ఫైనాన్స్ వ్యాపారి తోట ఫణీంద్రరావు(55) అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆయన మృతదేహం కొమానపల్లిలోని ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులో ఉందని పోలీసులు గుర్తించారు.
ముమ్మిడివరం/ఐ.పోలవరం :ఫైనాన్స్ వ్యాపారి తోట ఫణీంద్రరావు(55) అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆయన మృతదేహం కొమానపల్లిలోని ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంకులో ఉందని పోలీసులు గుర్తించారు. ఐ.పోలవరం మండలం మురమళ్లకు చెందిన ఫణీంద్రరావు గత నెల 25న అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్లలో ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫణీంద్రరావు నిర్వహిస్తున్న ఫైనాన్స్ వ్యాపారంలో ఖాతాదారులపై పోలీసులు దృష్టిసారించారు. ఫణీంద్రరావు అదృశ్యమైన రోజు రాత్రి చివరగా కొత్తకాలువ వంతెనపై ఒక వ్యక్తితో మాట్లాడాడని దర్యాప్తులో తేలింది. ఆ తరువాత కొమానపల్లిలో ఖాతాదారుల నుంచి సొమ్ముల వసూలుకు ఫణీంద్రరావు వెళ్లలేదని గుర్తించారు. ఫణీంద్రరావు కొమానపల్లి-కాశివానిరేవు మధ్య అదృశ్యమయ్యాడని నిర్ధారించుకున్నారు.
దీంతో కొమానపల్లికి చెందిన కుంచనపల్లి శ్రీనివాసరావుపై అనుమానం వచ్చి అతని కదలికలపై కన్నేశారు. గురువారం రాత్రి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన పోలీసులకు అతని ఇంటి వీధి తలుపు వేసి ఉండడంతో మరింత అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూసేసరికి అతని బెడ్‌రూమ్‌లో ఓ మోటార్‌సైకిల్ కనిపించింది. అది ఫణీంద్రరావుది కావడంతో అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, ముమ్మిడివరం సీఐ కె.టి.డి.వి.రమణరావు శ్రీనివాసరావు ఇంటి తలుపుల తాళాలు తొలగించి లోనికి వెళ్లారు. ఫణీంద్రరావు మోటార్‌సైకిల్, సెల్‌ఫోన్, ఉంగరం, మోటార్‌సైకిల్ నంబరు బోర్డు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఫణీంద్రరావును హత్య చేసి ఉండవచ్చునని భావించిన పోలీసులు ఆ చుట్టుపక్కల గాలించారు. ఫణీంద్రరావు మృతదేహం శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ఉన్నట్టు గుర్తించారు. దానిని బయటకు తీశారు.
మృతదేహంపై ఉన్న దుస్తులు, బంగారు వస్తువుల ఆధారంగా ఫణీంద్రరావేనని గుర్తించారు. పదిరోజులు కావడంతో మృతదేహం బాగా కుళ్లి దుర్వాసన వస్తోంది. దీనిని ముమ్మిడివరం అగ్నిమాపక సిబ్బందితో శుభ్రం చేయించారు. ముమ్మిడివరం తహశీల్దారు జె.వెంకటేశ్వరి సమక్షంలో శవపంచనామా చేసి ముమ్మిడివరం వైద్యులు శిరీష, శాంతి లక్ష్మి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఫణీంద్రరావు హత్యకు గురైన విషయం బయటకు పొక్కడంతో కోనసీమ నలుమూలల నుంచి బంధువులు, స్నేహితులు, వ్యాపారులు భారీగా తరలివచ్చారు. ఫణీంద్రరావుకు బాకీ పడిన శ్రీనివాసరావే అతన్ని హత్య చేసి ఉంటాడని డీఎస్పీ అంకయ్య విలేకరులకు తెలిపారు. శ్రీనివాసరావుతోపాటు అతని భార్యా పిల్లలు పరారీలో ఉన్నారని చెప్పారు. ఫణీంద్రరావును హత్య చేసింది ఒకరా లేదా ఎంతమంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు.