ఫైలు గల్లంతు
Published Sun, Mar 2 2014 1:41 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేశారు. తీరా నష్టపోయిన అభ్యర్థులు కోర్టు కెళ్లటంతో ఉద్యోగాలు ఇచ్చిన ఫైల్ కనిపించటం లేదంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయానికి హాజరుకాకుండా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇంత ఘనకార్యానికి పాల్పడింది ఎవరో కాదు..సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వారే. కళ్ల ఎదుటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నా ఎలాంటి భయం లేకుండా ఇష్టానుసారం గా నియామకాలు చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు.
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఖాళీగా ఉన్న 25 ల్యాబ్ టెక్నీషియన్ల (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి1998 అక్టోబరు 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(డీఎంఎల్‌టీ)కోర్సు పూర్తిచేసిన 14 మందికి ఈ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇంటర్ ఒకేషనల్ డీఎంఎల్‌టీ కోర్సు పూర్తిచేసి దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగాలు రాని అభ్యర్థులు.. 1995లో ఒకేషనల్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి నేడు తిరస్కరించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటీరియమ్ రిలీఫ్ ఆర్డర్‌తో కొందరు అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. టెక్నీషియన్ పోస్టును ల్యాబ్ అటెండెంట్‌గా కింది స్థాయి పోస్టుకు కుదించి ఉద్యోగాలు ఇవ్వమని కోర్టు ఆదేశించటంతో కె.రామకృష్ణ, ఎన్.వెంకటరావు, జి.నాగేశ్వరరెడ్డి అనే ముగ్గురు అభ్యర్థులకు 2007 జూలై 25న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. కేవలం ముగ్గురికి మాత్రమే ఇవ్వడంతో మిగిలిన అభ్యర్థులు తిరిగి తమకు అన్యాయం జరిగిందని కోర్టును అశ్రయించారు. మెరిట్ ఉన్నవారికి ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు.
బీసీ-డి అభ్యర్థులకు పోస్టులు లేకపోయినా ఇరువురికి, ఓసీ కేటగిరిలో మరొకరికి పోస్టు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మిగిలిన అభ్యర్థుల అర్హతలు పరిశీలించి పోస్టులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మాత్రం అభ్యర్థులు తాము తయారు చేసిన మెరిట్ జాబితాలో లేరని, ఉద్యోగ నోటిఫికేషన్ కాలపరిమితి దాటిపోయిన నేపథ్యంలో వారికి ఉద్యోగాలు ఇవ్వలేమని కోర్టులో విన్నవించారు.
పలు దఫాలుగా కోర్టులో పిటిషన్‌లు వేసిన అభ్యర్థులు అసలు మెరిట్ జాబితాను దేని ఆధారంగా రూపొందించి ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని కోరారు. కోర్టులో జిల్లా అధికారులు సమర్పించిన మెరిట్ జాబితా, రిజర్వేషన్ జాబితాలను సమాచార హక్కు చట్టం ద్వారా అందజేయాలన్నారు. కానీ డీఎంహెచ్‌ఓ కార్యాలయం అధికారులు ఉద్యోగాలు ఇచ్చిన మెరిట్ జాబితా ఫైలు కనిపించటం లేదని చెపుతూ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో బాధితులు సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ నెల 12న హాజరు కావాలంటూ సమాచార కమిషనర్ డీఎంహెచ్‌ఓ కార్యాలయం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఫైలు మాయం చేశారు... ల్యాబ్‌టెక్నీషియన్ల ఉద్యోగాలు ఇచ్చిన సమయంలో పనిచేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ కాటి సురేష్‌కుమార్, పరిపాలనాధికారి నారపుశెట్టి వెంకటరమేష్‌బాబు, సూపరింటెండెంట్ పోచంచర్ల వెంకటలక్ష్మీ చెన్నకేశవశర్మ పనితీరుపై ఉద్యోగాలు రాకుండా నష్టపోయిన అభ్యర్థులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చి తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఫైలు మాయం చేశారని ఆరోపిస్తున్నారు.
వివరణ...
ఈ విషయంపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ మీరావత్ గోపినాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి తమ కార్యాలయానికి ఆదేశాలు అందినట్లు తెలిపారు. గతంలో పనిచేసిన వారికి ఈ ఆదేశాలను అందజేశామన్నారు. వారు కమిషనర్ ఎదుట హాజరవుతారని వెల్లడించారు.
Advertisement
Advertisement