదని స్పష్టమైంది. గత సంవత్సరాలకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేమంటూ మంత్రి తెగేసి చెప్పడంతో రైతాంగం కన్నీటి పర్యంతమైంది. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో వ్యవసాయం జూదంలా మారింది.
ఇందులో రైతులు గెలుస్తారో... ఓడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక ఏడాది అనావృష్టి, మరో ఏడాది అతివృష్టి.. ఇలా వరుస కడుతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు జిల్లాకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా కింద రూ.93.90 కోట్లు రావాల్సి ఉంది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఏటా పంటల పరిస్థితులు ఏలా ఉంటాయో తెలియని రైతన్న బీమా కంపెనీ కలిపించిన వెసులుబాటును ఉపయోగించుకుంటూ సాగు చేసిన పంటలకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. కానీ ఏ సంవత్సరం కూడా రైతుకు సక్రమంగా బీమా వచ్చి చచ్చిన దాఖలాలు లేవని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రైతు సంక్షేమం గాలికి..
బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువు తక్కువగా ఇచ్చినప్పటికీ రైతులు అష్టకష్టాలు పడి వివిధ బ్యాంకులు, మీ-సేవ, ఈ- సేవ కేంద్రాలకు వెళ్లి తగిన మొత్తం చెల్లించారు. అయితే నష్టపోయిన పంటకు సకాలంలో బీమా అందక ఇక్కట్లు పడుతున్నారు. నష్టపోయిన పంటల స్థానంలో మళ్లీ పంటల సాగు చేసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. 2011 నుంచి ఇప్పటి వరకు అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు, ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్నాయి.
అప్పటి నుంచి జిల్లాకు రూ. 93.90 కోట్ల బీమా రావాల్సి ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టిచుకోలేదు. జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన శాసనమండలి వైస్ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డిగానీ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డిగానీ పట్టించుకున్న దాఖలాలు లేవని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాసనసభలో విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలుసార్లు ప్రశ్నించినా ముఖ్యమంత్రి గానీ, సంబంధిత మంత్రిగానీ నోరు మెదపలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ఉద్యమాలు చేపడతామని సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
బీమా మంజూరులోనూ అన్యాయం
ఖరీఫ్ 2012లో బీమా రూ.52 కోట్లకు గాను రూ. 24 కోట్లు మాత్రమే మంజూరైంది. అది కూడా రైతుల ఖాతాలకు చేరలేదు. 2012-13 రబీకి గాను రూ. 8.72 కోట్లు బీమా సొమ్ము రైతులకు చేరాల్సి ఉంది. 2013 ఖరీఫ్‌కు రూ. 52.33 కోట్లు మంజూరైంది. ఇప్పటి వరకు ఒక్క దమ్మిడి కూడా రైతులకు అందించిన పాపాన పోలేదు. ఉద్యాన పంటలకు సంబంధించి 2011 నుంచి ఇప్పటి వరకు రూ.3.22 కోట్లు పంట నష్టం సంభవించింది. దానికి సంబంధించి ఉద్యాన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నష్ట నివేదిక పంపినా సొమ్ములు వచ్చిన దాఖలాలు లేవు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉండి కూడా జిల్లాకు ఒరిగింది ఏమిలేదని రైతు సంఘాల నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
బాధాకరం..
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పోయాయి. అందులో మా తప్పిదం ఉంటే ప్రభుత్వానికి మొర పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వర్షాభావంతో తోటలు దెబ్బ తింటున్నప్పుడే పరిహారం కోరతాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే కదా.. ఆదుకోవాలని కోరుతున్నాం. ఇన్‌పుట్ ఇవ్వలేమని చెప్పడం చాలా బాధగా ఉంది.
- బాలరాజు, టి వెలంవారిపల్లె, వేంపల్లె మండలం
బాధ్యతారాహిత్యం
ప్రజా పరిపాలన చేయాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ఏవో మాటలు చెప్పి స్వలాభం చూసుకోడానికి అధికారంలోకి వచ్చారు. రైతులు కరువు పరిస్థితులు నెలకొని ఒక పక్క అల్లాడుతుంటే వ్యవసాయ శాఖా మంత్రి పుల్లారావు పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేమని చెప్పడం దారుణం. ఇలా ఏ ప్రభుత్వంలో కూడా మంత్రులు ప్రకటనలు చేసిన సందర్భాలు లేవు.
- లింగమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం(సీపీఎం)
రైతులంటే ప్రభుత్వానికి లెక్కలేదు
మాది రైతు ప్రభుత్వం.. రైతులకు మేము చేసినట్లుగా ఎవరు చేయలేరు.. అని చెబుతూ రైతుల నడ్డి విరిచే చర్యలకు పూనుకుంటున్నారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వమని తెగేసి చెప్పారు. ఇదెక్కడి నాయ్యం? ఇదేమి తీరు. రైతులు బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోలేనప్పుడు మరెప్పుడు ఆదుకుంటారు?
-నాగసుబ్బయ్య యువరైతు, కత్తులూరు, వేంపల్లె మండలం
కాలం గడిపే ప్రభుత్వమిది
రైతులు ఈ ప్రభుత్వానికి అక్కరలేనట్టుంది. రైతుంటే ముఖ్యమంత్రికి, వ్యవసాయ శాఖా మంత్రికి లెక్కలేని తనం అయిపోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదని చెప్పడం ఎంత వరకు సమంజసం.. అయ్యా పంటలు పోయాయి.. నష్టపరిహారం ఇచ్చి ఆదుకోండని అడుగుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదా?
-సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా కన్వీనరు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం
ప్రభుత్వం ఉండి ఏం లాభం?
ఒక పక్క కరువు పరిస్థితులు ఉండాయి. మరో పక్క గత ఏడాది మే నెలలో ఈదురు గాలులతోను, అధిక వర్షాలతోను అరటి, మామిడి. బొప్పాయి, కూరగాయలు, పూల తోటలకు నష్టం సంభవించింది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే ఎలా గట్టెక్కాలి?
- బాలిరెడ్డి, గోర్లపల్లె, చింతకొమ్మదిన్నె మండలం
ఆందోళనలు చేపడతాం
రైతులు పంటలు కోల్పోయి అల్లాడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేదిలేదని తెగేసి నిస్సిగ్గుగా ఎలా చెబుతోంది? పంటలు పోతే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడం దుర్మార్గం. ఇంత అధ్వాన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. రైతులను అన్ని విధాల ఆదుకుంటాం.. ఏ కష్టం రానివ్వమని అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరించే మాటలు మాట్లాడతారా? దీనిపై రైతులను కలుపుకుని ఆందోళనలు, ధర్నాలు చేపడతాం.
- రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం(సీపీఐ)