మూగ జీవుల కోసం ‘వైఎస్సార్‌ వెటర్నరీ ల్యాబ్స్‌’.. సత్వర చికిత్స | Special Treatments For Animals At YSR Veterinary Labs | Sakshi
Sakshi News home page

మూగ జీవుల కోసం ‘వైఎస్సార్‌ వెటర్నరీ ల్యాబ్స్‌’.. సత్వర చికిత్స

Published Sun, Oct 23 2022 8:41 AM | Last Updated on Sun, Oct 23 2022 9:13 AM

Special Treatments For Animals At YSR Veterinary Labs - Sakshi

సాక్షి, అమరావతి: మూగజీవాలు.. సన్నజీవాలు.. పెంపుడు జంతువుల్లో బయటకు కనిపించే గాయాలను బట్టి వైద్యం చేయించడం పెద్ద సమస్య కాదు. కానీ.. కడుపు నొప్పి, చెవిపోటు, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటే పసిగట్టడం కష్టమే. గుర్తించిన తర్వాత వాటిని మండల కేంద్రాలకు తీసుకెళ్లి వైద్యుల సలహా మేరకు మందులను వాడేవారు. 

వాటినుంచి నమూనాలు సేకరించి చిన్నచితకా పరీక్షలను ఆస్పత్రుల్లోనూ.. పెద్దపెద్ద పరీక్షలను జిల్లా స్థాయి ల్యాబ్‌లకు పంపి పరీక్షించేవారు. సిబ్బంది కొరత, సామర్థ్యం లోపాల వల్ల పరీక్షలు చేయాలంటే.. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి, మరికొన్ని సందర్భాల్లో నెలల తరబడి సమయం పట్టేది. ఈలోగా వ్యాధి తీవ్రత పెరిగి పశువులు మరణించడం వల్ల పోషకుల ఆర్థిక పరిస్థితి తల్లకిందులయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నియోజకవర్గ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ ల్యాబ్స్‌ ద్వారా క్షణాల్లో వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు సత్వర పశువైద్యసేవలు అందిస్తున్నారు.

గతంలో జిల్లాకు ఒకటే ల్యాబ్‌
రాష్ట్రంలో 2019 లెక్కల ప్రకారం.. 46 లక్షల ఆవులు, 62 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 కోట్ల కోళ్లు ఉండేవి. వీటి పోషకుల్లో నూటికి 95 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయడంతో పశుపోషణ రైతులకు లాభదాయకంగా మారింది. ఆర్బీకేల్లో 4,652 మంది పశు సంవర్ధక సహాయకులు సేవలందిస్తుండగా, మరో 5,160 సహాయకుల నియామకానికి కసరత్తు జరుగుతోంది. 

నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు పశువుల్లో వచ్చే రోగాలను గుర్తించేందుకు గతంలో జిల్లాకు ఒకటి చొప్పున మాత్రమే వెటర్నరీ ల్యాబ్స్‌ ఉండేవి. పశువులకు నాణ్యమైన వైద్యసేవలు, సర్టిఫైడ్‌ ఇన్‌పుట్స్‌ అందించడమే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌కు అనుబంధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 154 వైఎస్సార్‌ పశుసంవర్ధక ల్యాబ్స్‌ను తీసుకొచ్చారు. 

వీటితోపాటు జిల్లా స్థాయిలో 10, ప్రాంతీయంగా 4, రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ రిఫరల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ స్థాయి ల్యాబ్‌లతో పాటు నియోజకవర్గ స్థాయిలో 60 ల్యాబ్స్‌ సేవలు అందుబాటులోకి రాగా.. 52 ల్యాబ్స్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 42 ల్యాబ్స్‌ ఈ నెలాఖరుకి అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఏటా 15 వేల నుంచి 20 వేల శాంపిల్స్‌ను మించి పరీక్షించే సామర్థ్యం ఉండేది కాదు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వైఎస్సార్‌ వెటర్నరీ ల్యాబ్స్‌ అందుబాటులోకి వచ్చాక.. ఈ ఏడాది 20 రకాల వ్యాధులకు సంబంధించి 1.86 లక్షలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించి.. వ్యాధి సోకిన పశువులకు సకాలంలో తగిన చికిత్స అందించగలిగారు.

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా..
సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన విప్లవాత్మకం. మూగజీవాల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్స్‌ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. వీటితో నాణ్యమైన వైద్య సేవలందించడమే కాదు.. సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్‌ను సైతం సరఫరా చేయగలుగుతున్నాం.    
–ఆర్‌.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ

24 గంటల్లో ఫలితం ఇచ్చారు
నాకు 10 మేకలు, గొర్రెలు ఉన్నాయి. మేకలు ఐదు రోజులుగా పారుడు వ్యాధితో బాధపడుతూ మేత తినడం మానేశాయి. ఆర్బీకే సిబ్బంది సూచన మేరకు పరీక్ష కోసం మంగళగిరి ల్యాబ్‌కి నమూనా తీసుకెళ్లా. 24 గంటల్లోనే పరీక్షించి అంతర పరాన్న జీవులున్నాయని చెప్పగా, వైద్యుని సలహాతో తగిన వైద్యం చేయించాను. జీవాలన్నీ కోలుకున్నాయి.
– టి.నాగరాజు, యర్రబాలెం, గుంటూరు జిల్లా

వెంటనే రిపోర్ట్‌ ఇచ్చారు
నేను 10 గేదెలు, 10 దూడల్ని మేపుతునా. రెండు గేదెలు 10 రోజులుగా పారుడు సమస్యతో తిండితినక కదల్లేని స్థితిలోకి చేరుకున్నాయి. పేడ నమూనాను జగ్గయ్యపేట ల్యాబ్‌కు తీసుకెళ్లా. పరీక్షిస్తే ‘బాలంటిడియం కోలి’ అనే జీవులు కడుపులో ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాను. ఇప్పుడు పశువులన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పరీక్షలకు పైసా కూడా తీసుకోలేదు.
– డి.నాగరాజు, జగ్గయ్యపేట, ఎన్టీఆర్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement