సాక్షి, ఐ.పోలవరం(ముమ్మిడివరం): తెలంగాణ లో ‘దిశ’ హత్యాచారం మరువకముందే ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం జి.వేమవరంలో మద్యం మత్తులో ఓ మహిళపై హత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జి.వేమవరం గ్రామం చాకలిపేట చెరువుగట్టుకు చెందిన కేశనకుర్తి నాగమణి(60)పై సోమవారం రాత్రి ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న దూరపు బంధువు కేశనకుర్తి నాగబాబు ఈ హత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంటి పక్కనే ఉంటున్న ఓ వృద్ధురాలు మంగళవారం నాగమణిని పిలవగా.. ఆమె పలకలేదు. దీంతో తలుపు తట్టడంతో నాగమణి హత్యకు గురైనట్టు గుర్తించి స్థానికులకు చెప్పడంతో, వారు ఎస్సై ఎస్.రాముకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన నాగమణి హత్యకు గురైనట్టు గుర్తించి జిల్లా ఎస్పీకి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. క్లూస్ టీం హత్య జరిగిన గదిలో కారం జల్లి ఉండడం, మృతురాలి ఒంటిపై రక్తం ఉండడంతో పోలీసులు ఈ హత్య నగదు కోసమా, లైంగికదాడి జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ఇంటి ఆవరణ నుంచి రెండు ఇళ్ల అవతల ఉన్న నాగబాబు ఇంటికి వెళ్లి తిరిగి మృతురాలి ఇంటికి చేరుకొంది. దీంతో పోలీసులు నాగబాబు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులను, పక్కన ఉన్న వారిని విచారించారు. మృతురాలి ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఈ హత్య ఎలా జరిగిందనేది పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ జి.రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
నాగమణి భర్త, కుమారుడు గతంలో చనిపోయారు. ప్రభుత్వం అందిస్తున్న ఫింఛననుతో ఆమె జీవనం సాగిస్తుంది. కూతురు హైదరాబాద్, కోడలు, మనుమలు భీమనపల్లిలో ఉంటున్నారు. నాగబాబు కుటుంబానికి నాగమణి కుటుంబానికి కుటుంబ గొడవలు ఉన్నట్టు సమాచారం. నాగబాబుకు వివాహమైనా భార్యతో గొడవపడడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య లేక పోవడంతో వ్యసనాలకు బానిసైన నాగబాబు సోమవారం రాత్రి మద్యం సేవించి నాగమణి ఇంటిలోకి వెళ్లాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి హతమార్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వయస్సుతో సంబంధం లేకుండా విచక్షణా రహితంగా మహిళపై దాడి చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ ఘటనతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గ్రామంలో ఉన్న నాగబాబుకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి సీఐ రాజశేఖర్‌రెడ్డికి అప్పగించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని డీఎస్పీ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసులో తొలుత ముగ్గురు వ్యక్తులు మహిళను గ్యాంగ్ రేప్ చేసి ఉండవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. దీంతో నాగబాబుతో పాటు, గ్రామానికి చెందిన వర్రే బాబి, డేగల రాములను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
కేవలం 24 గంటల్లోనే..
కేశనకుర్తి నాగమణి(60) హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చెప్పిన ఆరు గంటల్లోనే హత్య చేసిన నిందితుడిని పట్టుకున్నామన్నారు. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా గ్రామానికి చెందిన నల్లా సుదర్శన్ ఇచ్చిన కీలక సమాచారంతో నిందితుడిని గుర్తించి కేసును కొలిక్కి తీసుకొచ్చారు.
కేసును పక్కదోవ పట్టించేందుకే కారం చల్లడం..
ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మహిళపై హత్యాచారం చేయడమే కాకుండా కేసును పక్కదోవ పట్టించేందుకు నాగబాబు కారంను ఉపయోగించాడు. గతంలో నాగబాబు అతడి భార్య తరచూ గొడవలు పడడంతో గత ఏడాది సామర్లకోటలో 498 కేసు, అలాగే కాకినాడ సర్పవరంలో దొంగతనం కేసు నమోదయ్యాయి. దీంతో జైలు జీవితం అనుభవించిన నాగబాబు తోటి ఖైదీలు కారం చల్లితే కేసు తప్పుదోవ పట్టించవచ్చని తెలపడంతో కారం చల్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పోస్టుమార్టానికి తరలింపు
హత్యకు గురైన నాగమణి మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్సై ఎస్.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment