DMLT
-
బువ్వపెట్టించండి సారూ..
సాక్షి, ఏటూరునాగారం: గిరిజన యువతీ, యువకులను వృత్తి నైపుణ్యులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐటీడీఏ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2019 సెప్టెంబర్‌లో జీఎన్ఎం, డీఓటీ, డీఎంఎల్టీ కోర్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానించారు. దరఖాస్తుదారులనుంచి 58 మందిని ఐటీడీఏ అధికారులు అక్టోబర్ 5న ఎంపిక చేశారు. ఇందులో 40 మందిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి జీఎన్ఎం, డీఎంఎల్టీ కోర్సుల్లో శిక్షణ నిమిత్తం పంపించారు. మిగతా వారిని వరంగల్, కరీనంగర్ వైద్య కోర్సులకు పంపించారు. అయితే హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని గిరిజన హాస్టల్స్‌లో నాలుగు నెలలుగా 40 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి భోజనం, వసతితోపాటు ఉపకార వేతనాలు, హాస్టల్‌కు మెస్‌చార్జీలు కూడా అందించాల్సి ఉంది. నాలుగు నెలల నుంచి ఇవ్వకపోవడంతో అక్కడి నిర్వాహకులు విద్యార్థులను చిన్న చూపు చూడడం, అందులో ఉండే డిగ్రీ విద్యార్థులకు మాంసం భోజనాలు పెట్టి వీరికి పెట్టకపోవడంతో చిన్నబుచ్చుకున్న విద్యార్థులు చదువు కూడా ఒంటబట్టని పరిస్థితి నెలకొంది. అయితే వారికి విద్యార్థులకు కావాల్సిన భోజన బిల్లులను ఐటీడీఏ నుంచి రాకపోవడంతో అక్కడున్న నిర్వాహకులు భోజనం, పాలు, టిఫిన్ వడ్డించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. మెస్‌చార్జీలు ఇస్తేగాని సరైన భోజనం పెట్టని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు లేక హాస్టల్స్ నుంచి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రోజు పోయి రావడానికి బస్సు చార్జీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. దీంతో బస్‌పాస్‌లు కల్పించాలని అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏమిచేయలేక ఇంటి దగ్గర నుంచి డబ్బులు అందక కాలేజీకి పోలేని పరిస్థితి నెలకొంది. ఇటు మెస్‌చార్జీలు చెల్లించక, ఉపకార వేతనాలు అందక విద్యార్థులు కంటి నిండ నిద్ర, కడుపు తిండిలేకుండానే రోజులు వెళ్లదీస్తున్నారు. వృత్తి కోర్సులను నేర్పించడానికి తీసుకెళ్లిన అధికారులు విద్యార్థులు అలాన పాలన చూసుకోకుండా చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, పెరిగిన ఊరును వదిలేసి పట్టణంలో ఉంటున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని వినతి ఐటీడీఏ అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించి మెస్‌చార్జీలు ఇస్తేగానీ భోజనం పెట్టే పరిస్థితి లేదని విద్యార్థినులు వాపోతున్నారు. సోమవారం ఐటీడీఏ పీఓ హనుమంత్ కె జెండగేకు విన్నవించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపకార వేతనాలు, బస్‌పాస్, పుస్తకాలు, యూనిఫాం, సరైన వసతులు కల్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. స్పందించిన పీఓ ఏపీఓ వసంతరావు ద్వారా హైదరాబాద్‌లోని హాస్టల్ వార్డెన్‌కు ఫోన్లో మాట్లాడమని ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా బిల్లులను అందించడానికి చర్యలు చేపడుతున్నామని, మా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీఓ వార్డెన్‌ను ఫోన్లో కోరారు. -
మా కొడుకు జాడ చెప్పండి
సాక్షి, పెద్దపల్లి : జిల్లా విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్ విభాగంలో డివిజినల్ లెవల్ మానిటరింగ్ టీం మెంబర్ (డీఎంఎల్టీ)గా పనిచేస్తున్న ఎలగందుల రమేశ్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. లేఖ రాసి గత శనివారం నుంచి ఆచూకీ లేకుండా పోయిన అతని ఉదంతం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రమేశ్ జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకొడుకు ఆచూకీ చెప్పాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు రమేశ్ చిత్రపటాలతో మంగళవారం ఆందోళనకు దిగారు. తమ కుమారుడు కనిపించకుండా పోవడానికి కారణమైన జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమారుని ఆచూకీ దొరికే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి.. తనకు రావాల్సిన సెక్టోరల్ అధికారి పోస్టును ఇతరులకు ఇప్పించడంతో మనస్థాపానికి గురైన ఎలగందుల రమేశ్ నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తన చావుకు కారణం జీసీడీవో పద్మ పేరును ప్రస్తావిస్తూ లేఖను రాసిన విషయం విధితమే. కుటుంబ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచారు. రమేశ్‌కు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈవో జగన్మోహన్రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించి జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని కోరారు. స్పందించిన డీఈవో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కలిచివేసిన కన్నీళ్లు.. రమేశ్ ఆచూకీ కోసం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. రమేశ్ తల్లి మధునమ్మ తన కొడుకును క్షేమంగా తనకు అప్పగించాలని గుండెలవిసేలా రోధించింది. తాము పేదవాళ్లమని, అందుకే పోలీసులు, అధికారులు తమ కొడుకు కనిపించకుండా పోయినా పెద్దగా పట్టించుకోవడం లేదని క్షేమంగా వస్తే చాలని వేడుకుంది. రమేశ్ తమ్ముడు, చెల్లె, బంధువులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ఫైలు గల్లంతు
