medical lab technician
-
మూగ జీవుల కోసం ‘వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్’.. సత్వర చికిత్స
సాక్షి, అమరావతి: మూగజీవాలు.. సన్నజీవాలు.. పెంపుడు జంతువుల్లో బయటకు కనిపించే గాయాలను బట్టి వైద్యం చేయించడం పెద్ద సమస్య కాదు. కానీ.. కడుపు నొప్పి, చెవిపోటు, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటే పసిగట్టడం కష్టమే. గుర్తించిన తర్వాత వాటిని మండల కేంద్రాలకు తీసుకెళ్లి వైద్యుల సలహా మేరకు మందులను వాడేవారు. వాటినుంచి నమూనాలు సేకరించి చిన్నచితకా పరీక్షలను ఆస్పత్రుల్లోనూ.. పెద్దపెద్ద పరీక్షలను జిల్లా స్థాయి ల్యాబ్‌లకు పంపి పరీక్షించేవారు. సిబ్బంది కొరత, సామర్థ్యం లోపాల వల్ల పరీక్షలు చేయాలంటే.. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి, మరికొన్ని సందర్భాల్లో నెలల తరబడి సమయం పట్టేది. ఈలోగా వ్యాధి తీవ్రత పెరిగి పశువులు మరణించడం వల్ల పోషకుల ఆర్థిక పరిస్థితి తల్లకిందులయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నియోజకవర్గ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్ ద్వారా క్షణాల్లో వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు సత్వర పశువైద్యసేవలు అందిస్తున్నారు. గతంలో జిల్లాకు ఒకటే ల్యాబ్ రాష్ట్రంలో 2019 లెక్కల ప్రకారం.. 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 కోట్ల కోళ్లు ఉండేవి. వీటి పోషకుల్లో నూటికి 95 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయడంతో పశుపోషణ రైతులకు లాభదాయకంగా మారింది. ఆర్బీకేల్లో 4,652 మంది పశు సంవర్ధక సహాయకులు సేవలందిస్తుండగా, మరో 5,160 సహాయకుల నియామకానికి కసరత్తు జరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు పశువుల్లో వచ్చే రోగాలను గుర్తించేందుకు గతంలో జిల్లాకు ఒకటి చొప్పున మాత్రమే వెటర్నరీ ల్యాబ్స్ ఉండేవి. పశువులకు నాణ్యమైన వైద్యసేవలు, సర్టిఫైడ్ ఇన్పుట్స్ అందించడమే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 154 వైఎస్సార్ పశుసంవర్ధక ల్యాబ్స్‌ను తీసుకొచ్చారు. వీటితోపాటు జిల్లా స్థాయిలో 10, ప్రాంతీయంగా 4, రాష్ట్ర స్థాయిలో స్టేట్ రిఫరల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ స్థాయి ల్యాబ్‌లతో పాటు నియోజకవర్గ స్థాయిలో 60 ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి రాగా.. 52 ల్యాబ్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 42 ల్యాబ్స్ ఈ నెలాఖరుకి అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏటా 15 వేల నుంచి 20 వేల శాంపిల్స్‌ను మించి పరీక్షించే సామర్థ్యం ఉండేది కాదు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ అందుబాటులోకి వచ్చాక.. ఈ ఏడాది 20 రకాల వ్యాధులకు సంబంధించి 1.86 లక్షలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించి.. వ్యాధి సోకిన పశువులకు సకాలంలో తగిన చికిత్స అందించగలిగారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా.. సీఎం వైఎస్ జగన్ ఆలోచన విప్లవాత్మకం. మూగజీవాల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. వీటితో నాణ్యమైన వైద్య సేవలందించడమే కాదు.. సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్‌ను సైతం సరఫరా చేయగలుగుతున్నాం. –ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ 24 గంటల్లో ఫలితం ఇచ్చారు నాకు 10 మేకలు, గొర్రెలు ఉన్నాయి. మేకలు ఐదు రోజులుగా పారుడు వ్యాధితో బాధపడుతూ మేత తినడం మానేశాయి. ఆర్బీకే సిబ్బంది సూచన మేరకు పరీక్ష కోసం మంగళగిరి ల్యాబ్‌కి నమూనా తీసుకెళ్లా. 24 గంటల్లోనే పరీక్షించి అంతర పరాన్న జీవులున్నాయని చెప్పగా, వైద్యుని సలహాతో తగిన వైద్యం చేయించాను. జీవాలన్నీ కోలుకున్నాయి. – టి.నాగరాజు, యర్రబాలెం, గుంటూరు జిల్లా వెంటనే రిపోర్ట్ ఇచ్చారు నేను 10 గేదెలు, 10 దూడల్ని మేపుతునా. రెండు గేదెలు 10 రోజులుగా పారుడు సమస్యతో తిండితినక కదల్లేని స్థితిలోకి చేరుకున్నాయి. పేడ నమూనాను జగ్గయ్యపేట ల్యాబ్‌కు తీసుకెళ్లా. పరీక్షిస్తే ‘బాలంటిడియం కోలి’ అనే జీవులు కడుపులో ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాను. ఇప్పుడు పశువులన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పరీక్షలకు పైసా కూడా తీసుకోలేదు. – డి.నాగరాజు, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా -
