
కాసులున్నా .. కదలరు
అభివృద్ధి పనులకు నిధులు రాబట్టడంలో నిర్లక్ష్యం
మంజూరైన వాటిని ఖర్చు చేయడంలోనూ అదే తీరు
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రే పథకాలకు నిధులున్నా ఆగిన పనులు
బీఆర్‌జీఎఫ్ నిధుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూపులు
తిరుపతి కార్పొరేషన్: నగరపాలక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులను ఇస్తున్నాయి. ఆయా ప్రభుత్వాల నుంచి నిధులను సకాలంలో రాబట్టుకోవడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు వస్తాయన్న నమ్మకంతో ముందస్తుగా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి నిధుల కోసం ఆశగా ఎదురు చూడాల్సి వస్తోంది. నగరంలోని 43 మురికివాడల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న నిరుపేదలకు రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకం ద్వారా పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేందుకు గత ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే 7009 మంది అర్హులైన గుర్తించింది. అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నేతృత్వంలో ఏర్పేడు సమీపంలోని కోబాక వద్ద దాదాపు 70 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.
దీంతో 7009 పక్కా గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.292 కోట్లను మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి శిలాఫలకం కూడా ప్రారంభించారు. తమ కల నెరవేరుతుందని ఆశగా ఉన్న పేదలకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మొండిచేయి చూపింది. పక్కా గృహాల నిర్మాణ పనులకు సాంకేతిక కారణాలను చూపిస్తూ నిర్మాణ పనులకు మోకాలడ్డుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మార్చి లోగా గృహనిర్మాణ పనులకు నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లిపోతాయని నిరుపేదలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా అధికార యంత్రాంగం మాత్రం మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.
ఇలాంటివే మరికొన్ని ..
2009లో జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం ద్వారా దామినేడు, అవిలాల లేఔట్‌లో 4056 పక్కా గృహాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.124.17 కోట్లతో అంచనా వేసింది. ఇప్పటి వరకు కేవలం రూ.34 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
పాడిపేట, అవిలాల వద్ద రూ.136.91 కోట్లు నిధులతో 3360 పక్కా గృహాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. నిధులు మాత్రం రూ.44 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిధుల కోసం పెట్టిన ఫైల్ ఈఎన్‌సీ క్లియరెన్స్ పొంది ప్రభుత్వం దగ్గర వేచి చూస్తోంది.
సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం రూ.23 కోట్లు మంజూరైతే అందులో కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బీఆర్‌జీఎఫ్ పథకం కింద రూ. 2.27 కోట్లు కేటాయిస్తే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.
ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా మురికివాడల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.1.90 కోట్ల విడుదల చేస్తే ఖర్చు చేసింది కేవలం రూ.50 లక్షలు మాత్రమే.
మంజూరైన నిధులను రాబట్టుకునేందుకు, ఎస్టిమేషన్లు సకాలంలో ప్రభుత్వానికి పంపకపోవడంతో నిధులు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులు ఉన్నా వాటిని సకాలంలో ఖర్చు చేయడంలో యంత్రాంగం లోపమూ ఓ కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. నిధులున్నా కళ్లముందే అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు మాత్రం బహిరంగంగా వినిపిస్తున్నాయి.