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేశారు. తీరా నష్టపోయిన అభ్యర్థులు కోర్టు కెళ్లటంతో ఉద్యోగాలు ఇచ్చిన ఫైల్ కనిపించటం లేదంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయానికి హాజరుకాకుండా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇంత ఘనకార్యానికి పాల్పడింది ఎవరో కాదు..సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వారే. కళ్ల ఎదుటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నా ఎలాంటి భయం లేకుండా ఇష్టానుసారం గా నియామకాలు చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు. గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఖాళీగా ఉన్న 25 ల్యాబ్ టెక్నీషియన్ల (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి1998 అక్టోబరు 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(డీఎంఎల్టీ)కోర్సు పూర్తిచేసిన 14 మందికి ఈ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇంటర్ ఒకేషనల్ డీఎంఎల్టీ కోర్సు పూర్తిచేసి దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగాలు రాని అభ్యర్థులు.. 1995లో ఒకేషనల్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి నేడు తిరస్కరించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటీరియమ్ రిలీఫ్ ఆర్డర్‌తో కొందరు అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. టెక్నీషియన్ పోస్టును ల్యాబ్ అటెండెంట్‌గా కింది స్థాయి పోస్టుకు కుదించి ఉద్యోగాలు ఇవ్వమని కోర్టు ఆదేశించటంతో కె.రామకృష్ణ, ఎన్.వెంకటరావు, జి.నాగేశ్వరరెడ్డి అనే ముగ్గురు అభ్యర్థులకు 2007 జూలై 25న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. కేవలం ముగ్గురికి మాత్రమే ఇవ్వడంతో మిగిలిన అభ్యర్థులు తిరిగి తమకు అన్యాయం జరిగిందని కోర్టును అశ్రయించారు. మెరిట్ ఉన్నవారికి ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు. బీసీ-డి అభ్యర్థులకు పోస్టులు లేకపోయినా ఇరువురికి, ఓసీ కేటగిరిలో మరొకరికి పోస్టు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు మిగిలిన అభ్యర్థుల అర్హతలు పరిశీలించి పోస్టులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మాత్రం అభ్యర్థులు తాము తయారు చేసిన మెరిట్ జాబితాలో లేరని, ఉద్యోగ నోటిఫికేషన్ కాలపరిమితి దాటిపోయిన నేపథ్యంలో వారికి ఉద్యోగాలు ఇవ్వలేమని కోర్టులో విన్నవించారు. పలు దఫాలుగా కోర్టులో పిటిషన్లు వేసిన అభ్యర్థులు అసలు మెరిట్ జాబితాను దేని ఆధారంగా రూపొందించి ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని కోరారు. కోర్టులో జిల్లా అధికారులు సమర్పించిన మెరిట్ జాబితా, రిజర్వేషన్ జాబితాలను సమాచార హక్కు చట్టం ద్వారా అందజేయాలన్నారు. కానీ డీఎంహెచ్ఓ కార్యాలయం అధికారులు ఉద్యోగాలు ఇచ్చిన మెరిట్ జాబితా ఫైలు కనిపించటం లేదని చెపుతూ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో బాధితులు సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ నెల 12న హాజరు కావాలంటూ సమాచార కమిషనర్ డీఎంహెచ్ఓ కార్యాలయం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఫైలు మాయం చేశారు... ల్యాబ్టెక్నీషియన్ల ఉద్యోగాలు ఇచ్చిన సమయంలో పనిచేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ కాటి సురేష్‌కుమార్, పరిపాలనాధికారి నారపుశెట్టి వెంకటరమేష్‌బాబు, సూపరింటెండెంట్ పోచంచర్ల వెంకటలక్ష్మీ చెన్నకేశవశర్మ పనితీరుపై ఉద్యోగాలు రాకుండా నష్టపోయిన అభ్యర్థులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చి తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఫైలు మాయం చేశారని ఆరోపిస్తున్నారు. వివరణ... ఈ విషయంపై డీఎంహెచ్ఓ డాక్టర్ మీరావత్ గోపినాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి తమ కార్యాలయానికి ఆదేశాలు అందినట్లు తెలిపారు. గతంలో పనిచేసిన వారికి ఈ ఆదేశాలను అందజేశామన్నారు. వారు కమిషనర్ ఎదుట హాజరవుతారని వెల్లడించారు.