ఎంఎల్టీ చదువు.. ఉద్యోగం పట్టు
నెల్లిమర్ల: పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ తదితర ఉన్నత విద్యనభ్యసించినా ఉద్యోగం దొరకని రోజులివి. ప్రభుత్వ ఉద్యోగం లభించాలంటే అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి, లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ఉద్యోగాలకు సైతం సిఫారసులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. అయితే పదోతరగతి అర్హతతో రెండేళ్ల పాటు చదివే ఆ కోర్సుకు మాత్రం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఇంటర్ మీడియట్ స్థాయిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ కోర్సుతో ఉన్నత చదువులకు సైతం అవకాశం ఉంటుందంటున్నారు. అదే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులో నున్న మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) కోర్సు. అందుబాటులో ఉన్న సీట్లు ఉమ్మడి జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్‌కోట, సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు అందుబాటులో ఉంది. ఒక్కో కళాశాలలో 40 చొప్పున సీట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీవరకు ప్రవేశాలకు అవకాశముంది. ఇవి కాకండా మరో 18 ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఎంఎల్టీ కోర్సు అందుబాటులో ఉంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అవకాశముంది. కోర్సులో చేరే విద్యార్థులు రెండేళ్ల పాటు చదవాల్సి ఉంటుంది. థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఉన్నత చదువులకు అవకాశం ఇంటర్మీడియట్‌తో సమానమైన ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బీఎస్సీలో ఎంఎల్టీ చదవడానికి అవకాశముంది. అలాగే బీఎస్సీలో మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ కోర్సులు చదవవచ్చు. అంతేకాకుండా ఎంసెట్ ప్రవేశపరీక్ష రాయడానికి అవకాశముంటుంది. బీఎస్సీలో బీజెడ్సీ బ్రిడ్జి కోర్సుగా చదివే వీలుంది. ఉద్యోగాలు పొందిన విద్యార్థులు వీరే నెల్లిమర్ల సీకేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వి.భవాని ఎస్‌కోట మండలం పీఎం పాలెం పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం సాధించారు. కోరాడ ఉమామహేశ్వరరావు పూసపాటిరేగ మండలం గోవిందపురం పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఎం శ్రీదేవి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో, జె.ప్రణతి, ఎస్ భారతి, బి.అక్షిత, జె.శైలజ, బి.తేజసాయి, బి.అజయ్‌కుమార్ న్యూ లైఫ్ బ్లాడ్ బ్యాంకులోనూ ఉద్యోగాలు సాధించారు. ఈ కోర్సు చదివిన అందరూ ఏదో విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మిగిలిన వారంతా స్వయంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుని, స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగం గ్యారంటీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) కోర్సుతో ఉద్యోగం కచ్చితంగా లభిస్తుంది. ప్రతిభ ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట, సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూప్ అందుబాటులో ఉంది. వచ్చేనెల 20వ తేదీవరకు ప్రవేశాలకు అవకాశముంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలి. – మజ్జి ఆదినారాయణ, ఆర్ఐఓ -
మెడికల్ కాలేజీలోనే కరోనా పరీక్షలు
-
ఫైలు గల్లంతు
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేశారు. తీరా నష్టపోయిన అభ్యర్థులు కోర్టు కెళ్లటంతో ఉద్యోగాలు ఇచ్చిన ఫైల్ కనిపించటం లేదంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయానికి హాజరుకాకుండా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇంత ఘనకార్యానికి పాల్పడింది ఎవరో కాదు..సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వారే. కళ్ల ఎదుటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నా ఎలాంటి భయం లేకుండా ఇష్టానుసారం గా నియామకాలు చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు. గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఖాళీగా ఉన్న 25 ల్యాబ్ టెక్నీషియన్ల (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి1998 అక్టోబరు 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(డీఎంఎల్టీ)కోర్సు పూర్తిచేసిన 14 మందికి ఈ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇంటర్ ఒకేషనల్ డీఎంఎల్టీ కోర్సు పూర్తిచేసి దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగాలు రాని అభ్యర్థులు.. 1995లో ఒకేషనల్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి నేడు తిరస్కరించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటీరియమ్ రిలీఫ్ ఆర్డర్‌తో కొందరు అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. టెక్నీషియన్ పోస్టును ల్యాబ్ అటెండెంట్‌గా కింది స్థాయి పోస్టుకు కుదించి ఉద్యోగాలు ఇవ్వమని కోర్టు ఆదేశించటంతో కె.రామకృష్ణ, ఎన్.వెంకటరావు, జి.నాగేశ్వరరెడ్డి అనే ముగ్గురు అభ్యర్థులకు 2007 జూలై 25న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. కేవలం ముగ్గురికి మాత్రమే ఇవ్వడంతో మిగిలిన అభ్యర్థులు తిరిగి తమకు అన్యాయం జరిగిందని కోర్టును అశ్రయించారు. మెరిట్ ఉన్నవారికి ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. బీసీ-డి అభ్యర్థులకు పోస్టులు లేకపోయినా ఇరువురికి, ఓసీ కేటగిరిలో మరొకరికి పోస్టు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మిగిలిన అభ్యర్థుల అర్హతలు పరిశీలించి పోస్టులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మాత్రం అభ్యర్థులు తాము తయారు చేసిన మెరిట్ జాబితాలో లేరని, ఉద్యోగ నోటిఫికేషన్ కాలపరిమితి దాటిపోయిన నేపథ్యంలో వారికి ఉద్యోగాలు ఇవ్వలేమని కోర్టులో విన్నవించారు. పలు దఫాలుగా కోర్టులో పిటిషన్లు వేసిన అభ్యర్థులు అసలు మెరిట్ జాబితాను దేని ఆధారంగా రూపొందించి ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని కోరారు. కోర్టులో జిల్లా అధికారులు సమర్పించిన మెరిట్ జాబితా, రిజర్వేషన్ జాబితాలను సమాచార హక్కు చట్టం ద్వారా అందజేయాలన్నారు. కానీ డీఎంహెచ్ఓ కార్యాలయం అధికారులు ఉద్యోగాలు ఇచ్చిన మెరిట్ జాబితా ఫైలు కనిపించటం లేదని చెపుతూ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో బాధితులు సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ నెల 12న హాజరు కావాలంటూ సమాచార కమిషనర్ డీఎంహెచ్ఓ కార్యాలయం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఫైలు మాయం చేశారు... ల్యాబ్టెక్నీషియన్ల ఉద్యోగాలు ఇచ్చిన సమయంలో పనిచేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ కాటి సురేష్‌కుమార్, పరిపాలనాధికారి నారపుశెట్టి వెంకటరమేష్‌బాబు, సూపరింటెండెంట్ పోచంచర్ల వెంకటలక్ష్మీ చెన్నకేశవశర్మ పనితీరుపై ఉద్యోగాలు రాకుండా నష్టపోయిన అభ్యర్థులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చి తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఫైలు మాయం చేశారని ఆరోపిస్తున్నారు. వివరణ... ఈ విషయంపై డీఎంహెచ్ఓ డాక్టర్ మీరావత్ గోపినాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి తమ కార్యాలయానికి ఆదేశాలు అందినట్లు తెలిపారు. గతంలో పనిచేసిన వారికి ఈ ఆదేశాలను అందజేశామన్నారు. వారు కమిషనర్ ఎదుట హాజరవుతారని వెల్లడించారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కడప రూరల్, న్యూస్‌లైన్ : మెప్మా, అపిట్కో హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్లలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అపిట్కో జిల్లా సమన్వయకర్త రామకృష్ణారెడ్డి, శిక్షణా నిర్వాహకుడు ఎస్.గౌస్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల ఉచిత సాంకేతిక శిక్షణతోపాటు ఉపాధి కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 18-35 లోపు వయస్సు అర్హత కలిగి, కడప పట్టణంలో నివసించేవారై ఉండాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు డోర్ నెం 1/2237, ఎంఐజీ 23ఏ, ఎల్ఐసీ సర్కిల్, ఆర్‌ఎస్‌రోడ్డు, ప్రసాద్ గ్యాస్ దగ్గర అనే చిరునామాలో సంప్రదించాలన్నారు. అలాగే 9491417490, 9989334063, 99127 71325 అనే నంబర్లలో కూడా సంప్రదించవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.