= ప్రజల బలహీనతే వాటి నిర్వాహకులకు వరం
= నూజివీడు ప్రాంతంలోనే రూ.3.50కోట్లకు టోపీ
నూజివీడు, న్యూస్‌లైన్ : ప్రజల అమాయకత్వం.. అత్యాశే పెట్టుబడిగా పుట్టుకొస్తున్న ఫైనాన్స్ సంస్థలు వారిని నిలువునా ముంచేస్తున్నాయి. వీటి మాయాజాలంలో పడి ఆర్థిక, సామాజిక, కుటుంబపరంగా ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఎక్కువ వడ్డీ అశచూ పి అమాయకులైన పేదప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చే సి వారిని మోసగిస్తున్నాయి. గత ఎనిమిది నెలల కాలంలో నూజివీడు ప్రాంతంలో మూడు సంస్థలు బోర్డు తిప్పేశాయి.
మైలవరంలో కూడా డిపాజిట్‌దారులను మోసగించిన ఓ సంస్థ భాగోతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలు ప్రారంభంలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ ఏజంట్లను నియమించుకుని డిపాజిట్లు వసూలు చేసి బోర్టులు తిప్పేస్తున్నాయి. ఒక్క నూజి వీడు డివిజన్ పరిధిలోనే దాదాపు రూ.3.50కోట్ల వరకు డిపాజిట్‌దారులు నష్టపోయారు. ఈ సంస్థలు పేద వర్గాల ప్రజలు, రోజువారీ కూలిపనులు చేసుకునేవారు, చేతివృత్తుల వారిని ఆకర్షించి, డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. వీటి మో సాలపై పోలీసులు దృష్టిపెట్టడం లేదు.
రెండేళ్ల క్రితం ఏర్పా టు చేసిన అభయగోల్డ్ సంస్థ నూజివీడు, ముసునూరు,చాట్రాయి తదితర మండలాల్లోని దాదాపు రెండు వేల మంది నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ అధినేత కుక్కట్ల శ్రీనివాసరావు రాష్ట్ర వ్యా ప్తంగా దాదాపు రూ.100కోట్లు వసూలు చేసి డిపాజిట్‌దారుల నోట్లో మట్టికొట్టాడు. డిపాజిట్‌దారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శ్రీనివాసరావును అరెస్టు చేశా రు. తరువాత ఈ కేసు పురోగతి గురించి వారు పట్టించుకోవడంలేదు.
దీంతో డిపాజిట్‌దారుల్లో ఆందోళన నెలకొంది. అలాగే నూజివీడులో మైత్రిప్లాంటేషన్, హార్టీకల్చర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పేదల నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి గత జూలై నెలలో బోర్డు తిప్పేసింది. మెచ్యూరిటీ పూర్తయిన డిపాజిట్లకు సంబంధించి సొమ్ము చెల్లించకపోవడంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ సంస్థకు చెందిన డెరైక్టర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఇదే సంస్థ మైలవరం ప్రాంతంలో కూడా రూ.2 కోట్లు వరకు సేకరించి పత్తాలేకుండా పోయింది.
వైజాగ్‌కు చెందిన శ్రీచక్రగోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ అనే సంస్థ కూడా గత నెలలో నూజివీడులో బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ వైజాగ్‌లో కూడా బోర్డు తిప్పేయడంతో అక్కడ కేసు నమోదైనట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ సంస్థ నూజివీడు ప్రాంతంలో పేద వర్గాల నుంచి రూ.50 లక్షల వరకు సేకరించింది. ఈ మూడు సంస్థల్లో డిపాజిట్లు చేసిన వారు, ఏజెంట్లు సొమ్ము కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సొమ్ము ఎప్పటికి చేతికి అందుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.